సవాలుగా స్వీకరించండి

Accept the challengeనేరస్థులను అదుపులో ఉంచడం అంటే మామూలు విషయం కాదు. అదొక పురుషాధిక్య ప్రపంచం. అలాంటి చోట మహిళా ఐపీఎస్‌ అధికారి తన సత్తా చాటడం అంటే అంత  సులభం కాదు. అయితే బీహార్‌కు చెందిన మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారి అది సాధ్యమే అని రుజువు చేశారు. ఆమే మంజరీ జరుహర్‌. భారతదేశంలోని మొదటి ఐదుగురు  మహిళా పోలీసు అధికారులలో ఈమె కూడా ఒకరు. ఆమె అందించిన మెరిటోరియస్‌ సర్వీస్‌కు గాను భారత ప్రభుత్వం నుండి పోలీసు పతకం, రాష్ట్రపతి పోలీసు పతకాన్ని కూడా  అందుకున్నారు. అంతే కాదు ఆమె రచించిన ‘మేడమ్‌ సర్‌’ అనే పుస్తకం ద్వారామహిళలు నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు అవసరమైన స్ఫూర్తినిచ్చారు.
‘నాయకులు అంటే క్రమశిక్షణ, సమగ్రత, విలువలు, నైతికతతో నడిచే వారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం, జట్టు సభ్యులకు దిశానిర్దేశం చేయడం, వారికి సరైన మార్గాన్ని చూపడం’ అంటున్నారు మంజరీ. భారతదేశంలోని ఇతర అమ్మాయిల మాదిరిగానే మంజరి కూడా చిన్నతనం నుండి ఆదర్శ గృహిణిగా పెరిగారు. నలుగురు తోబుట్టువులలో ఈమె పెద్దది. మంజరి ఓ స్కూల్‌కి వెళ్లి ఎంబ్రాయిడరీ నేర్చుకుంది. పాఠశాలలో కూతురు మంచి ప్రతిభ కనబరుస్తుందని తెలుసుకున్న తల్లి ఆమెకు కుట్టడం, వంట చేయడంతో పాటు ఆదర్శ గృహిణిగా ఎలా ఉండాలనే లక్షణాలను చక్కగా నేర్పించారు.
ఎవరిపై ఆధారపడకుండా…
‘ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు ఏవీ నాకు ఇంట్లో నేర్పలేదు. గృహిణిగా చేయవలసినవి మాత్రం నేర్చుకుంటే మంచి భర్త దొరుకుతాడని అమ్మ నాకు ఎప్పుడూ చెబుతుండేది’ అని మంజరి గుర్తు చేసుకున్నారు. 19 ఏండ్ల వయసులో ఆమెకు వివాహం జరిగింది. ‘కొన్ని కారణాల వల్ల ఆ వివాహ బంధం కొనసాగలేదు. అయితే అదే జీవితం పట్ల నా విధానాన్ని మార్చింది. నా తల్లిదండ్రులపై ఆధారపడకుండా నా జీవితానికి నేనే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను. నాకు తెలిసిన చాలా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఇవి గౌరవప్రదమైన ఉద్యోగాలు అని తెలిసి ఐపీఎస్‌కి ప్రిపేర్‌ అవ్వాలని నిర్ణయించు కున్నాను’ అని మంజరి చెప్పారు.
మొదటి మహిళా అధికారిగా…
ఆమె ఢిల్లీ వెళ్లి సివిల్‌ సర్వీసెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ కావడానికి ఓ స్టడీ సర్కిల్‌లో చేరారు. అలా ప్రయత్నించి 1976లో బీహార్‌ నుండి మొదటి మహిళా ఐపీఎస్‌ అధికారిగా, భారతదేశంలోని మొదటి ఐదుగురు మహిళా పోలీసు అధికారులలో ఒకరిగా అర్హత సాధించారు. ఆమె తన కెరీర్‌లో ముందుకు సాగడానికి కారణమైన దాని గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్‌ మొత్తంలో స్త్రీల దుస్థితి, ముఖ్యంగా మహిళలు పితృస్వామ్య సమాజానికి బాధితులైనప్పుడు ఎదుర్కొన్న క్రూరమైన పద్ధతులు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆ అమ్మాయిల కండ్లు నిత్యం నన్ను వెంటాడుతున్నట్లుగా ఉండేవి. ఆ చూపులు తమకు న్యాయం చేయమంటూ నన్ను ప్రేరేపించేది.
గుర్తును మిగిల్చిన ఓ కేసు
బీహార్‌లోని దానాపూర్‌లో ఏఎస్‌పీగా మంజరి మొదటి నియామకం. అక్కడ ఆమె పూర్తిగా కాలిపోయిన ఒక యువతి మృతదేహాన్ని చూసింది. దానిపై విచారణ చేస్తే అత్తమామలు ఆమెను చంపేసి మృతదేహాన్ని పడేయడం కోసం నదికి తీసుకువెళుతున్నట్టు తేలింది. తన తల్లిదండ్రులకు కొంతకాలంగా ఆ మహిళ పంపిన అనేక లేఖలను మంజరీ విచారణా సమయంలో గుర్తించింది. యువతిని భర్త, అత్తమామలు ఎలా చిత్రహింసలకు గురిచేశారో ఆ లేఖల్లో స్పష్టంగా ఉంది. తెలియజేశాయి. ‘ఈ అమ్మాయి చాలా పేద కుటుంబం నుండి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్త కుటుంబం ఆమెను చిత్ర హింసలకు గురి చేసి హత్య చేశారు. ఈ విషయం ఆమె తండ్రి నాకు చెప్పారు’ అని మంజరి తెలిపారు. హత్య కేసులో మృతురాలి అత్తమామలు కస్టడీలో ఉండగా, మహిళ తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కేసును ఉపసంహరించుకోవాలని మంజరిని వేడుకున్నారు. దానికి బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన కారణం మంజరిని షాక్‌కి గురి చేసింది. ‘ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆ వృద్ధుడు తన చేతులు ముడుచుకుని, కన్నీళ్లు కార్చుకుంటూ, పేద తండ్రి తన మరో కూతురిని ఆ హంతుకుడు వివాహం చేసుకోవడానికి అంగీకరించాడని చెప్పారు. అందుకే అల్లుడిని విడుదల చేయమని నన్ను వేడుకున్నాడు. ఈ ఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి శిక్ష నుండి తప్పించుకోవడానికి నిందితుల మోసపూరిత పథకం ఇది. అయితే న్యాయం పట్టాలు తప్పడాన్ని నేను అనుమతించలేను’ అంటూ మంజరి తాను రచించిన పుస్తకంలోని ఒక సంఘటన గురించి వివరించారు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా?
గ్రామీణ భారతదేశంలో పరిస్థితులు చాలా మారాయని ఆమె కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ చట్టం మరింత కఠినంగా మారిందని, సెక్షన్‌ 498ఏ మహిళలకు కొంత ఉపశమనం కలిగించిందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే మహిళలు చిత్రహింసలకు గురైన తర్వాత మాత్రమే ఈ సెక్షన్‌ స్త్రీకి ఉపశమనం ఇస్తుంది అంటున్నారు. ‘మన సమాజంలో స్త్రీల బాధలు ఇంకా కొనసాగుతున్నాయి’ అని ఆమె నొక్కి చెబుతున్నారు.
సొంత అనుభవాల సమాహారమే
వృత్తి రీత్యా తన సొంత అనుభవంలో ఎదురైన మహిళా జీవితాలనే ‘మేడమ్‌ సర్‌’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చిన మంజరి పితృస్వామ్య కట్టుబాట్లు, సంప్రదాయాల వల్ల బాధితులుగా భావిస్తున్న మహిళలందరికీ ‘మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని సవాలుగా స్వీకరించి అధిగమించండి. ఆ సంఘటనతో బాధపడుతూ, అవమానానికి గురయ్యామని విసుగు చెందకండి. జీవితంలో ఇంకేమి చేయలేమని నిరుత్సాహ పడకండి. మీలోని ప్రతికూల ఆలోచనలను వెనక్కు నెట్టేసి జీవితంలో ముందుకు సాగండి’ అంటూ సూచిస్తున్నారు.
‘మేడమ్‌ సర్‌’ గురించి
ఇందులోని ‘నమస్కారం’ అనే దాని వెనక ఉన్న కథ గురించి మాట్లాడుతూ ‘నేడు మహిళా అధికారులను చూస్తే దృష్టిలో కొంత మార్పు వచ్చింది. 1970లలో యూనిఫాంలో ఉన్న స్త్రీని చూడటం చాలా మందికి జీర్ణించుకోవడానికి ఒక చేదు మాత్రగా ఉండేది. అప్పట్లో ఖాకీ షర్ట్‌-ప్యాంట్‌, బెల్ట్‌, క్యాప్‌ ధరించి ఉన్న స్త్రీని చూసినప్పుడు పురుషులకు ఎలా స్పందించాలో తెలిసేది కాదు. అధికారిగా ఓ మహిళ ఉండడంతో ఒక విచిత్రమైన గందరగోళానికి గురయ్యేవారు. ఆ రోజుల్లో అధికారులను వారి జూనియర్లు ఎల్లప్పుడూ ‘సాహెబ్‌’, ‘హుజూర్‌’ అని చాలా గౌరవంగా సంబోధించేవారు. కానీ మహిళా అధికారిని ఏమని పిలవాలి? ఇక్కడే సమస్య ముందుకు వచ్చింది. దీనికి పరిష్కారంగానే నేను ‘మేడమ్‌ సర్‌,’ అనే పదాన్ని సృష్టించాను. అదే పేరుతో పుస్తకాన్ని రచించాను’ అని మంజరి పంచుకున్నారు.

Spread the love