అన్నం తిన్నోడు తన్నులు తిన్నోడు ఎన్నటికీ మరిచిపోడు

అన్నం తిన్నోడు తన్నులు తిన్నోడు ఎన్నటికీ మరిచిపోడుజీవితంలో కొన్ని సంఘటనలు జ్ఞాపకం ఉంటాయి. మరికొన్ని అసలే ఉండయి. వాటి తీవ్రతను బట్టి ఉంటది. రకరకాల సంబంధాల వల్ల చుట్టాల దగ్గర మిత్రుల ఇంట్ల భోజనాలు చేస్తుంటాం. అట్లనే బడికిపోయినప్పుడు చదువు రాకుంటే సార్లతోని దెబ్బలు తిన్న జ్ఞాపకాలు ఉంటయి. ఏవి మదికి ఉంటయి ఏవి మదికి ఉండవనే విషయం వచ్చినప్పుడు ‘అన్నం తిన్నోడు తన్నులు తిన్నోడు ఎన్నటికీ మరిచిపోడు’ అని అంటరు. కొసరి కొసరి వడ్డించేవాల్లను కడుపునిండా తిను, తిను అని అరుసుకునేవాల్లు ఎల్లకాలం గుర్తుంటరు. అట్లనే ఏ కారణంగానైనా దెబ్బలు తింటే కూడా గుర్తుంటయి. అందుకే ‘తిన్నకాడ పేరు తల్వాలె’ అని కూడా అంటరు. అయితే దీనికి విరుద్దంగా ‘తిన్నింటి వాసాలు లెక్కబెట్టే’ ఆసాములు అక్కడక్కడా ఉంటరు. వాల్ల పట్ల జాగ్రత్తపడాలి. అయినా అసొంటోల్లు కన్పిస్తనే ఉంటరు. ఇసోంటి దుర్మార్గులనే వీడు ‘అన్నం పెట్టినోనికె సున్నం పెట్టే రకం’ అంటరు. ఇసోంటోల్లను అంజనం ఏసి తెల్సికున్న తెల్వది. అయితే కొందరిని మాటలతోనే ఎరుక పట్టవచ్చు. ‘అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టితే చాలదా’ అనే సామెత కూడా ఉన్నది. ఎప్పుడు మంచివాల్లను తెల్సికోవచ్చు గాని మంచివాల్లుగా నటించేవాల్లను గుర్తుపట్టుడు కష్టం. నటన కాబట్టి అతి మర్యాద, అతి ప్రేమ, చనువు ఉన్నట్లు ఒలకబోస్తరు. దానికే అందరు పడిపోతరు. అప్పుడు వాల్ల అసలు మనిషి కన్పిస్తరు. తిన్నింటివాసాలను లెక్కపెట్టుతరు. ఎప్పుడు ఏం చేయాలో, ఎట్లా ఆడుకోవాలో పథకం వేసుకుంటరు. దేనికైనా పరిమితికి లోబడి పద్ధతిగా ఉండాలె గాని ‘అనువ్వగాని చోట అధికులం అనరాదు’ అన్నట్టు వ్యవహరించాల్సి ఉంటది. ఇవన్ని ఎప్పుడు వస్తయి అంటే ‘అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువైతది, ఆచారం ఎక్కువైతే గాచారం తక్కువైతది’ అనే సామెత ఉండనే ఉన్నది. జీవితంలో ఒడిదొడుకులు సహజం. వాటిని దాటుకుని ముందుకు నడవడమే కావాల్సింది.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love