మానసిక ఆరోగ్యంతో పోరాటం

Struggling with mental healthమొదటి బిడ్డ పుట్టిన తర్వాత శుభ్రత ప్రకాష్‌ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారిగా ఉన్న ఆమె ప్రసవానంతర తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు. కొన్ని రోజులు నిత్యం ఏడుస్తూ గడిపేవారు. ఇక భరించలేక జీవితాన్ని అంతం చేసుకోవాలని బాల్కనీ నుండి దూకేశారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. మానసిక ఆరోగ్యంతో ఆమె చేసిన సుదీర్ఘమైన పోరాటానికి ఇది నాంది. అప్పుడే తన లాంటి వారికి సహాయం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. అప్పటి నుండి మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించ డానికి తన వ్యక్తిగత అనుభవాలను అవసరమైన వారికి వివరిస్తున్నారు. సమాచారం మొత్తం సేకరించి ‘ది డి వర్డ్‌ – ఎ సర్వైవర్స్‌ గైడ్‌ టు డిప్రెషన్‌’ అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆమె పరిచయం నేటి మానవిలో…
‘నాలాంటి వ్యక్తికి మానసిక రుగ్మత ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అయితే స్వతహాగా నేను కొద్దిగ సున్నిత మనస్కురాలిని. ఎమోషన్స్‌ కూడా ఎక్కువే. కానీ ప్రసవం తర్వాత నా శరీరం మొత్తం మందగించింది. ఏ పనీచేయలేక పోయేదాన్ని. నాలో ఏదో మార్పు వచ్చింది’ అని ఆమె చెప్పారు. ఇది తర్వాత ఐదేండ్ల పాటు కొనసాగింది. ఆమె రెండవ సారి కూడా గర్భం ధరించారు. ఇది ఆమెకు ఆరోగ్యపరంగా భయంకరమైన కాలం. మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘నేను చాలా ఏడ్చేదాన్ని. నా భర్త, తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నావని నన్ను అడుగుతూనే ఉన్నారు. గర్భం దాల్చిన సమయంలో నేను చాలా ఒంటరిగా భావించాను. నా రెండవ బిడ్డ జన్మించిన రెండు నెలల తర్వాత ఆందోళన మొదలయింది. చెన్నై వంటి అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తున్నా నాకు మానసిక సమస్య ఉందని, వైద్యుని వద్దకు వెళ్ళమని ఎవ్వరూ సూచించలేదు’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. పుట్టుకతో వచ్చే గుండె వ్యాధిశుభ్రత చిన్నతనంలో అన్నింట్లో ముందు వరసలో ఉండే అమ్మాయి. పాడటం, నృత్యం, పెయింటింగ్‌, రాయడం, థియేటర్‌ ఇలా అన్నింట్లో ఆమెకు పరిచయం ఉంది. 2002లో ఆమెకు పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన గాయాలు కూడా పూర్తిగా మానకముందే యూపీఎస్‌సీ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. మార్చి 2009లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి న్యూరోఫిజిషియన్‌ను సంప్రదించాలనుకుంది. అప్పుడే ఆమె తీవ్రమైన ఆందోళన, ఒత్తిడితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చారు. కానీ రెండవ బిడ్డ కేవలం తొమ్మిది నెలల పసికందు కావడంతో ఇది సాధ్యం కాలేదు. డాక్టర్‌ కొన్ని మందులు సూచించాడు. కానీ వాటి వల్ల ఆమెకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మందులు పని చేయలేదు’నాకు కోపం ఎక్కువగా ఉండేది. కానీ మందులు నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. రోజంతా నిద్రపోతూ ఉండేదాన్ని. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. తిరిగి ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏర్పడింది. మందులు పని చేయడం లేదని వేసుకోవడం మానేశాను’ అని ఆమె చెప్పారు. ఆ సమయంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు. ఏం చేసినా ఎలాంటి ఊరట లభించలేదు. తిరిగి ఉద్యోగానికి వెళ్ళితే ఒత్తిడి మరింత ఎక్కువయింది. దాంతో సెలవులు తీసుకున్నారు. 2011లో తనకు అంతర్జాత లేదా జీవసంబంధమైన మాంద్యం ఉందని తెలుసుకుని మానసిక వైద్యుడిని సంప్రదించారు.టర్నింగ్‌ పాయింట్లు’మానసిక వైద్యుని సహాయం నాకు ఎంతో ఉపయోగపడింది. అనేక సెషన్ల నుండి ఎంతో నేర్చుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మందులను తగ్గించాను. మెల్లమెల్లగా సాధారణ పరిస్థితికి వచ్చాను’ ఆమె చెప్పింది. నిత్యం ఈత, యోగా, ధ్యానానికి వెళ్ళారు. ఏకాగ్రత పెంచుకునేందుకు సాధన చేయడం ప్రారంభించారు. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్నాళ్లు ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొన్నారు. ‘2012లో నాకు డిప్రెషన్‌ ఉందని ఉన్నతాధికారులకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇక నాకు వేరే మార్గం లేదు. లేచి పని చేసే పరిస్థితుల్లో లేను. సెలవు కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పని చేయకుండా తప్పించుకునేందుకు నేను సాకులు చెబుతున్నానని నా పై అధికారి అన్నాడు. కానీ ఇతరులు మాత్రం నాకు మద్దతు ఇచ్చారు’ అంటూ ఆమె చెప్పారు.అధ్యయనం మొదలుపెట్టారుసెలవులు తీసుకున్న తర్వాత శుభ్రత డిప్రెషన్‌, దాని కారణాల గురించి పరిశోధించడం ప్రారంభించించారు. దానితో పోరాడుతున్న వ్యక్తుల గురించి అధ్యయనం మొదలుపెట్టారు. చదివే కొద్దీ ఆమె మరింత నమ్మకం పొందారు. ఇది ఆమెకు మరింత శక్తినిచ్చింది. ఇక మానసిక ఆరోగ్యంపై బ్లాగ్‌ రాయడం ప్రారంభించారు. ఇది ‘ది డి వర్డ్‌ – ఎ సర్వైవర్స్‌ గైడ్‌ టు డిప్రెషన్‌’ అనే పుస్తకానికి దారితీసింది. సామాజిక ఆలోచనపై కథనాలు, పోస్ట్‌ల ద్వారా న్యాయవాదాన్ని కొనసాగించారు. వాట్సప్‌లో ఒక చిన్న కమ్యూనిటీని నిర్మించుకున్నారు. ‘నేను లైసెన్స్‌ పొందిన వైద్య లేదా మానసిక ఆరోగ్య నిపుణురాలిని కాదు. నేను చేసే న్యాయవాదానికి పరిమితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి నాలాంటి వారి అవసరం చాలా ఉంది. లేదంటే పరిస్థితులు మారవు’ ఆమె చెప్పారు. సవాళ్లు ఉన్నప్పటికీ”మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు భారత ప్రభుత్వంతో ఎందుకు పనిచేస్తున్నారు? మేము అలాంటి వారి జీతాల కోసం పన్నులు ఎందుకు చెల్లించాలి అని కొందరు నన్ను ప్రశ్నించేవారు.” అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమెను ఉద్యోగం నుండి తొలగించమని కూడా అన్నారు. ఏదిఏమైనా ఈ సమస్యకు బహుళ స్థాయిలలో జోక్యం అవసరం కాబట్టి కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కార్యక్రమాలు బలోపేతం చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘అవగాహన పెంచడానికి మాకు నిపుణులు, సూపర్‌ స్పెషలిస్ట్‌లు, శిక్షణ పొందిన సైకియాట్రిస్ట్‌లు, బ్లాక్‌, జిల్లా స్థాయిలలో వైద్యులు, సైకియాట్రిక్‌ నర్సులు, కమ్యూనిటీ నాయకులు అవసరం’ అని ఆమె చెప్పారు. మానసిక ఆరోగ్యంతో సవాళ్లు ఉన్నప్పటికీ శుభ్రత ఇప్పటివరకు ఐఆర్‌ఎస్‌లో అత్యుత్తమంగా పని చేస్తున్నారు. విజిలెన్స్‌, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌, ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. మూడేండ్లు నీతి ఆయోగ్‌లో డిప్యూటేషన్‌పై ఉన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను కమిషనర్‌గా ఉన్నారు.

Spread the love