ఎలక్షన్‌ డ్యూటీ

ఎలక్షన్‌ డ్యూటీనా రిటైర్మెంట్‌ ఇంకా పదిహేను రోజులుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌ నెల రోజులున్నాయి. ఈసారి ఎలక్షన్స్‌ డ్యూటీ చేసే బాధ తప్పింది.
అయితే అది వట్టి బాధే కాదు. ఒక జ్ఞాపకం కూడా. అందులోనూ మనం ఏరుకోదగిన అనుభవాలుంటాయి.
ఎలక్షన్‌ డ్యూటీ ఆర్డర్‌ చేతికి వచ్చిన వెంటనే ఉద్యోగులు ప్రభుత్వం చేతికింద కాకుండా ఎలక్షన్‌ కమిషన్‌ చేతి కిందకు వెడతారు. ఎలక్షన్‌ ఎల్లుండి ఉందన్నప్పుడే ఆర్డర్‌ వచ్చిన ఉద్యోగి ఎలక్షన్‌ సెంటరుకు వెళ్లి రిపోర్ట్‌ చేయాలి.
నేను ప్రభుత్వ కళాశాల ప్రినిసిపల్‌ని. నాకు సాధారణంగా ప్రిసైడింగ్‌ డ్యూటీ వచ్చేది. ఇక అదో పెద్ద హడావిడి.
ఇంట్లో రెండు మూడు రోజులు ముందే డ్యూటీ హాజరవడానికి ప్రిపరషన్‌ మొదలయేది. మా ఆవిడ ఎన్నో జాగ్రతలు చెప్పేది. అక్కడికి వెళ్ళాక ఎలక్షన్‌ బూతు నుండి బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పులిహోర, పూరీలు లాంటివి చేసేది అక్కడ తినడానికి.
బ్రీఫ్‌ కేస్‌లో లుంగీ, బనియన్‌, ఒక జత ఎక్సట్రా బట్టలు. అస్తమా ఉంది కాబట్టి అస్తాలిన్‌ ఇన్‌హేల్లర్‌, వేసుకోవలసిన ఇతరమందులన్నీ సర్దేది.
నేను ఏదో వీరకార్యం చేయడానికి వెడుతున్నట్టుగా పోజు కొడుతూ బయలు దేరేవాన్ని.
సెంటర్‌లో రిపోర్ట్‌ చేశాక నా టీం మెంబర్స్‌ లిస్టు ఇచ్చేవాళ్ళు. కాసేపట్లో నా టీం మెంబర్స్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, పోలింగ్‌ ఆఫీసుర్లు ఫోన్‌ చేసేవారు. తరువాత అందరం కలుసుకునేవాళ్ళం. పోలింగ్‌ ఆఫీసర్స్‌గా స్త్రీలు వస్తే పెద్ద చిక్కు ఉండేది. మేం రాత్రి పోలింగ్‌ స్టేషన్‌లో ఉండబోమని తెల్లవారి పోలింగ్‌ సమయానికి చేరుకుంటామని నన్ను బతిమాలేవారు. కాని అధికారులు అలాంటి అనుమతి అసలు ఇవ్వకూడదని హెచ్చరించేవారు.
పోలింగ్‌ మిషన్‌లతో సహా మా ఎలక్షన్‌ సామానులు పోలింగ్‌ లిస్టు అక్కడ సెంటర్‌లో తీసుకొని భద్రపరచుకునేవాళ్ళం. అంతా అయేసరికి సాయంత్రం అయ్యేది.
తెల్లారి పదిగంటలకల్లా అందరూ ఆ సెంటర్‌కి రావలసి ఉండేది. ఆ రాత్రి మా కళాశాల కొలీగ్స్‌తో ఏదో ఒక బసలో మందు పార్టీ. దేశ రాజకీయాల గురించి చర్చలు, ఏ పార్టీ గెలుస్తుంది, ఓడిపోతుంది అని చాలెంజ్‌లు. కవిత్వాలు, పద్యాలు, ఇట్లా గడిచి పోయేది.
తెల్లవారి మళ్ళీ సెంటర్‌కి చేరుకున్నాక మమ్ములని ఎలక్షన్‌ పెట్టెలు, ఇతర సామానులతో సహా బస్సులో పోలింగ్‌ బూతులకు తీసుకెళ్ళేవారు. చాలా దూరంగా చిన్న పల్లెలలో బడుల్లో ఈ బూతు లుండేవి. ఒక్కో బడిలో మూడు నాలుగు బూతు లుండేవి.
అన్నీ రేపటి పోలింగ్‌కి సిద్ధం చేసుకునే వాళ్ళం. తెచ్చుకున్న పదార్థాలు ఒకరివి ఒకరం పంచుకునే వాళ్ళం. రక్షణగా వచ్చిన పోలిసులు కూడా మాతో కలిసి తినేవారు.
రాత్రి పోలింగ్‌ బూతులో ఎన్నో కబుర్లు. ఏజెంట్లు వచ్చి కలిసేవారు. నాయకులు వచ్చేవారు. అధికారులు మాట మాటకి వచ్చేవారు. అంతా సందడి సందడి.
తెల్లవారి పోలింగ్‌. ఉదయం ఐదు గంటలకే నల్లాల కింద స్నానం చేసేవాళ్ళం. అంతా సిద్దమయేది. పోలింగ్‌ మొదలయ్యేది.
పాత రోజుల్లో నయితే ఆ ఊర్లోనే ఎవరో పెద్దమనిషి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసేవారు.
తరువాత కాలం మారిపోయింది. డబ్బులిచ్చి మధ్యాహ్న భోజనం తెప్పించుకునే వాళ్ళం.
పార్టీల వాళ్ళ డిస్ట్రబెన్స్‌.. ఏవో గొడవలు. ఒక్కోసారి భయం…భయం. ఒక్కోసారి పలకరింపులు.
సాయంత్రానికి పోలింగ్‌ పూర్తయాక పోలింగ్‌ బాక్స్‌ లాక్‌ చేసి సీలువేసి, సామాన్లు సర్దుకొని మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చే బస్సు కోసం ఎదురు చూసేవాళ్ళం.
రాత్రి ఏ ఎనిమిదింటికో బస్‌ వస్తే దానిలో పోలింగ్‌ సెంటర్‌కి వెళ్ళేవాళ్ళం.
అక్కడ తెచ్చినవన్నీ లైన్‌లో నిలబడి అధికారులకు సబ్మిట్‌ చేసేవాళ్ళం. తరచుగా అధికారులు రెమునరేషన్‌ ఇవ్వవలసిన డబ్బు దగ్గర గొడవ జరిగేది.
అంతా అయిపోయేవరకు రాత్రి పన్నెండయేది. అప్పుడు ఇంటికి పోలేం కాబట్టి నిన్నటి బసలో మందు పార్టీ.
మళ్ళీ పోలింగ్‌ అనుభవాలు.. ముచ్చట్లు. తామెంత గొప్పగా చేశామో చెప్పుకోవడాలు.
కొద్దిరోజులలో నేను రిటైర్‌ కాబోతున్నాను. వీటన్నిటికి దూరమౌతున్నాను. ఒక నిట్టూర్పు విడుస్తూ మా ఆవిడ ఇచ్చిన కాఫీ చప్పరించాను.
***
నాకు ఎన్నికల ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ డ్యూటీ వచ్చింది.
నేను ఎం.డి.ఓ. ఆఫీసుకి వెళ్లి చెప్పాను.
”నేను పదిహేను రోజుల్లో రిటైర్‌ అవబోతున్నాను సర్‌. ఎన్నికలయితే నెల రోజులున్నాయి. నేను రిటైర్‌ అయ్యాక ఎట్లా డ్యూటీ చేస్తాను?
”పొరపాటుగా వచ్చి ఉంటుంది. మీ సర్వీస్‌ వివరాలన్నీ సరిగ్గా పంపారా?” అడిగాడు ఎం.డి.ఓ.
”నేనే ప్రిన్సిపాల్‌ని కదా. అన్నీ దగ్గరుండి పంపించాను”
”సరే సర్‌. ఇది క్యాన్సిల్‌ చేసే పవర్‌ మాకు లేదు. మీరు ఆర్‌.డి.ఓ. దగ్గరకు వెళ్ళండి”
నేను చేయని తప్పుకు నన్ను తిప్పడం అన్యాయం అనిపించింది.
అయినా చేసేదేమీ లేక నా సర్వీసు వివరాలతో ఆర్‌.డి .ఓ. దగ్గరకు వెళ్ళాను.
”పొరపాటు జరిగిపోయింది. మా వాళ్ళు అలా రొటీన్‌లో పంపి ఉంటారు. ఒక లెటర్‌ ఇవ్వండి. క్యాన్సిల్‌ చేస్తాను” అన్నాడు.
ఆయన అడిగిన లెటర్‌ ఇచ్చి బయట పడ్డాను.
‘ఈ ఎలక్షన్‌ డ్యూటీకి మనకు ఇక సంబంధం లేదు’ అనుకున్నాను. తరువాత నా రిటైర్మెంట్‌ జరిగి పోయింది.
మనసులో బాధ అనిపించినా నిబ్బరంగా ఉన్నాను.
వీడ్కోలు సభలో చాలామంది మాట్లాడారు. నా గురించి చాలా అబద్దాలు చెప్పారు. నేను కూడా వాళ్ళ గురించి అబద్దాలు చెప్పాను. బహుమతులు ఇచ్చారు. కొందరు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు నా కాళ్ళకు నమస్కారం చేశారు.
మొత్తానికి ముగించుకొని, రిటైర్మెంట్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాలను ముగించి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకొని ఇంటి దారి పట్టాం. నాతో మా ఆవిడ, కూతురు,అల్లుడు కూడా ఉన్నారు.
****
తరువాత కొద్ది రోజులకు పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి.
నేను టీవీలో వార్తలు చూస్తూ టీ తాగుతున్నాను.
సమయం ఉదయం ఏడు గంటలు. ఇంకా పెద్దమ్మాయి కాల్‌ అమెరికా నుండి, చిన్నమ్మాయి కాల్‌ ఆస్ట్రేలియా నుండి రాలేదు. ఎదురు చూస్తున్నాను. ఫోన్‌ మోగింది. మా అమ్మాయి అనుకున్నాను. కాని కొత్త నెంబర్‌. ఫోన్‌ ఎత్తాను
”హలో” అన్నాను.
”హలో సర్‌”
”ఎవరండి?”
”నేను ఎం.ఆర్‌.ఓ. ఆఫీస్‌ నుండి మాట్లాడుతున్నాను. అందరికీ సమాచారం ఇద్దామని నేను పొద్దున్నే ఆఫీస్‌కి వచ్చాను”
”చెప్పండి”
”మా రెవెన్యూ వాళ్ళకి మీ ఎడ్యుకేషన్‌ వాళ్ళలా ఓ సమయమా పాడా. ఈ ఎలక్షన్స్‌ వస్తే ఇగ ఉన్నదీ…”
నాకు కొంచెం విసుగొచ్చింది. ”విషయం చెప్పండి” అన్నాను.
”విషయ మేముంది సర్‌. మీకు ఎలక్షన్‌ డ్యూటీ పడింది. ఇంకాసేపట్లో ఆర్డర్‌ ఇవ్వడానికి కాలేజీకి వస్తాను. మీకు సమాచారం ఇస్తున్నాను”
నాకు నవ్వు వచ్చింది. ”నాకు ఎలక్షన్‌ డ్యూటీ ఏమిటి? రిటైర్‌ అయ్యాక” అన్నాను.
అవతలి వ్యక్తి అదేమీ వినిపించుకోలేదు. ”నా కదంతా తెలియదు సర్‌. ఈ ఆర్డర్‌ మీ కాలేజీలో అందజేస్త. నా డ్యూటీ నేను చేస్తా” అన్నాడు.
అవతలివాడు పిచ్చివానిలా ఉన్నాడు అనుకుని ఫోన్‌ డిస్కనెక్ట్‌ చేశాను.
తరువాత స్నానం, ఉదయం అల్పాహారం పూర్తి చేశాను.షేక్స్పియర్‌ హామ్లెట్‌ మళ్ళీ చదవాలనిపించింది. మొదలు పెట్టాను. మళ్ళీ పది గంటల ప్రాంతంలో ఫోన్‌. కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌ నుంచి ”నమస్తే సర్‌, మీకు ఎలక్షన్‌ డ్యూటీ వచ్చింది.
పెద్దగా నవ్వాను. ”ఏమిటండీ. మీరు కూడా. రిటైర్‌ అయిన వాళ్లకు డ్యూటీ ఏమిటి?”
”అదే నాకు అర్థం కాలేదు. ఆ వచ్చినవాడు పొద్దున్నే కాలేజికి వచ్చి అందరి ఆర్డర్స్‌ అటెండర్‌కి ఇచ్చి, రిసీవ్ద్‌ అని రాయించుకొని సంతకం తీసుకొని వెళ్ళాడు”
”పోనీండి. మనకేమిటి? సర్వీస్‌లో ఉన్నవాళ్ళు వెళ్ళండి” ఫోన్‌ పెట్టేశాను.
పోలింగ్‌ రేపనగా మళ్ళీ ఫోన్‌ వచ్చింది.
”సర్‌, నేను పోలింగ్‌ సెంటర్‌ నుండి మాట్లాడుతున్నా. మీరు డ్యూటీకి హాజరు కాలేదు. చాలా ప్రమాదం. సస్పెండ్‌ కావడమే కాదు, అరెస్ట్‌ కూడా చేస్తారు”
నేను విసురుగా ఫోన్‌ పెట్టేశాను.
తెల్లవారి పోలింగ్‌. పోలింగ్‌ బూత్‌ నుండి మళ్ళీ కాల్‌.
”సర్‌, నేను ఎ.పి.ఓ. ను మాట్లాడుతున్నాను. మీరు కనీసం ఇప్పుడైనా రండి. లేకపోతే మీకే మంచిది కాదు. మీ బదులుగా రిజర్వ్‌లో ఉన్న వ్యక్తి వస్తున్నాడు”
విసుగ్గా చెప్పాను. ”నేను రిటైర్‌ అయ్యాను. రాత పూర్వకంగా ఇచ్చాను. ఎంత చెప్పినా ఇట్లా కాల్‌ చేస్తే ఏం చెప్పేది?”
”సారీ సర్‌. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది” ఎ.పి.ఒ. ఫోన్‌ పెట్టేశాడు.
పోలింగ్‌ అయిపొయింది. ఉద్యోగస్తులు తమ విధుల్లో చేరుతున్నారు. సమయం ఉదయం పదకొండు గంటలు కావస్తున్నది.
నేను వాలు కుర్చీలో పడుకొని హామ్లెట్‌ చదువుకొంటున్నాను.
మళ్ళీ నేను పని చేసిన కళాశాల నుండి ఫోన్‌. అవతల ప్రినిసిపాల్‌.
”సర్‌, చెప్పండి?”
”సర్‌, ఎలక్షన్‌ డ్యూటీకి హాజరు కాలేదని సస్పెష్షన్‌ ఆర్డర్‌”
నేను తెల్లబోయాను. క్షణం అర్థం కాలేదు. పెద్దగా పిచ్చిగా నవ్వసాగాను. చేతిలో ఫోన్‌ జారిపోయింది.
మా ఆవిడ వచ్చి బిత్తరపోతూ చూస్తోంది.
నేను నవ్వుతూ వాలు కుర్చీ పైన ఒరిగాను.

– కాంచనపల్లి గోవర్థనరాజు
9676096614

Spread the love