దేశంలోని 254 నగరాల్లో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని జనవరిలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ విశ్లేషణ వెల్లడించింది. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం, దాని ఆరోగ్య ప్రమాదాలు ఎన్నో ఏండ్లుగా చర్చనీయాంశంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన పెంచడం కూడా చాలా ముఖ్యం. అటువంటి కృషే చేస్తున్నారు కొందరు మహిళలు. సంస్థలుగా ఏర్పడి వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమహిళలు ఎవరో, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం…
మహిళా హౌసింగ్ ట్రస్ట్, గ్రాస్రూట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అనేవి ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పౌరులను సమీకరించే ఓ కమ్యూనిటీ ఉద్యమం. హెల్ప్ ఢిల్లీ బ్రీత్ ఆధ్వర్యంలో ఢిల్లీ మహిళలకు వారి కమ్యూనిటీలలో వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడానికి అవసరమైన శిక్షణనిస్తున్నాయి. పోర్టబుల్ AQ× (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్ సహాయంతో ఈ AQ× అంబాసిడర్‌లు, ఢిల్లీలోని (సమస్యలు ఎక్కువ ఉండి శ్రద్ధ వహించాల్సిన ప్రాంతాలు) గోకుల్‌పురి, భలాస్వా, నందనాగ్రి, బక్కర్‌వాల్‌లో తమ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్ప్ ఢిల్లీ బ్రీత్, మహిళా హౌసింగ్ ట్రస్ట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఆర్ట్ ఈవెంట్‌ల ద్వారా కత్‌పుత్లీ కాలనీ, గీతా నగర్, నెహ్రూ నగర్‌లోని స్థానిక వ్యక్తులతో కలిసి పని చేస్తున్నారు. ఢిల్లీ రాV్‌ాగిరి డేస్ ఈవెంట్లు జరిగే సమయంలో ఈ హెల్ప్ ఢిల్లీ బ్రీత్ వాయు కాలుష్యం సమస్యపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కొన్ని రకాల ఆటలు, కథనాల ద్వారా కాలుష్యం వల్ల జరిగే ప్రయాదాలను తెలియజేస్తుంది. హెల్ప్ ఢిల్లీ బ్రీత్ కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, సెంటర్ ఫర్ సోషల్ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజన్‌తో కలిసి 1.5 లక్షల మందికి చేరువయ్యే లక్ష్యంతో అవగాహన డ్రైవ్‌లు, డోర్-టు డోర్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌లను చేస్తోంది.
అవగాహన పెంచుకోవడం
సరోజ్ బెన్ బక్కర్‌వాలాకు చెందిన 39 ఏండ్ల గృహిణి AQ× మానిటర్‌తో కలిసి పని చేస్తోంది. గాలి ఎంత కలుషితమైంది, కాలుష్యానికి కారణాలు, దానిని ఎలా నివారించవచ్చు అనే దాని గురించి ప్రజలతో మాట్లాడుతుంది. ‘ఎక్కువ చెట్లను నాటమని, బొగ్గు, కలపను కాల్చవద్దనీ, దానికి బదులుగా హీటర్‌ని ఉపయోగించమని నేను ప్రజలకు చెప్తున్నాను. చెట్లను నాటటం వల్ల అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయని చెప్తున్నాను. ఈ విధంగా వాయు కాలుష్యాన్ని తగ్గించుకుంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతున్నాము’ అని ఆమె చెబుతుంది.
కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్
ఢిల్లో పరిధిలో పని చేస్తున్న 8-9 మంది మహిళా AQ× అంబాసిడర్‌లలో సరోజ్ కూడా ఒకరు. ఈ మహిళలు పదిహేను రోజులకు ఒకసారి హెల్ప్ ఢిల్లీ బ్రీత్, మహిళా హౌసింగ్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. అక్కడ తమ ఆలోచనలను, చేయాల్సిన పనులను పంచుకుంటారు. ‘సమావేశాలను నిర్వహిస్తూ నిరంతరం సమాచారాన్ని పంచుకునే కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్ మాకు ఉంది. ఈ సమావేశాల కోసం నేను నా ప్రాంతంలోని ప్రజలను సమీకరిస్తాను. తద్వారా వారు నిపుణులు చెప్పే కాలుష్య ప్రభావాలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుంటారు’ అని సరోజ్ చెప్పారు. సరోజ్ బెన్‌తో పాటు సవ్దాకు చెందిన జరీనా బెన్ కూడా AQ× అంబాసిడర్‌గా గత 12 ఏండ్లుగా మహిళా హౌసింగ్ ట్రస్ట్‌తో కలిసి పని చేస్తున్నారు. ఆమె అదే సంస్థ కింద పని చేస్తున్న దిశా మహిళా మండల్ గ్రూప్ హెడ్. 46 ఏండ్ల ఆమె కదమ్ అనే ఓ ఎన్‌జీఓతో కూడా కలిసి పని చేస్తుంది. సంస్థ కోసం సర్వేలు, ఫీల్డ్‌వర్క్ చేస్తుంటుంది. ‘AQ× వారు పొల్యూషన్ ప్రాజెక్ట్ మహిళా హౌసింగ్ ట్రస్ట్‌కు వచ్చి వాయు కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వెంటనే శిక్షణ పూర్తి చేసుకుని నా పని ప్రారంభించాను’ అని జరీనా చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు
జరీనా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాలుష్య స్థాయిలను తనిఖీ చేయడానికి AQ× మానిటర్‌ను ఉపయోగిస్తుంది. ‘నా ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడతాను, అవగాహన కల్పించడానికి బ్లాక్ టు బ్లాక్‌కి వెళ్తాను. సమావేశాలు నిర్వహిస్తాను. కాబట్టి గాలి నాణ్యత ఎంత అధ్వాన్నంగా ఉందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. చలికాలంలో సాధారణంగా చలి మంటలు వేసుకుంటారు. దాని వల్ల కూడా కాలుష్యం పెరుగుతుంది. వాటి బదులు రూం హీటర్లు వాడాల్సిందిగా చెప్పాను. ఇప్పుడు ఎక్కువ మంది అవే వాడుతున్నారు. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అలాగే వేసవిలో కూడా కాలుష్యం ఉంటుంది. గాలిని ఫిల్టర్ చేయడానికి ఫ్యాన్‌పై ఫిల్టర్‌లను ఉపయోగించమని నేను ప్రజలను ప్రోత్సహిస్తున్నాను’ అని ఆమె చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడే చిన్న మొక్కలు నాటడం, ఇంటి లోపల గాలిని శుద్ధి చేయడానికి ఉపయోగించే చిన్న బొగ్గు సంచుల గురించి కూడా ఆమె ప్రజలకు చెబుతుంది.
ప్రజలను హెచ్చరిస్తూ…
ఢిల్లీలోని జెజె కాలనీలోని సావ్దాలో నివసిస్తున్న ముంతాజ్ బెన్ రెండేండ్లుగా AQ× అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమె 12 ఏండ్లుగా మహిళా హౌసింగ్ ట్రస్ట్‌తో కలిసి ఉంది. ఆ సంస్థ కింద ఉన్నతి గ్రూప్‌కు అధిపతి. వాయు కాలుష్యంపై అవగాహన పెంపొందించడం, డేటా సేకరణ ప్రాముఖ్యత గురించి ఆమె వివరిస్తూ ‘నా డ్యూటీ మానిటర్‌ను ఒక గంట, రోజుకు రెండుసార్లు ఒకే చోట ఉపయోగించడం. మేము రిజిస్టర్‌లో డేటాను గుర్తిస్తాం. శిక్షణ తర్వాత ప్రతి 10-15 నిమిషాలకు మొదటి వారంలో నాలుగు పాయింట్ల వద్ద AQ× మానిటర్‌లను ఉంచాలని, ప్రతి పాయింట్‌లో ఎంత కాలుష్యం నమోదవుతుందో తనిఖీ చేసి దాని గురించి ప్రజలకు తెలియజేయాలని మాకు చెప్పారు’ అని ఆమె తన టాస్క్‌కు సంబంధించిన సూక్ష్మ వివరాలను పంచుకుంటున్నారు. ముంతాజ్ తన ప్రాంతంలోని మహిళలకు ప్లాస్టిక్ లేదా రబ్బరును కాల్చవద్దని ప్రచారం చేస్తోంది. వీటిని కాల్చడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి హెచ్చరిస్తుంది.
పథకాల గురించి చెబుతూ…
హెల్ప్ ఢిల్లీ బ్రీత్, మహిళా హౌసింగ్ ట్రస్ట్ నిర్వహించిన శిక్షణా సెషన్‌లు వాయు కాలుష్యం, ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి AQ× అంబాసిడర్‌లకు సహాయం చేశాయి. ‘ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, వెంటిలేషన్, చుల్హా నుండి గ్యాస్‌కి మారడం వంటి విషయాల్లో అవగాహన కల్పించి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మేము వారిని సన్నద్ధం చేస్తాము’ అని హెల్ప్ ఢిల్లీ బ్రీత్‌తో క్యాంపెయిన్ మేనేజర్ గురుప్రియా సింగ్ చెప్పారు. మహిళా AQ× అంబాసిడర్‌లకు లేబర్ కార్డ్, ఈశ్రమ్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, పిఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజన వంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాలు, భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల కింద ఉన్న పథకాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. వీటన్నింటిపై అవగాహన పెంచుకున్న మహిళలు వాయు కాలుష్య నివారణకై తమవంతు కృషి చేస్తున్నారు.