విప్లవ వీరుడు ఉద్దాం సింగ్‌

Blood-Hemoglobin-Approx– (నాటిక) ఒన్‌ మాన్‌ ఆర్మి
ఆ విధంగా విప్లవ వీరుడు సర్దార్‌ ఉద్దాం సింగ్‌ జీవిత రేఖామాత్రపు చిత్రణను సజీవ నాటక మాధ్యమంగా తిరుపతి నందనం అకాడమి కళాశాల యువతులు ప్రేక్షకులకు చూపడం ఎంతైనా అభినందనీయం. గుంటూరులో డిసెంబర్‌ చివరి వారంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో ఈ అరుదైన అవకాశం లభించింది.
పంజాబ్‌ కు చెందిన ఉద్దాం సింగ్‌ 1899 డిసెంబర్‌ 26న జన్మించాడు. తొలుత గదర్‌ పార్టీ విప్లవ వీరులు, తర్వాత తర్వాత భగత్‌ సింగ్‌ బృందంతో సంబంధం కలిగి చిరుప్రాయంలోనే ఆ భావాలకు ప్రేరేపితుడయ్యాడు. తన దేహం, తన ప్రాణం మాతృభూమి సేవకే ధారపోయాలనే కృతనిశ్చయానికి అప్పుడే బద్దుడయ్యాడు.
1919 ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌ జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మరచిపోలేని ఓ పెనుగాయం. దానికి ముఖ్యకారకుడు బ్రిటీష్‌ అధికారి డయ్యర్‌. నిరాయుధులైన భారతీయులపై విచక్షణా రహితంగా సాగిన ఆ కాల్పుల కాండలో వేయి మందికి పైగా మరణించారు. 1200 మంది క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో స్త్రీలు – పిల్లలు అధిక సంఖ్యలో వున్నారు. ఈ దారుణ మారణ కాండకు ప్రత్యక్షసాక్షిగా యుక్తవయసులో వున్న ఉద్దాంసింగ్‌ చలించిపోయాడు. డయ్యర్‌ ఎక్కడ వున్నా సరే… తానే స్వయంగా మట్టుబెట్టాలని నాడే ప్రతిన బూనాడు.
ఫ్రాన్స్‌, జర్మనీ, పోలెండ్‌, ఇటలీ, ఇరాన్‌, బర్మా, జపాన్‌ తదితర దేశాల విప్లవకారులతో అనతి కాలంలోనే సంబంధాలను ఏర్పరచుకున్నాడు. దేశ దేశాలు తిరిగాడు. మధ్యలో జైలు శిక్షలు అనుభవించాడు. కడకు ఇంగ్లాండుకు చేరుకున్నాడు. అవకాశం కోసం పొంచి చూస్తూ, 1940 మార్చి 13న డయ్యర్‌ను అతి సమీపంగా కాల్చి చంపుతాడు. తాను ప్రతీకారంతోనే ఈ హత్య చేశానని లోకానికి ప్రకటిస్తాడు.
చివరకు 1940 జూలై 31న అక్కడి బ్రిటిష్‌ న్యాయస్థానం క్లుప్తంగా విచారణ సాగించి డయ్యర్‌ను చంపినందుకు గాను ఉద్దాంసింగ్‌కు ఉరిశిక్ష విధిస్తుంది. ఆ విధంగా ఉద్దాంసింగ్‌ ఇంగ్లండ్‌లోనే కన్నుమూస్తాడు.
ఈ మొత్తం చరిత్రను కేవలం నలభై నిముషాల వ్యవధిలో రసరమ్యంగా చూపడం అసాధారణం. అయినా ఆ ప్రయత్నానికి ఆ యువకళాకారిణులను అభినందించి తీరాలి. దాదాపు పదిహేనుమంది యువతులు తెరముందు అభినయిస్తే, మరో పదిహేను మంది యువకులు తెరవెనుక కృషి చేశారు. జలియన్‌ వాలాబాగ్‌ సెట్‌ డిజైన్‌, కాల్పులు – మరణాలు, కోర్టు, ఉరి సన్నివేశం మొదలైనవన్నీ ఎంతగానో రక్తికట్టాయి. బ్రిటీష్‌ అధికారుల ఆహార్యం, పంజాబ్‌ ప్రజల వేషధారణ కనువిందు చేసింది. నేపద్యసంగీతం, నృత్యాలు మనోహరం.
ఉరికంబం ఎక్కి ఉరితాడును ముద్దాడే ముందు ఉద్దాంసింగ్‌ చెప్పిన మాలు వింటే ఎవరైనా రోమాంచితులు కాకమానరు. ‘సామ్రాజ్యవాదులకు ఇదే నా హెచ్చరిక. భారత ప్రజల సుఖశాంతులకు కీడు చేసేవారు ఎవరైనా, ఎంతటివారైనా, ఎక్కడ వున్నా, సరిహద్దులు దాటైనా సరే భరతమాత బిడ్డలు వారిని మట్టుబెట్టక మానరు. జై భారత్‌. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’.
మరుగున పడిన వీరుని గాధ (అన్‌ టోల్డ్‌ స్టోరీ ఆన్‌ బ్రేవ్‌ ఇండియన్‌ మార్టియర్‌) గా చెప్పుకుంటున్న ఉద్దాంసింగ్‌ చరిత్ర ఇటీవల సినిమాగా కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా నాటికగా ఆవిష్కృతమైంది. నేటి యువతలో దేశభక్తిని పాదుగొల్పేందుకు ఈ నాటిక ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నాటిక రచన – దర్శకత్వం వివేక్‌.
కళాశాల యువతీయువకుల కోసం నిర్వహించిన ఈ నంది నాటిక పోటీల్లో ఈ నాటిక తృతీయ బహుమతిని, ఉత్తమ రచనా బహుమతిని, ఉద్దాంసింగ్‌ పాత్రధారణి అనూష ఉత్తమ నటనా బహుమతిని గెలుచుకున్నాయి. బహుమతులతో పాటు ఉద్దాంసింగ్‌ స్ఫూర్తిని ఈ విధంగా పొందినందుకు వారు ఎక్కువ ఆనందపడుతున్నారు.
నేను కూడా ఈ నాటిక శిక్షణలో భాగస్వామ్యం వహించినందుకు సంతోషపడుతున్నాను.
– కె.శాంతారావు, 9959745723
రంగస్థల కార్యకర్త

Spread the love