ఇండియన్‌ ఫార్మర్‌

పొద్దున టైం ఏడున్నర అయ్యింది. కిరణ్‌ ఇంట్ల మంచం మీద బోర్ల పండుకొని నిండా దుప్పటి కప్పుకున్నడు. ఎమ్మెస్సీ, బిఈడి చదివిండు. కరోనా కారణంగా చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీ జాబ్‌ కూడా పోయింది. వాళ్ళమ్మ పార్వతమ్మ కిరణ్‌ ఎప్పుడు లేస్తడని చూసుకుంటనే వంట చేసింది. ఇంకా లేస్తలేడని దగ్గరకు పోయి ”లేవు బిడ్డ. పొద్దు ఈడికొచ్చింది. మా అయ్యగాని” అని ఇంట్ల పడ్డ ఎండ పొల్పును చూసి కిరణ్‌ ను చెయ్యితోన కదిలిచ్చింది. దుప్పటి సదుర్కుంట ”పో అమ్మ నిద్రొస్తుంది” అన్నడు కిరణ్‌. కిరణ్‌ సోమరిపోతు లెక్క తాయరైతుండని తల్లికి బాధనిపిచ్చింది.
”రోజూ తినడం, పండడం గింతేనారా బతుకంటే. ఏదో పని జెయ్యమంటే జెయ్యవు. సెప్పినట్లు ఇనవు. ఉన్న ఒక్క కొడుకని గారువంగా సదివిస్తి. నీవు పని జేసి ఇంత సంపాయిస్తవు అనుకుంటే ఇంత వయసొచ్చినా నా రెక్కల మీదనే బతుకవడితివి. మీ నాయిన సావకుండా నేను సచ్చేదుండేరా” అని కంట్ల నీళ్ళు తీసేటాలకు కిరణ్‌ లేసి ఆవలిస్తూ ”ఏందమ్మా గట్లంటవ్‌” అనేసరికి ”ఇంగేముందిరా! మీ నాయిన సంపాయించిన ఇంత భూమి ఉంది గదా. గదైన జేసుకుంటే నాలుగ్గింజలు పండుతే మన పొట్టకైనా అయితరు గదా!” తల్లి మాట్లిని కిరణ్‌ పక్కనే ఉన్న తన పుస్తకాల దిక్కు చూసిండు.
కిరణ్‌ బాధంతా ఒకటే. ఇంత చదువుకు తగ్గట్టు ఉద్యోగం దొరుకుతలేదని. ”ఇంత సద్వి ఎవుసం జెయ్యాల్నా అనే గదా నీ బాధ. గవిర్మెంటు కొలువులొస్తయని పెద్ద పెద్ద సద్వులు సదివిండ్రు కాని కొలువులెయ్యకుండ మోసం జేసిండ్రు. ఒక్కటి గుర్తువెట్టుకో బిడ్డా… మనిషిని ఎప్పుడు గూడ కన్నతల్లి, భూతల్లి మోసం జెయ్యలే. నిన్నేం ఒగని ఇంటి ముందు జీతం ఉండమంటలే. మనిషి తినడానికి ఇన్ని మెతుకులు పండించమంటున్న” అని పార్వతమ్మ కడుపులున్న బాధనంత చెప్పి మళ్ళా వంటింట్లకు పోయింది. కిరణ్‌ లేసి బ్రెష్షుకు పేస్టూ పెట్టుకొని పళ్ళు తోమి కడుక్కొని ఇంట్లోకొస్తే తల్లి బువ్వ వెట్టింది. తిన్నడు. దండే మీద సెల్ల ఉంటె తీస్కోని భుజం మీదేస్కోని బయట సప్రంల సలికే పార ఉంటె తీస్కోని పొలం కాడికి బయలు దేరిండు.
నడూర్ల రచ్చ కట్టమీద పవన్‌, శ్రీను, విజరు ముగ్గురు పొరలు కూసోని ముచ్చట్లు పెడుతూ ఉన్నరు. వయసులో కిరణ్‌ కంటే చిన్నోళ్ళే.
”ఏం రా శ్రీను మీ గల్లికి ఇంకా కరోన రాలేదంట. ఏం జేసినవ్‌ రో” నవ్వుకుంట అడిగిండు విజరు.
”ఏం లేదురా! మొన్ననే కరోన మంత్రం కనిపెట్టిన దెబ్బకు మొత్తం జంప్‌” అని అనేసరికి పవన్‌ ”పీకినవ్‌ తీరు” అని కిరణ్‌ అటువైపే వచ్చేది చూసిండ్రు.
కిరణ్‌ రైతులాగ భుజాన సెల్ల చేతిలో పార పట్టుకొని కనిపించిండు. విజరు పవన్‌ మీద చేతేసి ”ఏంరా ఆర్మీ! వీడేందో కొత్తగా కనిపిస్తుండు.
”ఏమోరా మొన్నటివరకు లెక్చరర్‌ అది ఇది అన్నడు. ఇప్పుడీ అవతారం ఎత్తిండు” అన్నడు.
ముగ్గురు అతన్నే చూస్తుండ్రు. కిరణ్‌ వాళ్ళకు దగ్గరగా వస్తున్నడు. పోవాల్సింది కూడా అటునుంచే. ”ఏం కిరణ్‌ అన్న కొత్త గెటప్‌?” అని అడిగిండు శ్రీను.
కిరణ్‌ వాళ్ళ వైపు చూసి ”పొలం కాడికి పోతున్న శ్రీను” అని చెప్పుకుంటూ పోతుంటే
”ఏందోరా ఆర్మీ! గిన్ని దినాలు లెక్చరర్‌ తోపు తోడిమే అని అందరూ అంటుండ్రి. అంత గొడితే గీడికే ఉన్నదా?” వెటకారంగా అన్నడు విజరు.
ఆ మాటలు కిరణ్‌ చెవిలో పడినరు. ముందుకేసే అడుగు అక్కడే ఆగింది. ముగ్గురు చూసిండ్రు.
”విన్నట్టుండురా” అన్నడు పవన్‌ కొంచెం భయపడినట్లు.
”వింటే వినని. ఇన్ని దినాలు అందరూ అంతా ఇంతా పండిచ్చిరేమో ఇప్పుడు ఈయన పండియ్యనీకె పోతుండు” అని నవ్విండ్రు.
కిరణ్‌ వెనక్కి వచ్చిండు. వాళ్ళ ముందు నిలబడిండు. పవన్‌ మళ్ళా భయపడిండు. కిరణ్‌ అంటే గౌరవం ఉంది.
”విజరు ఇందాక ఏమన్నవ్‌?” అని అడిగిండు కిరణ్‌.
”ఏమన్నా! ఏం అనలే. ఎవుసం జేసేటోళ్ళే పంటలు పండక సచ్చిపోతుండ్రు నువ్వేం జేస్తవ్‌ అన్న గంతే” అన్నడు విజరు.
కిరణ్‌ పవన్‌ వైపు చూసి ”పవన్‌ ఏం చదువుతున్నవ్‌?” అని అడిగిండు.
”డిగ్రీ అన్న” అని చెప్పిండు.
శ్రీను వైపు చూసి ”శ్రీను నువ్వేం చదువుతున్నవ్‌?” అని శ్రీనుని అడిగితే ”రీసెంట్లి డిగ్రీ కంప్లీట్‌ అన్న” అన్నడు.
”విజరు నువ్వు?” అని అతన్ని కూడా అడిగిండు కిరణ్‌.
”అబ్బో మనకు సదువబ్బలేదులే. ఎనిమిది వరకే ఎక్కువై ఆపేసిన” అని ఏదో రకంగా చెప్పేసరికి కిరణ్‌ పవన్‌, శ్రీనుల వైపు చూసి ”పవన్‌, శ్రీను మీరు దేనికి ప్రిపేర్‌ అవుతున్నారు” అని అడిగితే ఇద్దరు ఒకేసారి ”ఆర్మీ అన్న” అన్నరు.
విజరు ఏమి అడగకపోయేసరికి అయోమయంగా చూసిండు. ఇంకా ఏం అడుగుతడోనని పవన్‌, శ్రీను కొంచెం టెన్షన్‌ పడుతుండ్రు. విజరు మాత్రం నన్నేం అడుగడులే అన్నట్టు ఉన్నడు. కిరణ్‌ కూడా అదే చేసిండు.
”పవన్‌ మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్‌?” అని కిరణ్‌ అడిగితే ”చాలా సంవత్సరాల నుంచి అన్న” అని శ్రీను బదులిచ్చిండు.
”అవునా” అన్నడు కిరణ్‌.
పవన్‌ అవును అన్నట్టు తలూపి ”విజరు అన్నది కూడా నిజమే కదా అన్న. వ్యవసాయంలో అంత లాస్‌ వచ్చి రైతులు చనిపోతున్నరు. మీరేమో ఎమ్మెస్సీ, బిఈడి చదివి మళ్ళా వ్యవసాయమే చేస్తని పొలానికి పోతున్నవ్‌” అని అనేసరికి కిరణ్‌ కొంచెం ఆలోచించి
”అవును మీరు నిజంగా ఆర్మిలోకి పోతున్నరా?” అని అడిగిండు. ”అన్న అది మా ఇద్దరి గోల్‌ అన్న. కంపల్సరి అర్మిలోకే పోతం” అని శ్రీను చెప్పిండు.
కిరణ్‌ చిన్నగా నవ్వి ”అయ్యో శ్రీను అక్కడ కూడా చాలా మంది చనిపోతున్నరు కదా!” అని అనేలోపే
”ఆర్మీలో చనిపోతే దేశం కోసం చనిపోయిండని సెల్యూట్‌ చేస్తరన్నా. ఇక్కడ రైతులు చచ్చిపోతే ఎవ్వడు పట్టించుకోడు” అని పవన్‌ తన అభిప్రాయం చెప్పేసరికి కిరణ్‌ కు కొంచెం కోపం వచ్చింది.
ఇక్కడ గౌరవాన్ని మాత్రమే చూస్తున్నారు కాని ప్రాణం విలువ, రైతు విలువ వాళ్ళకు తెలియదనుకున్నడు.
”అంటే దీనర్థం ఆర్మీలో చనిపోయినా పర్వాలేదు కానీ వ్యవసాయం చేస్తూ చనిపోతే తర్వాతి తరం వ్యవసాయం చేయ్యోద్దానా?” అని సూటిగా అడిగిండు కిరణ్‌.
”అంతే కదన్నా” అని బదులిచ్చిండు పవన్‌.
కిరణ్‌ మొఖంలో మార్పులు గమనించిన శ్రీను పవన్‌ తొడ మీద చెయ్యేసి ‘ఆగురా’ అన్నట్టు కళ్ళతోనే చెప్పిండు. పవన్‌ ఏమైన తప్పుగా మాట్లాడిననా అన్నటు ఆలోచనలో పడ్డడు.
ముగ్గుర్ని చూస్తూ ”అలా అనుకోవడం తప్పు తమ్ముడు. అక్కడ గౌరవం ఉంటుంది ఇక్కడ ఉండదు అనుకోవడం వంద శాతం తప్పు. మనం అలా అనుకోబట్టే ఇలా రైతులు ఆదరణ లేకుండా పోతుంది. సోల్జర్స్‌ అక్కడ దేశ రక్షణ చేస్తుంటే ఫార్మర్స్‌ ఇక్కడి నుంచే అందరి ప్రాణాలకు రక్షణనిస్తడు. సోల్జర్స్‌ అండ్‌ ఫార్మర్స్‌ బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌. మీరు అన్నదాతలకు అండగా నిలువకపోయినా పర్వాలేదు కానీ వారిని కించపరచకండి. మీలాంటి వాళ్ళు ఎగతాళి చేయబట్టే మన తరంలో ఎవ్వరు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వ్యవసాయం చేయడం ఆపేస్తే చివరకు దేశమే కాదు ప్రపంచమే ఓ స్మశానం అవుతుంది. నేను రైతుని అని చెప్పుకోవడానికి ధైర్యం ఉండాలే. అది నాకుంది. నేను ఇండియన్‌ ఫార్మర్‌ ని” అని చెప్పి కిరణ్‌ అక్కడి నుంచి పోతుంటే పవన్‌, శ్రీను కూర్చున్న వాళ్ళు లేచి నిలబడిండ్రు. వాళ్ళను చూసి విజరు కూడా నిలబడి కిరణ్‌ వైపే చూసిండ్రు.
– కె.పి. లక్ష్మీనరసింహా
9010645470

Spread the love