కడ వరకు తోడుండేది భార్యే…

కడ వరకు తోడుండేది భార్యే...పెండ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సాధారణమే. అయితే చూసే వారికి అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఈ మాత్రం దానికే ఇంతగా గొడవ పడాలా! అనే సందేహం కూడా కొందరికి వస్తుంది. కానీ అనుభవించే వారు మాత్రం వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమస్యల నుండి ఎలా బయట పడాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌…
పల్లవి, అనిల్‌కి పెండ్లయి నాలుగేండ్లు అవుతుంది. నెలల బాబును ఎత్తుకొని హైదరాబాద్‌లోని సుందర్యపార్క్‌ వద్ద ఉన్న ఐద్వా అదాలత్‌ ఆఫీస్‌కి వచ్చింది పల్లవి. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇంట్లో భార్య, భర్త, అత్తమ్మ కలిసి ముగ్గురే ఉంటారు. పెండ్లయిన ఏడాదికే బాబు పుట్టాడు. చిన్న కుటుంబం, అంతా బాగానే ఉంది కదా! ఇక సమస్యేంటీ అనుకుంటున్నారా? పెండ్లి తర్వాత పల్లవి భర్తతో కలిసున్న రోజులు చాలా తక్కువ. అనీల్‌, పల్లవితో సరిగ్గా మాట్లాడడు. ఎక్కువ శాతం వాళ్ళ అమ్మతోనే ఉంటాడు. పల్లవి వంట చేసినా అతనికి నచ్చదు. వాళ్ళ అమ్మ చేస్తేనే తింటాడు. దాంతో ఒక్క వంట తప్ప మిగిలిన పనులన్నీ పల్లవినే చేసేది. కూరగాయలు ఈమె కట్‌ చేసి ఇస్తే వాళ్ళ అత్త వంట చేసేది. మిగిలిన అన్ని పనులు చేసినా వంటగదికి వెళ్ళే హక్కు మాత్రం ఆమెకు లేదు. ఆమె టీ తాగాలన్నా, టిఫెన్‌ తినాలన్నా వాళ్ళ అత్త ఇస్తేనే. అన్నం కూడా ఆమె పెడితేనే తినాలి. అంతే గానీ పల్లవి పెట్టుకొని తినడానికి లేదు.
రోజూ ఉదయం చల్లని నీటితో స్నానం చేసి మడి కట్టుకోవాలి. ఆ తర్వాతనే పనులు చేయాలి. స్నానం చేయకుండా రూమ్‌లో నుండి బయటకు వచ్చిందంటే అత్త జానకమ్మ బూతులు తిట్టేది. ఇక నెలసరి సమయంలో అయితే ఆ ఐదు రోజులు పల్లవికి నరకం కనిపించేది. ఆమెను ఒక వస్తువులా చూస్తారు. ఎవరూ ముట్టుకునేవారు కాదు. కింద పడుకోవాలి. ఆమె పక్క నుండి కూడా నడిచేవారు కాదు. భర్త, అత్త ఇద్దరూ తాకితే మైల పడిపోతాము అనే వారు. పొరపాటుగా పల్లవి తన బట్టలు తాకినా అది తప్పు అనేవారు. ఐదు రోజుల తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేయించేవారు. ఆమె బట్టలు, బొంతలు, బెడ్‌షీట్స్‌, అన్నీ ఉతకాలి. ఇంటి తలుపులు కూడా శుభ్రం చేయించేవారు. అనిల్‌ ఆమె దగ్గరకు కూడా వచ్చేవాడు కాదు. ఆ సమయంలో విపరీతమైన నొప్పితో పల్లవి విలవిల లాడిపోయేది. అలాంటి పరిస్థితుల్లో కూడా భర్త ఆమెను పట్టించుకునేవాడు కాదు. కనీసం ఆమెను కన్నెత్తి చూసేవాడు కాదు. ఆమెకు సహకరిస్తే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది అనేవాడు.
శారీరకంగా కలుసుకోవడం కూడా తప్పు కార్యం అన్నట్లుగా భావించే వాడు. ఎప్పుడూ భగవంతుడిని తలచుకోవాలి అంటాడు. ఎప్పుడైనా ఒక్కసారి పల్లవి దగ్గరకు వచ్చేవాడు. అప్పుడు కూడా జానకమ్మ కొడుకుని తిట్టేది. దాంతో ఎక్కువగా వాళ్ళ అమ్మ దగ్గరే పడుకునే వాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే పల్లవి గర్భవతి అని తెలిసింది. ఐదో నెల రాగానే పల్లవిని తల్లిగారింటికి పంపించారు. అక్కడే ఆమెకు బాబు పుట్టాడు. బాబు పుట్టి మూడు నెలలు గడిచాయి. అయినా అనిల్‌ గానీ, జానకమ్మ గానీ చూడటానికి వెళ్ళలేదు. ‘బాబును ఉయ్యాలలో వేస్తున్నాము’ అని కబురు చేస్తే అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేశారు. కనీసం డెలివరి అయినప్పుడు కూడా వెళ్ళలేదు. భర్త, అత్త ఎందుకిలా చేస్తున్నారో పల్లవికి అర్థం కాలేదు. అసలు సమస్య ఎక్కడుందో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంది. తన సమస్యలన్నీ చెప్పుకోవాలని ఐద్వా అదాలత్‌ ఆఫీస్‌కి వచ్చింది.
పల్లవి చెప్పిందంగా విన్న తర్వాత మేము అనిల్‌ను, జానకమ్మను పిలిపించాము. జానకమ్మతో మాట్లాడితే ‘మా ఇంట్లో ఒక పద్దతి ఉంటుంది. ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాతే ఏ పనైనా చేయాలి. అది పల్లవికి ఇష్టం లేదు. అందుకే ఆమె తల్లిగారింటికి వెళ్ళి తిరిగి రావడం లేదు. ఆమె వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంది. పల్లవి భర్త అనిల్‌తో మాట్లాడితే ‘అవును పల్లవి చెప్పింది మొత్తం నిజమే. మా అమ్మ చేసిన వంటనే నేను తింటాను. నేను చిన్నప్పటి నుండి మా అమ్మ చేతి వంటే తినేవాడిని. ఆమెకు నేను తప్ప ఇంకెవరున్నారు? అందుకే నేను మా అమ్మతోనే పడుకుంటాను. ఆఫీసు నుండి వచ్చిన తర్వాత కూడా ఆమెతోనే మాట్లాడుతూ కూర్చుంటాను. ఇకపోతే పల్లవితో అంటారా… ఆమెకు ఎప్పుడూ ఒకే ధ్యాస. నేను ఆమెతో మాట్లాడాలి. ఆమెతో సమయం గడపాలి. మా అమ్మతో కాకుండా ప్రతి రోజూ నేను రూంలో ఆమెతోనే ఉండాలి. భార్యాభర్తలు రోజూ కలుసుకోవల్సిన అవసరం లేదు. అది కేవలం పిల్లల కోసం చేసే పని. ఇప్పుడు మాకు బాబు పుట్టాడు. కాబట్టి ఇక మేమిద్దరం లైంగికంగా కలుసుకోవలసిన అవసరమే లేదు. ఆమెను ఇంటికి తీసుకు వస్తే తనతోనే ఉండమని అడిగిద్ది. అందుకే తీసుకు రావడం లేదు. నెలసరి సమయంలో కూడా ఆమె పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. కాకపోతే ఆమెను తాకితే వెంటనే స్నానం చేయాలి. అందుకే దూరంగా ఉంటాను. దాన్ని కూడా తప్పుగా చూపిస్తే ఎలా?’ అన్నాడు.
దానికి మేము ‘నెలసరి అనేది ప్రతి మహిళకు, ప్రతి నెలా వచ్చే ఒక సహజ క్రమం. అంతే గానీ ఇంకొకటి కాదు. ఆ సమయంలో మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కేర్‌ తీసుకోవల్సిన బాధ్యత మీది. దాని వల్ల మీరు మైల పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఈ రోజుల్లో కూడా మీ ఆలోచన ఇలా ఉండటం సరైనది కాదు. ఇకపోతే పెండ్లి చేసుకున్న తర్వాత భార్యను ప్రేమగా చూసుకోవల్సిన బాధ్యత భర్తగా నీకుంది. భార్యంటే మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే చుట్టం కాదు. జీవితాంతం నీకు తోడుగా వుండే నీ మనిషి. ఆమెతో మాట్లాడాలి. రోజులో కొంత సమయం ఆమె కోసం కేటాయించాలి. మీ అమ్మకు మీరు తప్ప ఎవ్వరూ లేరని ఎలా అంటున్నావో, అలాగే నీ భార్యకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరని గుర్తు పెట్టుకోవాలి.
ప్రతి రోజూ భార్యాభర్తలు సంతోషంగా గడపడం వల్ల ఇద్దరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. కానీ దాన్ని కూడా నువ్వు తప్పుగా భావిస్తున్నావు. లైంగిక సంబంధం కేవలం పిల్లల కోసం మాత్రమే అనే నీ మాటలు వింటుంటే మాకు జాలేస్తుంది. నువ్వు చెప్పిన ప్రకారం అయితే పిల్లలు కన్న తర్వాత ఏ భార్యాభర్తలు కలిసి ఉండాల్సిన పని లేదు. ఇప్పటికైనా నీ ఆలోచనా ధోరణి మార్చుకో. భార్యతో సంతోషంగా ఉండటం నేర్చుకో. అవసరమైతే మీ అమ్మను కొన్ని రోజులు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించి ఇంట్లో మీరిద్దరూ కలిసి ఉండండి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమగా ఉండండి. బాబు పనులు కూడా ఇద్దరూ కలిసి చూసుకోండి’ అని చెప్పి పంపించాము.
ప్రతి రోజూ భార్యాభర్తలు సంతోషంగా గడపడం వల్ల ఇద్దరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. కానీ దాన్ని కూడా నువ్వు తప్పుగా భావిస్తున్నావు. లైంగిక సంబంధం కేవలం పిల్లల కోసం మాత్రమే అనే నీ మాటలు వింటుంటే మాకు జాలేస్తుంది. నువ్వు చెప్పిన ప్రకారం అయితే పిల్లలు కన్న తర్వాత ఏ భార్యాభర్తలు కలిసి ఉండాల్సిన పని లేదు. ఇప్పటికైనా నీ ఆలోచనా ధోరణి మార్చుకో. భార్యతో సంతోషంగా ఉండటం నేర్చుకో.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love