విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయడమే లక్ష్యం

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్‌
నవతెలంగాణ-ఖమ్మం
విద్యార్థులకు పరీక్షలంటే ఒత్తిడి, భయం లేకుండా చేయటమే భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) లక్ష్యమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్‌ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్‌ ఎంసెట్‌ పరీక్షలు ఖమ్మంరూరల్‌ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీణ్‌ మాట్లాడుతూ… ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గత 20 ఏళ్ల నుండి ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య సారధ్యంలో మోడల్‌ ఎంసెట్‌, నీట్‌ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 30 వరకు ఆన్లైన్లో ఎంసెట్‌, ఆఫ్‌ లైన్‌లో నీట్‌ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరీక్షలకు సంసిద్ధులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్‌, సహాయ కార్యదర్శులు సంగీత, ప్రేమ్‌కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు ఉమేష్‌, హేమంత్‌, నగర నాయకులు వినోద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love