మేడారం జాతర ధిక్కార స్వరానికి ప్రతీక …

మేడారం జాతర ధిక్కార స్వరానికి ప్రతీక ...మదమెక్కిన అధికారానికి ధిక్కార స్వరంగా నిలుస్తుంది. ఆ ధిక్కార స్వరంలో సంపూర్ణ ధైర్యం తప్ప అణుమాత్రమైనా పిరికితనం ఉండదు. న్యాయాన్ని అణచివేయాలని చూస్తే మహా సామ్రాజ్య కోటలైనా బీటలు వారుతాయి. అకారణ కయ్యానికి కాలుదువ్వితే చక్రవర్తులైనా పశ్చాత్తాపానికి గురికాక తప్పదు. అమాయక ప్రజల పక్షాన నిలిచిన సామంతరాజుపై అసూయాద్వేషాలతో రాజ్యాధినేతే సమరానికి దిగిన వైనం… తన ప్రాణాలను తృణప్రాయంగా భావించిన ఆ సామంత రాజు, ఆయన బంధుగణం వీరోచిత పోరాటం సాగించి దేవేరీ సమరాంగనాన నిలిచి శతృసైన్యాన్ని చీల్చి చెండాడారు. అనంతరం అమరవీరులయ్యారు. ఆ వీరులు కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చారు అనే నమ్మకంతో ప్రజలు జరుపుకునే ఘట్టమే మేడారం సమ్మక్క, సారక్క జాతర అని చరిత్ర చెబుతుంది.
చరిత్ర ఎలా ఉన్నా ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారక్కల జాతర పేరు సంతరించుకుంది. 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్రతి రెండేండ్లకోసారి మేడారంలో నాలుగు రోజులపాటు ఈ వేడుకలు అద్భుతంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళాకు ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయో, దక్షిణ భారతాన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ జాతరకు అంతకు రెట్టింపు పేరు ప్రఖ్యాతులున్నాయి. దేశ, విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో ఈ జాతరకు తరలివచ్చే ప్రజలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని ములుగుకు సుమారు 44 కిలోమీటర్ల దూరంలో మేడారం గ్రామం ఉంది. తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఈ కుగ్రామం నెలకొని ఉంది.
ప్రజలకు అండగా నిలబడి
శతాబ్దాల చరిత్ర కలిగిన మేడారం జాతరకు సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కథనం ప్రకారం… కరువు కాటకాల వల్ల కప్పం కట్టలేకపోయిన సామంత రాజుపై ఆ రాజ్య చక్రవర్తి రాజ్యాధికార దర్పం ప్రదర్శించి సమరానికి దిగుతాడు. అడవిబిడ్డల సంక్షేమం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆ సామంత రాజు, ఆయన బంధుగణం వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతారు. ఆ సామంత రాజు సతీమణి సమరాంగనాన దూకి శత్రుసంహారం చేసి అదృశ్యమై కుంకుమ భరిణిగా దర్శనమిస్తుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పటి నుండి ప్రజలు ఆమెను వీరనారిగా, దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతున్నది.
మేడారం, సమ్మక్క సారలమ్మలను ఆదివాసీ, గిరిపుత్రులు వనదేవతలుగా ఆరాధిస్తారు. ప్రతి రెండేళ్ల కోసారి నాలుగు రోజులపాటు జాతర వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి మరో గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలంలో కోయదొరలు వేట కోసం దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడో అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు చుట్టూ ఉండగా… ఆ మధ్యలో ఓ పెద్ద పాము పుట్ట మీద… దివ్యతేజస్సుతో మిలమిల మెరిసిపోతూ ఓ పసిపాప కనిపించింది. ఈ వింత దృశ్యాన్ని తిలకించిన కోయ పెద్దలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ పసిబిడ్డ మానవ మాత్రురాలు కాదని, దైవాంశ సంభూతురాలు, కారణ జన్మురాలు అని కోయదొరలు భావించారు. అసాధారణ రీతిలో, అద్భుత శక్తి సంపన్నురాలిగా కనిపించిన చంటి పాపను ఎంతో సంతోషంతో తమ గూడేనికి తెచ్చుకున్నారు. పాప కోయగూడేనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే పాప రూపంలో వచ్చిందని అందరూ విశ్వసించారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ అందాల పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంత కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.
చారిత్రక ఆధారాలను బట్టి 12, 13 వ శతాబ్ద మధ్య కాలంలో కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్న పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. 1260, 1320 శతాబ్ది కాలంలోని పొలవాస గ్రామం ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలో ఉంది. కాకతీయుల సామంతరాజైన పగిడిద్దరాజు, మేడరాజుకు మేనల్లుడు మేడారం పాలకుడు. మేడరాజు, తాను పెంచి పెద్ద చేసిన సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగినట్టు మేడారం చరిత్ర చెబుతోంది. అయితే పగిడిద్దరాజు, సమ్మక్కల వివాహానికి సంబంధించిన ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది.
అయోనిజ… అంటే సాధారణ జననానికి సంబంధం లేకుండా, అసాధారణ రీతిలో కారణ జన్మురాలిగా ఉద్భవించిన సమ్మక్క.. బాల్యంలో చేసిన చేష్టలన్నీ మన్యంవాసులకు అమిత ఆశ్చర్యం కల్గించాయి. దీర్ఘ కాల రోగగ్రస్తుడు సైతం ఆమె అమృత స్పర్శతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారినట్టు మేడారం చరిత్ర చెబుతోంది. గ్రామస్థులందరికీ పసిబిడ్డలా పరిచయమైన సమ్మక్క అందరినీ చల్లగా చూసే కల్పవల్లిగా పేరు పొందింది. వన దేవతగా సమ్మక్క అందరికీ ఆశీర్వాదాలు అందించేది. మేడరాజు పెంపకంలో బయ్యక్కపేటలో బాల్యంలో ఉన్న సమ్మక్క ప్రకృతి, మూగజీవాల చెంతన తనకు ఉండాలని ఉందని, దేవరగుట్ట కొండపై తనను ఒంటరిగా వదిలేయాలని కోరుతుంది. గుట్టకొండపై ఒంటరిగా సమ్మక్కను వదలడానికి మేడరాజు, ఇతర గ్రామస్థులు ఇష్టపడరు. అయితే కారణ జన్మురాలైన సమ్మక్క ఆజ్ఞను శిరసావహించాలని భావిస్తారు. ఆమె కోరిక ప్రకారం దేవర గుట్ట కొండపై వదిలేస్తారు. అక్కడ మంచినీటి వసతి ఎక్కడ కనిపించకపోవడంతో మేడరాజు ఒక బావిని తవ్వించి, ఆమెకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరతాడు. ఆ ప్రాంతాన్ని పగిడిద్ద రాజు పాలించడం, కొన్నాళ్ల అనంతరం పగిడిద్ద రాజుకు సమ్మక్క పరిచయం అవ్వడం, మాఘ పౌర్ణమి నాడు వీరి వివాహం జరగడం తదితర ఘట్టాలు సాగుతాయి.
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా…! అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఆకస్మికంగా కరువు తలెత్తుతుంది. తిండికి పాట్లు పడాల్సిన పరిస్థితుల్లో ఉన్న మేడారం గ్రామస్థులకు పూట గడవడం గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కప్పం చెల్లించలేకపోయారు. సామంత రాజు పగిడిద్దరాజు శిస్తు కట్టకపోవడంపై కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అసహనం చెందుతాడు. ఈ పరిస్థితుల్లో ప్రతాపరుద్రునికి, పగిడిద్దరాజుపై కొందరు వ్యక్తులు తప్పుడు ఫిర్యాదులు చేస్తారు. తన మామ మేడరాజుకు కాకతీయ పాలకుల ఆజ్ఞ లేకుండా ఆశ్రయం కల్పించినట్టు, కొండ కోయలను తిరుగుబాటుకు పగిడిద్దరాజు ప్రేరేపిస్తున్నట్టు వాస్తవ విరుద్ధమైన ఫిర్యాదులు కాకతీయ చక్రవర్తికి చేరినట్టు, దీంతో ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మేడారంపై దండయాత్రకు దిగినట్టు చరిత్ర చెబుతోంది.
కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు ఆకస్మికంగా యుద్ధానికి దిగడంతో ఆదివాసీలు అవాక్కయ్యారు. అసలే కరువుతో అల్లాడుతుంటే, ముందూ వెనకా ఆలోచించకుండా పాలించే పాలకుడే అకారణ సమరానికి దిగడంతో మన్యవాసులు తిరుగుబాటుకు సిద్ధమవుతారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సేనలు మేడారంపై మూకుమ్మడిగా దాడికి దిగుతాయి. లక్నవరం సంపెంగ వాగు వద్ద అడవి బిడ్డలకు, కాకతీయ సేనలకు మధ్య భీకర పోరు సాగుతుంది. ప్రస్తుత ములుగు జిల్లాలోని లక్నవరం గ్రామమే అది. కాకతీయ సేనను మేడారం పాలకుడు పగిడిద్దరాజు తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. ఈ సంగ్రామంలో పగిడిద్దరాజు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మతో పాటు కుమారుడు జంపన్న, అల్లుడు గోవింద రాజులు వీరోచిత పోరాటం చేస్తారు. ఆ కుటుంబీకులు సాగించిన వీర పోరాటానికి కాకతీయ సేనలు బెంబేలెత్తాయి. అయితే సంప్రదాయ ఆయధాలతో పోరు సాగించిన పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆగ్రహం చెందిన జంపన్న కాకతీయ సేనలను చీల్చి చెండాడతాడు. ఆ పోరులో జంపన్న శరీరమంతా రక్తసిక్తమవుతుంది. యుద్ధం చేస్తూనే సంపెంగ వాగులో పడి మరణిస్తాడు. ఆ నాటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది.
సమ్మక్క కుమారుడు జంపన్న కాగా, కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మగా మేడారం చరిత్ర చెబుతోంది. కాకతీయ సైన్యంతో భీకర పోరాటం సాగించిన సమ్మక్క ఇద్దరు కుమార్తెలు కాకతీయ సేనలను గడగడలాడించి చివరకు ఆ మహా సంగ్రామంలో అమరులవుతారు. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఒక చెట్టు ఉండేదని, ఆ చెట్టు వద్దకు ఓ సర్పం వచ్చి నాగదేవతగా ఆశీర్వాదాలు అందజేసేదని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ నాగసర్పం నాగులమ్మ అని ప్రజలు నమ్ముతున్నారు. ఇక యుద్ధంలో తన కుటుంబీకులను కాకతీయ సేనలు హతమార్చారనే విషయం తెలుసుకున్న సమ్మక్క అపరకాళిలా విజృంభించింది. కాకతీయ సేనలను కకావికలం చేసి, పరుగులు పెట్టించింది. కాకతీయ సేనలపై సమ్మక్క సాగిస్తున్న భీకర పోరును, వీరత్వాన్ని చూసి కాకతీయ రాజు ప్రతాప రుద్రుడే ఆశ్చర్యపోయాడు. సమ్మక్క ఎదుట నిలబడి గెలవగల్గిన వీరుడెవరూ కాకతీయ సైన్యంలో లేకపోయారు. ధర్మయుద్ధంలో నిలవలేక, గెలవలేక పోతున్న సమయంలో ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా వెనుక వైపు నుంచి బల్లెంతో సమ్మక్కపై దాడిచేస్తాడు. దాంతో సమ్మక్క ఆ సైనికుడిని చీల్చి చెండాడి, శతృసైన్యం నలుదిశలా పరుగులు పెట్టేలా చేస్తుంది. ఆ తర్వాత ఒంటి నిండా గాయాలతో, రక్తసిక్త శరీరంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి సమ్మక్క కనబడకుండా పోతుంది. ఆమె మాయమైన చోటు నెమలి నార చెట్టు కింద ఓ కుంకుమ భరిణ దర్శనమిస్తుంది. ఇది సమ్మక్క తల్లే అని నమ్మిన గిరిపుత్రులు ఆ కుంకుమ భరిణనే సమ్మక్కగా ఆరాధిస్తున్నారు. తమ సంక్షేమం కోసం సమ్మక్క జీవితాన్ని త్యాగం చేసిందని, ఆమె సామాన్య మానవురాలు కాదని ఆదివాసీలు సమ్మక్క ఖ్యాతిని కొనియాడతారు. అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మ జాతరను కోయ పూజారులు, గిరిపుత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
సమ్మక్క కుంకుమ భరిణగా దర్శనమిచ్చిన మరుసటి దినం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి, తమ కులదేవత కాకతీదేవి స్వప్నంలో కనిపించి అతని చర్యలపై ఆగ్రహం చెందుతుంది. పాప పరిహారం చేసుకోమని తెలియజేస్తుంది. దీంతో పశ్చాత్తాపానికి గురైన ప్రతాపరుద్రుడు వెంటనే యుద్దాన్ని నిలిపి వేసి మేడారం వాసులకు క్షమాపణలు చెబుతాడు. స్వేచ్ఛా రాజ్యంగా మేడారాన్ని ప్రకటించి కోయ రాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేస్తాడు. సమ్మక్క తల్లిని ఆరాధిస్తూ, రెండేళ్ల కోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలిస్తాడు. అప్పటి నుంచే మేడారం జాతర జరుగుతోందనే మరో కథ సైతం ప్రచారంలో ఉంది.
ప్రాచీన ఆచార వ్యవహారాలు, పురాతన పద్ధతులు పాటించడంలో అడవి బిడ్డలు అగ్రభాగంలో ఉంటారు. మంచి, మానవత్వాలను మంట కలిపే దుర్మార్గులపై పోరు సాగించి వీర మరణం పొందిన వారు ఎందరో మనకు ప్రాచీన చరిత్రలో కనిపిస్తారు. ఒక్కో గ్రామానికి ఒక్కో కథ ఉంటుంది. గ్రామ దేవతలకు సంబంధించిన ఎన్నో ధీర, వీర కథనాలు మనం వింటూ ఉంటాం. కొండ, కోన ప్రాంతాల్లోని తాడిత, పీడిత, బాధిత ప్రజల పక్షాన నిలబడి ఆ పోరాటంలో అసువులు బాసిన ఎందరో మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులను ఆ ప్రాంత ప్రజలు దేవతామూర్తులుగా భావించి పూజలు, జాతరలు చేయడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్దిష్ట రోజుల్లో ఆ త్యాగశీలురను తమ సంప్రదాయ పద్ధతిలో విశేషరీతిలో ఆరాధించడమే జాతర.
నాలుగు రోజుల జాతర తీరు పరిశీలిస్తే….
మాఘ పౌర్ణమి రోజున కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు విగ్రహరూపాలను భక్తులు తీసుకొచ్చి మేడారం గద్దెపై ఉంచుతారు. మొత్తం వేడుకలో అత్యంత ప్రధానమైన రోజు రెండో రోజు. చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లికి ప్రతిరూపంగా ఉన్న కుంకుమ పెట్టె తీసుకొస్తారు. కోయ పూజారుల బృందం పలు పూజాకార్యక్రమాలు నిర్వహించి కొండపైకి చేరుకుంటారు. అక్కడ ప్రధాన పూజారి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాడు. సమ్మక్క త్యాగాన్ని కీర్తిస్తూ రెండో రోజు అమ్మవారిని తీసుకొచ్చి గద్దెపై ఉంచుతారు. సకల దేవతామూర్తులు గద్దెపై కొలువుదీరిన ఘట్టం అయ్యాక తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. చీరెలు, సారెలు, బియ్యం కొందరు సమర్పించగా, చాలామంది వారి బరువుకు సమానమైన బెల్లం (బంగారాన్ని) సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. చివరి రోజున చిలకల గుట్టపై కుంకుమ భరిణెను ఉంచడంతో ఈ మహత్తర కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది.
– గాడేపల్లి రామకృష్ణ, 9949815121

Spread the love