టిట్‌ ఫర్‌ టాట్‌

టిట్‌ ఫర్‌ టాట్‌తను పనిచేసే బల్లె అంతా కలిపి ఏడెనిమిది మంది టీచర్లు. వాళ్లందరు యాదగిరిని జెర అంటిముట్టనట్టుగనే చూస్తరు. అందుకు కారణం యాదగిరి ముక్కుసూటితనమే. గుంపుగ కూసోని లంచ్‌టైంల అందరు బాక్స్లు ఓపెన్‌ చేసి తినుకుంట, రోజూ ఏదో ఒక ముచ్చట ముంగటేసుకుంటరు. ఎవరికి తోచింది వాళ్లు చెప్పుతరు. రాజకీయాలు, కులాలు, ఉద్యోగుల పాలసీలు… ముఖ్యంగా రిజర్వేషన్ల గురించి ఏదో ఒక చర్చ చేస్తనే ఉంటరు. అసొంటి చర్చలల్ల యాదగిరిని రెచ్చగొట్టే మాటలనుడు… సైన్సు చెప్పే నర్సింహరెడ్డి సార్కి, తెలుగు శ్లోకాలు పుక్కిట పట్టిన గాయత్రి మేడమ్కు అలవాటే. వాళ్లను అంతే స్థాయిలో ఖండించుడు కూడా యాదగిరి సార్కు కూడా అలవాటే.
బతుకలేక బడిపంతులంటే ఒప్పుకోడు యాదగిరి. సదువు చెప్పుడంటే రేపటి తరాన్ని తయారు చేసుడు అనుకుంటడు. ముఖ్యంగా పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని నమ్ముతడు. అందుకే అంతే అంకితభావంతో బాధ్యతలు నిర్వహిస్తడు. బడి పిల్లలందరికీ యాదగిరి సారంటే బెల్లప్ప లెక్కన్నే. చేతిలో బెత్తమున్న ఒక్కనాడు కొట్టిన పాపాన పోడు. అందుకే పిల్లలు కూడా తమకు ఇష్టమైన సారు ఎవరని అడగకున్నా ‘యాదగిరి సార్‌’ పేరే చెప్తరు. అసొంటి ఆదర్శ ఉపాధ్యాయుడు యాదగిరి.
గిసొంటి యాదగిరికి నడీడు వయసు దాటినంక ఇదే బల్లె హెడ్మాస్టర్గ ప్రమోషన్‌ వొచ్చింది. ఇగ ఆ తెల్లారి నుండే లంచ్‌ టైంల కలిసితినే గ్రూపు… రెండుగా వేరుకుంపటి పెట్టింది. రండిసార్‌ కలిసి తిందాం అని పిలిస్తే నర్సింహరెడ్డి రాడు, గాయత్రి పలుకుడే లేదు. దీంతో యాదగిరికి ఏం సమజ్కాలె. ఏందీ కథ అనుకున్నడు. సరే, వాళ్ల ఆలోచనేందోలే అని మిగిలిన వాళ్లతో తినడం మొదలుపెట్టిండు. కాకుంటే చిన్నప్పటి నుండి ఊళ్లె బొచ్చెడు సూటిపోటి మాటలు పడ్డోడే యాదగిరి. ”మీకెందుకురా సదువులు? మీరు కూడా సదివితే మా పశువులు ఎవలు కాస్తర్రా” అన్న దొరల, పటేండ్ల మాటలు యాదగిరికి ఇంకా గుండెలకెల్లి తొలిగిందే లేదు. గిప్పుడు ఇట్లా తోటి కొలిగ్సే తనను దూరంపెట్టి తింటుంటే, లోపలెక్కడో మనుసుల కలుక్కుమంటున్నది. అయినా సర్దుకుపోదామని గుండెరాయి చేసుకున్నడు యాదగిరి.
హెచ్‌ఎంగా చార్జ్‌ తీసుకున్న దగ్గరి నుండి రూల్స్‌ విషయంలో మరింత స్ట్రిక్ట్‌గా మారిండు యాదగిరి. అసలే తనది వెలివాడ కులం. మరి ఏదన్న తప్పు జరిగితే, ఎవ్వడు ఎనుకేసుకొచ్చెటోడే ఉండడు. ఎంఈవోల దగ్గరి నుండి డీఈవో, విద్యాశాఖ మంత్రిదాకా అంత కులంబలమున్నోళ్లే. గందుకే ఒళ్లు దగ్గరపెట్టుకొని బడి నిర్వహణను భుజాల మీదేసుకున్నడు.
రెండు మూడు రోజుల సంది గాయత్రి మేడమ్‌ లేటే వస్తున్నది. ఆమె వచ్చేసరికే బడి ప్రార్థనైపోయి, పోరగాళ్లు క్లాస్‌ రూంలల్ల కూసుంటున్నరు. ఒక్కరోజు చూసిండు… రెండోరోజు చూసిండు. మూడరోజు అడుగుదాం అనుకున్నడుగాని, యాదగిరి మునుపే మొహమాటస్తుడు. ఇగ ఆడోళ్ల దగ్గరైతే ఇంకింత బిడియస్తుడు. నోరు తెరిచి ఏదీ గట్టగ చెప్పలేనోడు. అయినా సరే స్టాఫ్రూంల చెప్పుదామనుకున్నడు. మరి అందరి ముందర చెప్తే ఆడపిల్ల కదా నొచ్చుకుంటదేమోనని, చెప్పడానికి ఆ పూట బడి అయిపోయేదాక ఎదురుచూసిండు. గాయత్రి మాత్రం నాలుగున్నర ఎప్పుడైతదా, బల్లె ఎప్పుడు చుట్టీ గంట కొడుతరా అని ఎదురుచూసినట్టు… ఆదరబాదర తన బ్యాగు తీసుకొని, ఆఫీస్‌ రూమ్ల రిజిస్టర్‌ పడేసి, వెళ్లిపోతుంటే… హెచ్‌ఎం కుర్చీలో కూర్చున్న యాదగిరి, ఎవరూ లేనిది చూసి మెల్లగా నోరిప్పిండు…
”గాయత్రి మేడమ్‌… ఒక్కమాట” అనంగనే, ఆఫీస్‌ రూమ్‌ దర్వాజ దాటే మనిషే అంతే సర్రున ఎనుకకు తిరిగి…
”చెప్పండి సార్‌….” అంది.
”ఏం లేదు మేడమ్‌, నేనా… కొత్తగా చార్జ్‌ తీసుకున్న. ఏ ఎంఈవోనో, డీఈవోనో ఇన్స్పెక్షన్కు రావొచ్చు. మీరు కొంచెం టైంకి రండి…”
ఆ మాట యాదగిరి నోటి నుండి వచ్చిందో లేదో… గయ్యిన ఆయన మీదికి అంతెత్తున బుసకొట్టే పాములా లేచింది గాయత్రి.
”ఏం సార్‌ నేను మీకు ఎట్లా కనపడుతున్న? కావాలని నేను లేట్‌ వస్తున్నాన? ఏదో బస్‌ ఆలస్యమైతే ఒకటి రెండు రోజుల లేటొచ్చిన. అంతదానికే నన్ను దొంగను చేస్తర? అయినా మీరు చార్జ్‌ తీసుకోంగనే మాయన్నీ తప్పులు కనిపిస్తున్నయ… మీరెన్నడు లేటు రారా అది కూడా చూస్త” అని సవాల్‌ విసురుతూనే ఇంకా ఏవేవో అంటు నోరు నెత్తిన పెట్టుకున్నది.
యాదగిరి హెడ్మాస్టరే అయినా… ఆమె నోటికి పసిపోరని తీరు జడుసుకున్నడు. సుట్టూ సూశిండు. ఎవరు లేరని కన్ఫాం చేసుకున్నంక…
”ఎందుకు మేడమ్‌… అన్ని మాటలు… మీ మంచికోసమే కదా నేను చెప్పేది. ఎవరైన ఇన్స్పెక్షన్కి వస్తే, మిమ్మల్నే కాదు, నన్ను కూడా అంటరు. మీ దృష్టికి తెస్తే మీరు అర్థం చేసుకుంటరు అనుకున్న… మీరేమో…. ఇట్లా…” అని సైలెంట్‌ అయ్యిండు. గాయత్రి మాత్రం యాదగిరి చెప్పేది పూర్తికాక ముందే… ”పేనుకు పెత్తనం ఇస్తే… నెత్తంత కొరిగిందాట అట్లున్నది సార్‌ మీ యవ్వారం” అన్నది.
ఆ మాటకు యాదగిరికి సుర్రున కాలింది. కాకుంటే ఆడపిల్ల అని ఓపికపట్టిండు. కనీసం హెడ్మాస్టరని కూడా జెరంత మర్యాద ఇయ్యకుండా ఇలువ తక్కువ సామెతలు చెప్తున్నదని ఆ పూట నోరుకట్టేసుకున్నడు.
మల్ల తెల్లారి. ఇక లాభం లేదు… ఇయ్యాల లేటొస్తే మాత్రం కొంచెం గట్టిగనే చెప్పాలె అనుకున్నడు. యాదగిరి అనుకున్నట్టే నాలుగోరోజు కూడా గాయత్రి కావాలనే లేటుగనే వచ్చింది. ఆ లేటులో యాదగిరి ఏం చేస్తడో చూస్తా అన్న పట్టుదల కొట్టొచ్చినట్టే కనిపిస్తంది.
యాదగిరి బాగా నమ్మే ఫిలాసఫీ ఒకటున్నది. ఎవలన్న తప్పు చేస్తే ముందు వాళ్లకే చెప్పాలె, వాళ్లు మారకుంటే చుట్టూ ఉన్న సమాజానికి చెప్పాలె. అయినా మారకపోతే ఇక దేవునికే ఒదిలేయాలె అనుకుంటడు. అందుకే యాదగిరి ఈ పద్ధతినే గాయత్రి మీద కూడా ప్రయోగించాలనుకున్నడు.
ఇక ఇయ్యాల స్టాఫ్‌ మీటింగ్‌ పెట్టి, మినిట్స్‌ కమిటీలో పెట్టిన రూల్స్‌ అతిక్రమిస్తున్నారని చెప్పాలని అందరికీ స్కూల్‌ అయిపోయినంక స్టాఫ్‌ మీటింగ్‌ ఉంటదని నోటీస్‌ పంపించిండు.
అప్పటికే గాయత్రి ఏం చెప్పుకున్నదో ఏమో… గాయత్రితో పాటు, నర్సింహరెడ్డిసార్‌ కూడా జెరంత కోపం మీదనే స్టాఫ్‌ మీటింగ్కు వచ్చిన్రు.
అందరు వచ్చేదాకా కామ్గా ఉన్న హెడ్మాస్టర్‌ యాదగిరి మెల్లగా నోరిప్పిండు.
”అందరికీ గుడ్‌ ఈవినింగ్‌, నేను ఈ మధ్యనే హెడ్మాస్టర్గా చార్జ్‌ తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. దయచేసి మనకు కొన్ని రూల్స్‌ ఉన్నాయి. ఉపాధ్యాయులమైన మనమే సమయపాలన పాటించకుంటే పిల్లలేం పాటిస్తరో చెప్పండి” అంటూ తన ప్రసంగం మొదలుపెట్టిండు.
అంతలోనే నర్సింహరెడ్డి కల్పించుకున్నడు. ”ఇప్పుడు ఏమంటరు సార్‌, ఏదో మీరు హెడ్మాస్టర్‌ అయిన తరువాతే బడి మొదలైనట్టు చెబుతున్నరు. మీరు ఇట్లా గాయత్రి మేడమ్ను టార్గెట్‌ చేయడం అంతమంచిది కాదు” అని ముందే కంప్లెంట్‌ తీసుకున్న ఎస్సైలా దబాయించాడు.
ఈసారి ఆశ్చర్యపోవుడు యాదగిరి వంతైంది.
ఆ తరువాత గాయత్రి కూడా అందుకుంది. ”నన్ను టార్గెట్‌ చేస్తే నేనేందుకు ఊకుంట సార్‌. ఎవలకు చెప్పాలో వారికి చెప్తా, అవసరమైతే నేను ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ దాకా పోతా… మేమేం రిజర్వేషన్లో ఉద్యోగాలొస్తే కులుకుతున్నోళ్లం కాదు” అని కుండపగలగొట్టినట్టే అంది.
ఆ మాటలకు యాదగిరి మనసు మరోసారి కకావికలమైంది. తాను సరిదిద్దాలనుకున్నాడు. వాళ్లు సాగనంపాలనుకున్నారు. ఇంకేముంది యాదగిరికి బీపీ కట్టలు తెగి… ఒళ్లంతా వణికిపోతుంటే… కోపాన్ని ఆపుకోలేక వాళ్ల మీద అరిచినంత పని చేసిండు.
”మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే పడి ఉండడానికి ఎనుకటి కాలం కాదు గుర్తుపెట్టుకోండి. మీ మీద ఇప్పుడే వెళ్లి పోలీస్‌ స్టేషన్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగలను… ఏమనుకుంటున్నరో, నా సంగతి మీకు తెల్వదు” అని లేచి నిలబడి గట్టి వార్నింగే ఇచ్చిండు యాదగిరి.
ఈసారి గాయత్రి తరపున వఖాల్తా పుచ్చుకున్న లాయర్‌ లెక్క నర్సింహరెడ్డి లేచిండు… ”ఏం సార్‌ ఎంతకాలం భయపెడుతరో మేం కూడా చూస్తం. రండి మేడం, ఏం చేయాలో మనం కూడా తేల్చుకుందాం” అని రయ్యిన బైక్‌ స్టార్ట్‌ చేసి గాయత్రిని బైక్‌ మీద కూర్చోబెట్టుకొని వెళ్లిండు.
ఈ రభస జరిగిన రెండు రోజుల దాకా ఎవ్వరూ యాదగిరితో సరిగా మాట్లాడిందే లేదు. యాదగిరి కూడా ఇలాంటి వ్యక్తుల నడుమ తన పని తాను చేసుకుంటూ వెళ్తే మంచిదని, గమ్మున ఉండిపోయిండు.
ఆ మరుసటి రోజు యాదగిరికి ఉపాధ్యాయ సంఘాల నుండి ఫోన్‌ కాల్‌….
”చూడండి యాదగిరి సార్‌, మీకు మన యూనియన్ల సంగతి తెలుసు కదా. పైగా ఆ గాయత్రి మేడమ్కు ఎడ్యుకేషన్‌ మినిస్టర్‌ దూరపు బంధువు కూడ. అందుకే మీరు ఆమెను అనవసరంగా కదిలించకుండా ఉంటే మీకే మంచిది. ఇప్పుడు కంప్లయింట్‌ మా దగ్గరికొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే మీరు ఈపాటికి ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోండి” అన్నడు యూనియన్‌ లీడర్‌.
యాదగిరి చెప్పే మాటలు గానీ, వివరణ గానీ ఏదీ పట్టించుకోకుండా జస్ట్‌ వార్నింగ్‌ మాత్రం ఇచ్చిండు. బడి అయిపోయి చాలా సేపయ్యింది. ఒక్కడే ఆఫీస్రూంలో ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటున్నడు.
‘ఈ స్థాయికి రావడానికి ఎంత యుద్ధం చేశానో నాకు మాత్రమే తెలుసు. పస్తులున్నా పుస్తకాలతో కుస్తీ పట్టిన గతం నాది. ఉద్యోగమొస్తే చాలనుకున్న. ఉద్యోగం చేస్తూ కూడా ఎన్నో అవమానాలు పడ్డ. నాతో పని చేసిన వాళ్లు సర్వీస్‌ సీనియార్టి కింద ప్రమోషన్లు పొందినప్పుడు ఈ యూనియన్లే సన్మానాలు చేశారు, ఈ కొలిగ్సే అభినందన సభలు పెట్టారు. మరి నాకు మాత్రం హెడ్మాస్టర్ను అయ్యిననే సంతోషాన్ని ఒక్క వారం రోజులు కూడా మిగలకుండా ఎందుకు చేస్తున్నరు. అయినా తప్పదు, మళ్లీ నేను యుద్ధం చేయాల్సిందే’ అని నిర్ణయించుకున్నడు. ఏమైతే అదైంది. ఆత్మగౌరవాన్ని చంపుకోని పడి ఉండడం తన వల్ల కాదు అనుకున్నడు.
మరుసటి రోజు ఉదయం ఎప్పటిలెక్కన్నే బడికిపోయిండు. ఇయ్యాల గాయత్రి కూడా బడికి టైంకే వచ్చింది. ప్రార్థన ముగించుకొని పిల్లలు క్లాస్రూమ్లకు వెళ్లిన తరువాత, ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా హెడ్మాస్టర్‌ రూమ్లోకి వెళ్లి సంతకాలు చేసి క్లాసులకు వెళ్లిన్రు. మొదటి ఇంటర్వెల్లో యాదగిరి క్వార్టర్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ షెడ్యుల్‌ ప్రిపేర్‌ చేస్తున్నడు. అంతలోనే 9వ క్లాసు పిల్లలు నలుగురైదుగురు హెచ్‌ఎం రూం బయట నిలబడి…”మే ఐ కమిన్‌ సార్‌” అని అడిగిన్రు. ఆ మాట ఇని అప్పటిదాకా వంచిన తలను పైకెత్తిండు యాదగిరి. కళ్లద్దాలు సరి చేసుకుంటూ ”ఎస్‌ కమిన్‌” అన్నాడు.
సార్‌ మాకు మండే నుండి క్వార్టర్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ అన్నరు కదా. మరి తెలుగులో రెండు లెస్సన్స్‌ కూడా పూర్తి కాలేదు. మరి ఎలా రాయిమంటరు? అని పెద్దసార్‌ హౌదాలో ఉన్న యాదగిరిని అడిగిన్రు. ఆ మాటకు యాదగిరి జెరసేపు పరేషాన్‌ అయ్యిండు. ”అదేంది ఎందుకు కాలేదు. ఎవరు మీ సబ్జెక్‌ టీచర్‌” అని అడిగితే…”గాయత్రి మేడమ్‌…” పిల్లల మూకుమ్మడి సమాధానం. అంతే యాదగిరికి ఈసారి ఆమె మీద మరింత కోపం నషాలానికి ఎక్కింది. పిల్లలకు సదువు చెప్పకుండా జీతాలు తీసుకోవడానికా ఇక్కడ టీచర్లున్నది అని రగిలిపోయిండు. సరే నేను కనుక్కుంట, మీరు వెళ్లండి అని పిల్లలను పంపించి, ఆ సాయంత్రమే స్టాఫ్‌ మీటింగ్‌ పెట్టిండు.
జరిగిన విషయం పూసగుచ్చినట్టు చెప్పిండు. ఈసారి కూడా గాయత్రి మునుపటిలాగే చిర్రుబుర్రులాడింది. యాదగిరి పెద్దసార్‌ హోదాలో ఏది మాట్లాడినా తన మైండ్‌ ఆక్సెప్ట్‌ చేసే పరిస్థితిలో లేదు. అందుకే ఇప్పుడు కూడా యాదగిరి మీదున్న కోపంతో నిర్లక్ష్య సమాధానమే చెప్పింది. ”సర్కార్‌ టెక్స్ట్‌ బుక్స్‌ లేటుగ పంపితే, తప్పు నాదా? నన్ను కావాలని బద్నాం చేస్తే మంచిగుండదు సార్‌ చెప్తున్న” అంటూ మీటింగ్‌ నుండి మధ్యలోనే లేచి వెళ్లిపోయింది. ఆ వెళ్లడంలో నీకేంది సమాధానం చెప్పేది అన్న నిర్లక్ష్యం కూడా ఉంది. యాదగిరి మాత్రం మిగిలిన టీచర్లకు ఆమె నిజస్వరూపం అర్థం చేయించే పనిచేసిండు. ఆ మీటింగ్లో నర్సింహరెడ్డి కూడా ఉన్నడు. ఆ రోజుకు అలా గడిచింది.
ఆ తెల్లారి బడికొచ్చిన యాదగిరికి కాసేపటికే లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి మొబైల్కు కాల్‌… ”మీరు మీ కొలిగ్‌ గాయత్రి గారిని లైంగికంగా వేధిస్తున్నరని కంప్లైంట్‌ ఇచ్చిన్రు. మీరొకసారి స్టేషన్కు రావాలి” ఆర్డరేసినట్టే ఉంది కానిస్టేబుల్‌ గొంతు. అప్పటిదాకా నిలబడి ఉన్న యాదగిరి పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ‘ఏందీ దారుణం? నేను ఆమెను కనీసం కన్నెత్తి కూడా చూడను. అలాంటి నాపై ఇంతటి నిందలా’ అని విలవిలలాడిండు.
వెంటనే నర్సింహరెడ్డి కోసం వెతికాడు. కానీ, ఆయన, గాయత్రి బడి ఆవరణలో కనిపించలేదు. అప్పటికిగాని యాదగిరికి విషయం అర్థంకాలేదు. ఇద్దరూ పదురుకునే ఇట్లా తనపై కక్షగట్టారని అర్థం చేసుకున్నడు యాదగిరి. ఇక తన తప్పేమీ లేదని తనను తాను నిరూపించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసిండు. తన గురించి తెలిసిన వాళ్లను వీళ్లను పోలీస్‌ స్టేషన్కు తీసుకెళ్లి ఎస్సై ముందు సాక్ష్యాలు చెప్పించిండు. ఆఖరికి ఎట్లనోగట్ల అందులోకెళ్లి బయటపడేసరికి యాదగిరికి తలపాణం తోకకొచ్చింది. నర్సింహరెడ్డికి, గాయత్రికి మాత్రం యాదగిరి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూ దివాళ తీసిన కంపెనీల మారినతీరు మస్తు సంతోషాన్ని ఇచ్చింది. చాటుమాటుగా రోజూ నవ్వుకుంటూనే ఉన్నరు.
***
ఈ కుట్రలు, అవమానాలు, నిందలు దాటుకొని నిలదొక్కుకున్న యాదగిరి ఓ రోజు ఆఫీస్‌ రూంలో ఉన్నప్పుడు, పక్కనే ఉన్న స్టాఫ్‌ రూమ్లో నుండి గాయత్రి మాటలు స్పష్టంగా వినబడుతున్నయి. స్టాఫ్రూంలో ఒకలాంటి కోలాహలం ఉంది. తన కొడుకుకు ఖరగ్పూర్‌ ఐఐటీలో సీటొచ్చిందని స్వీట్లు పట్టుకొచ్చింది గాయత్రి. స్టాఫ్రూంలో అందరికీ స్వీట్లిచ్చింది.
ఐఐటీ అంటే మాటలా మేడమ్‌, ఎంతో కష్టపడితేగాని రాదు. అలాంటిది మీ అబ్బాయి ఎలా సాధించాడు మేడమ్‌ అన్నారు కొలిగ్స్‌.
”ఔను సార్‌, మా అబ్బాయికి స్కోర్‌ కొంచెం తక్కువే వచ్చిందిగాని, మా ఓసీలకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ ఉన్నాయి కదా ఆ కోటాలో సీటు దక్కింది” అని గర్వంగానే చెప్పింది. ఆ మాట విని అందరు సల్లబడ్డరు. హెడ్మాస్టర్‌ రూమ్లోకి వెళ్లి ఆయనకు కూడా స్వీట్లు ఇవ్వు అని గాయత్రికి సైగ చేసిండు నర్సింహరెడ్డి. వద్దన్నట్టు తల ఊపింది. అయినా సరే నర్సింహరెడ్డి ఏంకాదులే ఇవ్వు పాపం… అని మరింత బలవంతపెట్టిండు. సరే పోనీలే అని… గాయత్రి స్వీట్‌ బాక్స్‌ తీసుకెళ్లి యాదగిరి ముందుపెట్టింది.
”సార్‌ స్వీట్‌ తీసుకోండి” అని కొంచెం వెటకారంగానే అంది.
”పర్లేదు మేడమ్‌ నాకు షుగరుంది. మీకు కంగ్రాట్స్‌. మీరు ఇప్పుడే చెబుతుంటే విన్న. మీ బాబుకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ కోటాలో సీటొచ్చిందని. మీ అబ్బాయికి కొంచెం జాగ్రత్త చెప్పండి మేడమ్‌. మనల్ని ‘రిజర్వేషన్గాళ్లు’ అని తిట్టి ర్యాగింగ్‌ చేసే వాళ్లుంటారేమో అక్కడ” అన్నడు.
ఆ మాట గాయత్రికి ఎక్కడ్నో తగిలింది. మొఖమంతా చిన్నబుచ్చుకొని ఆఫీస్రూం నుంచి బయటికి నడిచింది.
ఇంతకాలం ఏ రిజర్వేషన్ల కారణంగా యాదగిరి సార్పై విద్వేషం చిమ్మిందో… అదే రిజర్వేషన్‌ బ్యాచ్లో తాను కూడా చేరిపోతుందనే మార్పును… ఊహించని గాయత్రికి, అప్పటి దాకా తిన్న స్వీట్‌ రుచి కూడా కటిక చేదులెక్క తోచింది…
లిటిట్‌ ఫర్‌ ట్యాట్‌ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ.

Spread the love