నా గూడెం ప్ర‌జ‌లు గుర్తొ‌చ్చా‌రు

People recognized meపచ్చి బాలింత… పురిటి నొప్పుల బాధ తీరనే లేదు. బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ అంటారు. కానీ ఆమె లక్ష్యం ముందు ఆ బాధ దూది పింజలా ఎగిరిపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజులకే సివిల్‌ జడ్జి పరీక్షలకు హాజరయింది. ఇప్పుడు తన రాష్ట్రంలోనే తొలి గిరిజన మహిళా జడ్జిగా చరిత్ర సృష్టించింది. ముఖ్యమంత్రి ప్రశంసలు సైతం అందుకుంది. ఆమే 23 ఏండ్ల శ్రీపతి.
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని జవధు కొండలలోని ప్రశాంతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగారు శ్రీపతి. పులియూర్‌ ఆమె సొంతగ్రామం. తండ్రి కలియప్పన్‌. వీరికి ముగ్గురు పిల్లలు. శ్రీపతి వీరి పెద్ద కూతురు. పోడుభూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువుకునేందుకు సరైన సదుపాయాలు లేవు. చదువుకునేందుకే కాదు అసలు ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల గ్రామం అది. ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఇక చట్టాలు, హక్కుల గురించి ఎలా తెలుస్తుంది. వారికి సాయం చేసేదెవరు. వారి జీవితాలను బాగుచేసేదెవరు. ఇవన్నీ శ్రీపతిని ఆలోచింపజేశాయి.
పిల్లల చదువు కోసం…
వీళ్లు నివసించే గూడెం నుండి బస్సెక్కడానికి 15 కిలో మీటర్లు నడవాలి. తిండికి కష్టంగా ఉన్నా పిల్లల్ని చదివించాలనేది ఆ తండ్రి బలమైన కోరిక. అందుకే పిల్లల చదువు కోసం ఆ తండ్రి గ్రామానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్‌ (తిరుపట్టూరు జిల్లా)కు వలస వచ్చాడు. ఇక్కడా పోడు వ్యవసాయమే అయినా పిల్లలు ఇంటర్‌ వరకు చదువుకునేందుకు మిషనరీ స్కూల్‌ ఉంది. అందుకే ఎంత కష్టమైనా అక్కడే ఉండాలని భావించాడు. ఆ మిషనరీ స్కూల్లోనే శ్రీపతి తమిళ మీడియంలో ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ‘ఇప్పుడు నీ బిడ్డ చదివి ఏం చేయాలి’ అంటూ బంధువులు, సన్నిహితులు ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెట్టినా, వాళ్లు తమ బిడ్డను చదువు విషయంలో ప్రోత్సహించారు. ఇంటర్‌ అయ్యాక లా చదవాలని శ్రీపతి నిర్ణయించుకుంది. శ్రీపతికి లా చదువుతుండగానే పెండ్లి చేశారు.
సమాజానికి సమాధానం చెబుతూ…
భర్త వెంకటేశన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమె చదువుపై ఉన్న ఆసక్తితో పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలూ చూస్తూనే ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. కుటుంబ కట్టుబాట్లు భరిస్తూ, పెండ్లి తర్వాత చదువు అవసరమా అనే సమాజానికి సమాధానం చెబుతూ తన చదువును కొనసాగించారు. చదువు పూర్తయ్యాక సివిల్‌ జడ్జి పోస్ట్‌ కోసం టి.ఎస్‌.పి.ఎస్‌.సి పరీక్ష రాసే సమయానికి ఆమె నిండి గర్భిణి. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్షకు హాజరయ్యారు. ఇటీవలె పరీక్షా ఫలితాలు వచ్చి సివిల్‌ జడ్జిగా పోస్ట్‌ వచ్చింది. తాను వెళ్ళే మార్గంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ శ్రీపతి తన లక్ష్యంపైనే దృష్టిపెట్టారు. కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.
ప్రసవమైన రెండో రోజే…
కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోడం చాలా విశేషం. అలాంటిది లా చేయడం ఇంకా విశేషం. ఇక సివిల్‌ జడ్జి అంటే గొప్ప చరిత్రే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజులకే ఆమె పరీక్షకు హాజరై వార్తల్లో నిలిచారు. కాన్పు అయిన రెండో రోజే తన గ్రామం నుండి నాలుగు గంటలు ప్రయాణించి పరీక్ష రాసేందుకు బిడ్డతో సహా చెన్నై వెళ్ళారు. ఈ ప్రయాణంలో ఆమెకు భర్త వెంకటేశన్‌, తండ్రి కలియప్పన్‌ తోడుగా ఉన్నారు. అంతే కాదు ఆమెకు తల్లి నుండి కూడా పూర్తి మద్దతు లభించింది. తాను సాధించిన ఈ విజయానికి వారే మూల స్తంభాలని ఆమె చెబుతున్నారు.
అవకాశాలు దక్కాలి
‘నిరుపేద కొండ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం చూసి నేను సంతోషిస్తున్నాను. ఆమెకు అభినందనలు. తనకు మద్దతుగా ఉన్న తల్లి, తండ్రి, భర్తకు కూడా ధన్యవాదాలు. సామాజిక న్యాయం అనే పదాన్ని కూడా ఉచ్చరించడానికే ధైర్యం చేయని కొందరికి తమిళనాడు చెప్పే సమాధానమే శ్రీపతి లాంటి వారి విజయం. తమిళ మీడియంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడంతో ఈ రోజు శ్రీపతి ఈ విజయం సాధించారు. తనలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశాలు దక్కాలి’ అంటూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆమెకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్లు ఒప్పుకోలేదు
జడ్జి కావాలన్నది నా కల. ఇంతలో తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ పడింది. ఆ సమయంలో నేను గర్భవతిని. అయినా అప్లరు చేశాను. తీరా చూస్తే పరీక్ష తేదీ, నా ప్రసవం తేదీ ఒకే రోజు వచ్చాయి. దాంతో ఇక ఈ పరీక్ష నేను రాయలేనని ఆశ కోల్పోయాను. కానీ డెలివరీ డేటుకు ఒకరోజు ముందే నాకు పాప పుట్టింది. దాంతో మళ్లీ నాలో ఆశ చిగురించింది. అయితే డెలివరీ అయిన ఒక్క రోజుకే అంత దూరం ప్రయాణానికి డాక్టర్లు ఒప్పుకోలేదు. కానీ నేను ఈ పరీక్ష రాయాల్సిందే నని బతిమలాడుకున్నాను. దీంతో వారి ఆధ్వర్యంలోనే 200 కి.మీ ప్రయాణించాను. అంతదూరం వెళ్ళనైతే వెళ్ళాను కానీ బాగా నీరసంగా అనిపించింది. పరీక్ష రాయలేనేమో అని భయపడ్డాను. ఆ క్షణంలో నా గూడెం ప్రజలను గుర్తు చేసుకున్నాను. ఆ కష్టాలు గుర్తొచ్చి తిరిగి ధైర్యం నింపుకున్నాను. చివరకు నా శ్రమ ఫలించింది. సివిల్‌ జడ్జిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత కష్టపడి చదివించిన మా నాన్నకు, అన్నివిధాలుగా సపోర్ట్‌ చేసిన మా అమ్మకు, నా భర్తకు కృతజ్ఞతలు’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Spread the love