మాపటి మల్లెలు

మాపటి మల్లెలు”మమ్మీ.. చూడు..”
పిల్లల యూనిట్‌ టెస్ట్‌ పేపర్స్‌ దిద్దుతున్న నేను నవ్వుతూ తలెత్తి శృతి కేసి చూసాను.
నాలుగేళ్ల శృతి బుజ్జి చేతులలో ఏదో భద్రంగా పట్టుకొని బుడిబుడి నడకలతో నా దగ్గరకి వచ్చింది.
”ఏంటి బంగారు” లాలనగా అడిగాను.
బుజ్జి చేతులు విప్పి చూపింది. ముదురు రాణీ పింక్‌ రంగులో చక్కని పూలు. మా చిన్నప్పుడు వాటిని ‘చంద్రకాంత పూలు’ అనే వాళ్ళం. అప్పట్లో రాణీ పింక్‌, తెలుపు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందులో బోలెడు రంగులు కనిపిస్తున్నాయి.
”అబ్బా, ఎంత బాగున్నాయో” ఆశ్చర్యం చూపిస్తూ అన్నాను.
శృతి ముఖం వెలిగిపోయింది.
”మీనమ్మ ఇచ్చింది” పూలని భద్రంగా పట్టుకుని మురిపెంగా చూస్తుంది శృతి.
”ఏం పూలంటారు?”
”మీనమ్మ చెప్పలేదు” బిక్కమొఖమేసింది శృతి.
”నేనడుగుతానులే” బుజ్జగించే ప్రయత్నం చేసాను.
ముడిపడిన నొసలు సరిచేసుకొని, జాగ్రత్తగా ఆ పూలను బల్లమీద పెట్టి, తన బొమ్మలకేసి పరుగెత్తింది శృతి.
”అమ్మ, టీ..” మినమ్మ కప్పు తెచ్చింది.
”నువ్వు ఈ పూల పేరు చెప్పలేదట” నవ్వుతూ అన్నాను.
”శృతి పాప అందా” అడిగింది మీనమ్మా.
టీ తాగుతూ తలూపాను.
”మేము చిన్నప్పుడు చంద్రంకాత పూలు అనేవాళ్లం” నేనే చెప్పాను.
”ఆ పేరు తెలియదు. ఇక్కడ ‘మాపటి మల్లెలు’ అంటారు. సాయంత్రం పూసి, ఉదయానికి వాడిపోతాయి కదా, అందుకే” విడమరచి చెప్పింది మీనమ్మ.
ఖాళీ కప్పు తీసుకొని ఆమె వెళ్ళాక, అప్రయత్నంగా నా కళ్ళు పూలవైపు మళ్ళాయి.
చిక్కని రాణీ రంగులో ఏంతో అందంగా, సున్నితంగా ఉన్నాయి పూలు.
‘మాపటి మల్లెలు’ సన్నగా గొణిగినట్టు అన్నాను.
నిజమే, సాయంత్రం ఎంతో అందంగా ఉంటాయి, ఎండ తగిలే సరికి వాడిపోతారు.
నాకళ్లు శృతి వైపు మళ్ళాయి. తన బొమ్మలతో ఆటలో మునిగి ఉంది. అప్రయత్నంగా ఒక నిట్టూర్పు వదిలాను.
ఈసారి పూలమీదకు మళ్ళిన నా కళ్ళకి, నా చెల్లెలు నందన ముఖం కనిపించింది.
నందన నాకన్నా మూడేళ్లు చిన్న. అమ్మ నాన్నలకి మేమిద్దరమే పిల్లలం. మగపిల్లాడు లేడని అందరూ అన్నా నాన్న పట్టించుకోలేదు. తను, అమ్మ పొలం చేస్తూ, ఆడపిల్లల్ని చక్కగా చదివించాడు.
నేను టీచర్‌ ట్రైనింగ్‌ చేసి జిల్లా పరిషత్‌ టీచర్‌గా స్థిరపడ్డాను. నందన మాత్రం ఇంజనీరింగ్‌ అని సిటీ వెళ్ళడానికి సిద్ధపడింది. నాన్న ఏ మాత్రం సందేహించకుండా చెల్లిని అదే చదువుకి పంపాడు.
నాలుగేళ్ల చదువు, కాలేజీ స్నేహాలు, సిటీ జీవితం అన్నీ నందన మీద చాలా ప్రభావం చూపాయి. సెలవులని ఇంటికి రావడం నెమ్మదిగా తగ్గిపోయింది. చదువనీ, ప్రాజెక్ట్‌ అనీ మరేదో అనీ నెమ్మదిగా ఇంటికి దూరమైంది.
నాలుగేళ్ల చదువు పూర్తయి, ఏదో ఉద్యోగం అనీ, ఇంటికి రావడం మానేసింది. తనకే ఆందోళన కలిగి ఒకసారి గట్టిగా నిలదీసింది. నెమ్మదిగా గుట్టు విప్పి చెప్పింది నందన.
కాలేజీలో ఒక అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాం అనీ, అయితే ఇంకా కొంతకాలం పడుతుందని….
నాకయితే భయమేసింది కానీ నందన చాలా ఖచ్చితంగా చెప్పింది. అతను మోసం చేయడు అన్న నమ్మకంతో, అమ్మా నాన్నలకి ఒప్పించే బాధ్యత నాకే అప్పచెప్పింది.
నెలలు గడుస్తున్నా, నందన దగ్గరనుండి కబురులేదు. రెండు రోజులు స్కూల్‌కి సెలవులు వస్తే, నేనే సిటీకి వెళ్ళాను. నందన ఉండే పీజీ హాస్టల్‌ దగ్గర తను అక్కడ ఉండటం లేడని చెప్తే, మరల తెలియని భయమేసింది.
మరెక్కడ వెతకాలి అని దిగాలుగా చూస్తుంటే, ఒక అమ్మాయి చిన్నగా తనచేతిలో ఒక చిన్న స్లిప్‌ పెట్టీ, వడివడిగా వెళ్ళిపోయింది.
ఆ స్లిప్‌లో ఒక అడ్రస్‌.. ఆటో మాట్లాడుకొని, బయలుదేరాను.
ఆ ఏరియా పేరు వినగానే ఆటో వాని ముఖం మారింది. కానీ మాట్లాడకుండా నడిపాడు.
ఒక అరగంట తరువాత ఇంచుమించు మురికివాడ లాంటి ఏరియా దగ్గర ఆపాడు. అతనికి డబ్బు చెల్లించి ఒక అడుగు ముందుకేసి, చుట్టూ చూసాను. ఇళ్ళు ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నాయి. పాతబడిన గోడలు, పెయింట్‌ వేయక చాలా కాలమైనట్టున్నాయి.. మొత్తానికి, ఆ వాతావరణం నాకు ఆందోళన, అనుమానం కూడా కలిగించింది..
నా చేతిలోని స్లిప్‌ మీదున్న నంబర్‌ మరల ఒకసారి చూసుకొని, గోడలమీద రాసిన నంబర్లను చూసుకుంటూ ముందుకు నడిచాను. అప్పటికి నెమ్మదిగా మధ్యాహ్నం అవుతున్నా, ఆ ఇళ్ళల్లో ఎక్కడా అలికిడి లేదు. అసలు ఎవరైనా ఉన్నారా అని సందేహం కలిగింది. ఒక అయిదారు ఇళ్ళు దాటాక, నేను వెదుకుతున్న ఇల్లు దొరికింది.
మూసిన తలుపు, మురికి గోడలు, నిశ్శబ్దం.. ఇవన్నీ మనసును కలవర పెడుతున్నా, తలుపుకున్న గొళ్ళెం గట్టిగా తట్టాను. కొన్ని నిముషాల నిశ్శబ్దం తరువాత, భళ్ళున తలుపు తెరుచుకుంది.
”ఏమిటీ… పొద్దునే వస్తారు. సాయంత్రం గానీ మేం సిద్దం కామని తెలీదా?” ఆవలిస్తూ, చెరిగిన జుట్టు ముడి వేసే ప్రయత్నం చేస్తూ అడుగుతుంది ఒక మధ్య వయస్సు మనిషి.
నన్ను చూస్తూనే ఆవిడ చిరాకు తగ్గింది..”ఎవరు మీరు, ఏం కావాలి?” అడిగింది.
నందన ఇక్కడ ఎందుకు ఉంటుంది అనుకుంటూ… ”నందన..” అని చిన్నగా అన్నాను.
”ఓ, ఆ పిల్లా.. నీకేమవుతాది?”
నేను మౌనంగా ఉండిపోయాను.
”సరే, నాకెందుకు.. మంచం పట్టి పది రోజులు. నాకు బేరం లేనిది, మందులు కొనడం కుదరదు. మందులకు డబ్బులిస్తే చూపిస్తా…” తలుపు రెక్కకి ఆనుకొని అడిగింది.
మారుమాట్లాడకుండ పర్స్‌లోంచి అందినంత డబ్బు తీసి ఆమెకి అందించాను. మెరుస్తున్న కళ్ళతో అందుకుని, జాకెట్లో దోపుకుంటూ, చేత్తో సైగ చేసింది. సందేహంగా ఆమె వెనక లోపలికి నడిచాను. పగలే అయినా లోపల చీకటిగా ఉంది. చీకటితోపాటు ఒకలాంటి గబ్బు వాసన… కడుపులో తిప్పుతున్న ఫీలింగ్‌. చీర చెంగుతో ముక్కు మూసుకుంటూ, ఆమెను అనుసరించాను.
గదుల్లో గదుల్లోంచి ఆమె వెనకాల నడుస్తూ, చుట్టూ చూడటానికి కూడా భయపడ్డాను. ఇటువంటి ప్రదేశంలో నందిని ఉండదు, ఆ అమ్మాయి పొరబడింది అనీ మనసులో ఏదో ఆశ! ఒక మూలగా ఉన్న తలుపు మూసిన గది ముందు ఆగి, వెళ్లు అన్నట్లు సైగ చేసి ఆమె వెను తిరిగింది..
నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది.. నెమ్మదిగా తలుపు తోసాను. లోపల నా చెల్లెలు వుండకూడదు అని నా మనసు పదేపదే కోరుకుంటుంది.
ఒక పక్కగా ఉన్న చిన్న కిటికీ నుండి పడుతున్న మసక వెలుతురులో, కిటికీ పక్కన మంచం కనిపించింది. మిగతా గదిని పరిశీలించే ఉద్దేశం నాకు లేదు. అందుకే తిన్నగా మంచం వద్దకు నడిచాను.. దుప్పటి కప్పుకున్న ఆకారం. స్పష్టంగా కనిపించటం లేదు. సరిగ్గా ముఖం మీద మాత్రం నీడ పడుతుంది.
నా కళ్ళు ఆత్రంగా వెతికేలోగా,” అక్కా” అంటూ సన్నని స్వరం… గుండె జారిపోయింది…
నోట మాట రాక నిలిచిపోయిన నేను, మరోసారి ”అక్కా, నువ్వేనా” అన్న మాటలకి ఉలిక్కి పడ్డాను.
”వందనా” ఇంకా అయోమయంగా అడిగాను..
”అక్కా, ఇక్కడికెలా వచ్చావు?” నందన బలహీనమైన స్వరంతో అడిగింది.
”ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమిటిది?” కళ్ళనుండి నీరు జలజల రాలాయి..
”అక్కా” భోరుమంది నందన. మంచం మీద నందన శరీరం దు:ఖానికి ఎగిసిపడే దానిబట్టి, ఆమె మంచం మీద ఉందని తెలుస్తుంది. ఎముకల గూడు మీద దుప్పటి కప్పినట్టుంది.
అక్కా చెల్లెళ్లం ఒకరినొకరు కావలించుకొని ఎంతసేపు ఉన్నామో తెలియలేదు.. నా మనసులో ఎన్నో ప్రశ్నలు.
నెమ్మదిగా నందినిని నా చేతుల్లో నుంచి తప్పించి, ఒకసారి తేరి చూసాను. నందిని ఎముకల గూడులా ఉంది. కానీ పొట్ట మాత్రం పెద్దగా ఉంది. నా చూపు పొట్టమీద ఆగడం గమనించి, నందిని నెమ్మదిగా వెనక్కి జరిగి గోడకి చేరపడింది.
”నా బుద్దిహీనతకి బహుమానం అక్కా…పెళ్లి చేసుకుంటాననినీ నమ్మించి, వాడుకున్నంత వాడుకుని, ప్రెగెన్సీ అనీ చెప్పగానే, పిన్ని ఇల్లు అని చెప్పి, ఇక్కడ పెట్టి, మాయమైపోయాడు…” కిటికీలో నుండి బయటకు చూస్తూ నిర్లిప్తంగా చెప్పింది.
”ఎవరతను, నాకు చెప్పు. నేను మాట్లాడుతాను” అనునయంగా చెప్పాను.
నిర్జీవమైన నవ్వు నవ్వింది నందిని.
”ఆ అవకాశం లేదక్కా.. అమెరికా వెళిపోయాడు..”
”అయినా పరవాలేదు. కంప్లైంట్‌ పెడదాం.. వివరాలు చెప్పు” బతిమాలి అడిగాను.
”వద్దక్కా, ప్రేమలేదు అని తెలిసాక, మళ్ళా అతనితో కలవడం అనవసరం అక్కా..” స్థిరంగా చెప్పింది.
ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న దృఢ సంకల్పం అర్ధమై, మౌనంగా ఉండిపోయాను..
”సరే, పద..ఇంటికి వెళదాం..”
”వద్ధక్కా, నాన్న నామీద పెట్టుకున్న నమ్మకం చంపేశా. ఏ ముఖం పెట్టుకొని నాన్నని కలవగలను..” కళ్ళవెంట నీళ్ళు జలజల రాలాయి.
”అదేం ఫరవాలేదు. నువ్వులేచి బయల్దేరు.”
”నాకు ఇప్పుడు ఏడో నెల అక్కా..” నా ముఖంలోకి సూటిగా చూస్తూ అంది నందిని.
”ఇంటిదగ్గర బాగుంటుంది. పద పద” హడావిడి చేసాను.
”అక్కా… నన్ను క్షమించు. నేను రాలేను” భోరుమంది.
నాకేమీ తోచలేదు. నందిని నా మాట వినేలా లేదు. అలా అని తనని అక్కడ వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. ఏడ్చి ఏడ్చి నందిని మగత నిద్రలోకి జారుకుంది.
ఏమీ పాలుపోక మంచం మీద ఒక పక్కగా కూర్చుని, ఫోన్‌ తీసి చూసాను. రెండు మిస్డ్‌ కాల్స్‌. భార్గవ నుండి. భార్గవ నాకు బి.ఇడి లో పరిచయం. నాలాంటి కుటుంబ నేపథ్యం.. అందువల్ల ఇద్దరం ఇష్టపడ్డం. కానీ నందిని కూడా స్థిరపడ్డాక, పెళ్లి విషయం మాట్లాడాలని అనుకున్నాం.
భార్గవ సిటీలోనే గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఫోన్లో భార్గవ పేరు మీద బట్టన్నొక్కి, కాల్‌ చేసాను. రెండో రింగుకే పలికాడు.
”సారీ భార్గవ, నీ కాల్స్‌ మిస్‌ అయ్యాను” ముందుగా చెప్పాను.
”ఫరవాలేదు.. బిజినా?” అడిగాడు.
”నేను సిటికే వచ్చాను. నీతో మాట్లాడాలి. రాగలవా?” అడిగాను.
”మరో పది నిముషాల్లో లంచ్‌ టైమ్‌.. ఎక్కడికి రావాలి?” అడిగాడు.
అడ్రస్‌ చెప్పాను. భార్గవ వైపు కొంత నిశ్శబ్దం.
”హలో” నెమ్మదిగా పిలిచాను.
”ఆ ఏరియాలో నీకేం పని చందనా? అది అంత మంచి ఏరియా కాదు”
”నువ్వు వస్తే చెపుతాను. రాలేను అంటే ఫరవాలేదు..” స్థిరంగా చెప్పాను. భార్గవ సందేహం నాకు అర్థమైంది. కానీ నందన, భార్గవ కంటే నాకు నందనే ముఖ్యం.
”అరగంటలో అక్కడ ఉంటా” భార్గవ ఫోన్‌ కట్‌ చేసాడు.
తరవాత భార్గవ రావడం, పరిస్థితి అర్ధం చేసుకోవడం జరిగింది. నందిని ని భార్గవకి తెలిసిన వర్కింగ్‌ వుమన్స్‌ హాస్టల్‌ లో పెట్టి, అక్కడ వార్డెన్‌ కి అప్పజెప్పాం.
తరువాత రెండు నెలలు… ఇంట్లో విషయం తెలియకుండా, తరుచుగా సిటీలో క్లాసులని చెప్పి వస్తూ…నందినిని జాగ్రత్తగా చూసుకున్నాం.. భార్గవ కూడా చేతనైనంత హెల్ప్‌ చేసాడు.
అంతా బాగుందనుకున్న సమయంలో నాన్నకి పక్షవాతం… పొలం పనులు చేయలేక పొలం కౌలు కిచ్చారు. నాన్నని చూస్తూ, సపర్యలు చేస్తూ, అమ్మ నిద్రలోనే గుండె నొప్పితో ప్రాణం విడిచింది.
చెల్లికి ఈ విషయం చెప్పలేక, చెల్లి విషయం నాన్నకి చెప్పలేక సతమతమై ఉక్కిరబిక్కిరయ్యాను. నాన్న మధ్యమధ్యలో చెల్లి గురించి అడిగినా, సెలవు దొరకటం లేదని చెపుతూ గడిపాను.
ఒకరోజు స్కూల్లో ఉండగా భార్గవ నుండి ఫోన్‌.. హడావిడిగా సిటీ కి పరుగెత్తాను. నందినికి నొప్పులు మొదలైతే, హాస్పిటల్‌ కి తీసుకువెళ్లారు. నెలలు నిండక ముందే పాప పుట్టింది. నందిని బల్ల మీద ప్రాణం వదిలింది. ఇంక్యుబటర్‌లో ఉన్న పసి గుడ్డును అయోమయంగా చూసాను. భార్గవ నా పక్కనే ఉన్నాడు. బేలగా అతని ముఖంలోకి చూస్తే, ధైర్యం చెప్పాడు. నాన్నకి చెప్పకుండానే నందిని దహన సంస్కారాలు ముగించి ఇంటికి వచ్చాను.
నాన్న తనలో తనే మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు భార్గవని ఇంటికి పిలిచి, నాన్నకి పరిచయం చేసాను.
”చెల్లి… చెల్లి” అంటూ తడబడుతున్న నాలికతో అడిగాడు.
”చెప్పాను, వస్తుంది” అనీ అబద్దం చెప్పి, రెండు రోజుల తరువాత రిజిస్టర్‌ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నాం.
చిన్న పాపని మరో పది రోజులైనా హాస్పిటల్‌లో ఉంచాలన్నారు. తరువాత చిన్ని శృతిని ఇంటికి తెచ్చి, నాన్నకి చూపాను. అర్ధం కానట్లు చూసాడు.
”మేము పెంచుకుంటాం. అమ్మానాన్న లేరు” వివరించాను.
నాన్న సంతోషంగా తలూపాడు. ఆ రకంగా శృతి నా కూతురైంది. భార్గవ శృతిని చాలా గారం చేస్తాడు. శృతికి ఏడాది నిండకముందే నాన్న కాలం చేసాడు.
భార్గవ, నేను ప్రస్తుతం సిటీలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ఏదో వంకన నా ఆలోచన నందిని మీదకి మల్లుతుంది. నందిని వేసిన తప్పటడుగు శృతి పాలిట శాపం కాకుండా, నేను భార్గవ నిలుచున్నాం. కానీ ఈ కాలపు పిల్లల తొందరపాటు పనులకి ఇలాంటి శృతులు ఇంకా చాలామంది బలవుతున్నారు.
తెలిసీతెలియని వయస్సులో, సినిమాల ప్రభావం వల్ల ఆకర్షణను ప్రేమనుకొని, ఆడపిల్లలు పక్కదారి పడుతున్నారు. జల్సా చేసుకుని అబ్బాయిలు ముఖాలు చాటేస్తున్నారు. అది మామూలే! ఎక్కడో ఒకరు భార్గవ లాంటి వాళ్లు ఉంటారు. అలాగే అందరు పసివాళ్లు, శృతిలా అదృష్టవంతులు కాలేరు.
నందిని లాంటి ఆడపిల్లలు ‘మాపటి మల్లెల’లాగా, ఒక్కసారి విరబూసి వాడుతున్నారు.. రోజులు ఎంత మారినా, మగవానికి ఆడది విలాస వస్తువు లెక్కే! అభం శుభం తెలియని చంటి బిడ్డలు అనాధలుగా రోడ్లపాలవ కూడదు.. ఆధునికత పేరుతో సంప్రదాయాలు, కట్టుబాట్లు మరచి మాపటి మల్లెలు కావద్దు అని నా స్టూడెంట్స్‌కి, తెలిసిన పిల్లలందరికీ చెపుతాను. కానీ నా చెల్లెలు నాకు తిరిగి రాదు….
– మృదుల పోరెడ్డి
6303909565

Spread the love