విగ్రహ స్వగతం

idol monologueకొన్నాళ్లుగా ఒక విగ్రహం
కలలోకి వస్తోంది.
ఏదో చెప్పాలని చెప్పలేక
నిస్సహాయంగా చూస్తోంది.
విగ్రహం చుట్టూ మూగి
భుజకీర్తనలు..తిలకాలు..
ఆకాశం నుంచి పూలు..
మేధావులు..మేతావులు..
జయజయధ్వానాలు..నినాదాలు..
విగ్రహం బిక్కుబిక్కుమంటూ
నిస్సహాయంగా చూస్తోంది.
జాతర చేస్తోన్న జాతిజనులను చూసి
కనులనీరు ఊరి ..ద్ణుఖం పొలమారి
నిజంగా నిస్సహాయంగా చూస్తోంది.
దేశం నిండా విగ్రహాలు నిలబెట్టి
ఆశయాలు కూలగొట్టిన చరిత్ర తలుచుకొని
తెల్లబోయిన విగ్రహానికి
వెల్లవేస్తున్న రాజకీయ కోలాహలం ..
మిన్నంటిన తార్పుడుగాళ్ళ వీరత్వం..
మూలవాసులను తెలియకుండానే మింగుతున్న
ప్రచారార్భాటాల హాలాహలం..
కొన్నాళ్ళుగా ఒక విగ్రహం
నను నిద్ర నుండి లేపుతోంది.
ఏదో చెప్పాలని
ఇనప పరంజాలు విదిలించుకుంటోంది.
125 అడుగులు 250 అడుగులు ..కాదు..
అడుగడుగున దిగజారుతున్న
జాతి దైన్యం చూడు..
అడుగడుగున వేటాడుతున్న
రాజ్యాంగ విలువలు చూడు..
గరగపర్రు ఒక కుట్రయితే
హుస్సేనుసాగరు ఒక తెలివి..
ఇన్ని వేల సంవత్సరాల చరిత్రసమాధిలోంచి
ఒక నిటారు మనిషి నిలబడ్డాడని
చదువుకున్నవాళ్ళు కూడా
చంకలు కొడుతున్నారు..
వంత పాడేవాళ్ళు చిడతలు కొడుతున్నారు..
మోసపూరిత ఆకాశం
మన మీద ఆశల వర్షం కురిపించదు.
విగ్రహాల వెనుక నిలబడిన
మాయా క్రీనీడ కంటికి కనపడదు.
కొన్నాళ్ళుగా ఒక విగ్రహం
విగ్రహంలో ఇమడలేకుంది.
రాజ్యాంగం అమలు చేయని రాజ్యం
ఆయన్ను ఒక విగ్రహానికి కుదించేసింది.
ఊరూరా విగ్రహాలు ఊరేగించే ఉత్తర దేశంలో
కళ్ళు చెమర్చుకుంటూ
రోజుకొక హత్యాచారాన్ని అకత్యాన్ని
విగ్రహాలు చూస్తూనే వున్నాయి.
విగ్రహాల వల్ల ఒరిగేది ఏమీ లేదని
చెప్పినాయనకే
విరాట్‌ విగ్రహం పెట్టడం
మన భావబానిసలకే చెల్లిందని
విగ్రహం విస్తుపోయి చూస్తోంది.
‘ఊరంతా కనపడతాను..
ఆచరణలో కనపడను.
జైభీమ్‌ నినాద ఆవేశాల్లో వుంటాను..
అవగాహనలో వుండను.’ అని
విగ్రహం ఆగ్రహంగా అంటోంది.
‘ఈ నా 125 అడుగుల విగ్రహమయినా
నీ బెత్తెడు గుండెలో నిలబడితే..
నేను కలగన్న రాజ్యం కోసం నువ్వు తెగబడితే..
కళ్లు కబోదుల్ని చేస్తున్న ఈ విగ్రహకాంతిలో
నువ్వొక ఓటువై..
తరతరాల నుండి పడుతున్న వేటువై..
నువ్వు రాలిపోకుండా తలెత్తితే..’
అని విగ్రహం రాతికళ్ళతో
ఒక కల కంటోంది.
మేధావుల జయజయ ధ్వానాల మధ్య
ప్రపంచ మేధావి విగ్రహం
అసహనంగా..నిస్సహాయంగా
అయినా సహనంగా..సంయమనంగా
చూపుడువేలు చూపిస్తూనే వుంది.
ఈ రోజు ఆ విగ్రహం
అన్ని ఆడంబరాలకు అతీతంగా
రాజ్యస్తోత్రాలకు ఆవలగా
తనను తాను విసిరేసుకుంది.
ఈ రోజు ఆ విగ్రహం
నా కలలోకి రాలేదు.
రేపటి నుండి ఆ త్యాగధనుడు
ఆ హుస్సేన్‌ సాగరు తథాగతుడు
ఈ జయజయధ్వానాల కింద అణగారే
హాహాకారాలు వింటూ
మరింత పాషాణాలై విషాద వదనాలై
రంగు వెలుస్తుంటారు.
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 9949429449

Spread the love