పుస్తకం

పుస్తకంపుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు సరిగా శిక్షణ పొందేలా పుస్తక పఠనం సహాయపడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి తనాన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో పుస్తకం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. ఇటీవల చాలా వరకు గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరినట్టు చూస్తున్నాం.
‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు గురజాడ అప్పారావు. పుస్తకానికి అంతటి శక్తి ఉంది మరి. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానం అన్నారు మరో మహానుభావులు. ఇలా పుస్తక గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు తెలియజేశారు. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. అయితే హస్తభూషణమే కాదు మన మస్తిష్కంలో ఉత్పన్నమయ్యే ఆలోచనలను బయట పెట్టి అందరితో పంచుకునే మార్గం పుస్తకం. పుస్తకం మూడరక్షరాల పదమే. అయినా ఎంతో మంది కలలకు ఆధారం. సామాన్యుని ఆయుధం. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకుడిని తనలో లీనం చేసుకుంటుంది. ఒంటరితనంలో తోడుగా ఉండి స్నేహహస్తాన్ని అందిస్తుంది. పుస్తకం నోరులేని ఉపన్యాసకురాలు. అందుకే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకానికి ఉన్న వన్నె తగ్గలేదు. ఇది ఎన్నటికీ తగ్గేది కాదు. కాబట్టే ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనశాలలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ డిజిటల్‌ యుగంలో కొన్ని మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో పిల్లలు అన్నం తినమని మొండి కేస్తే చందమామను చూపించే వారు. లేదంటే అందమైన బొమ్మల పుస్తకాలు చూపించేవారు. కానీ నేటి తరం పిల్లలు ఏడ్చినా, విసిగించినా, అన్నం తినకుండా మారాం చేసినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ పెట్టేస్తున్నారు. దీని వల్ల పిల్లల ఎదుగుదలలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నతనంలోనే ఎదుగుదల మందగించడం, కళ్లద్దాలు రావడం వంటివి జరుగుతున్నాయి. అలాగే అరచేతిలో ప్రపంచాన్ని చూపించే స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో పుస్తకాలు చదివే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతున్నది. చిన్నప్పటి నుండే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వడంతో వారిలో పఠనాసక్తి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు కానీ దానికి బానిసలుగా మారడం మాత్రం తప్పే.
పుస్తకం లేని ఇల్లు ఆత్మలేని శరీరం వంటిది అన్నారు పెద్దలు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. పుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు సరిగా శిక్షణ పొందేలా పుస్తక పఠనం సహాయపడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి తనాన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో పుస్తకం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. ఇటీవల చాలా వరకు గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరినట్టు చూస్తున్నాం.
ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా ప్రభుత్వాలు గ్రంథాలయాలను మెరుగుపరచాలి. వాటికి అవసరమైన నిథులు కేటాయించాలి. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా పాఠశాల పిల్లలు ప్రతి వారం వాటిని సందర్శించేలా ఆదేశాలు జారీ చేయాలి. అలాగే పాఠశాలలు, కాలేజీల్లో కచ్చితంగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. తరగతులతో పాటు రీడింగ్‌ అవర్‌ని కూడా వారి టైం టేబుల్లో తప్పక ఉండేలా చూడాలి. ఎన్ని డిజిటల్‌ పరికరాలు ఉన్నా అవి పుస్తకంతో సరితూగవని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వారికి పుస్తకాల విలువ తెలిజేసేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినప్పుడు వారికి స్ఫూర్తి నింపే పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. a

Spread the love