భారత రాజ్యాంగం మార్చలేరు

– మాదిగ జేఏసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ: మోదుగు జోగారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత రత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం మార్చటం ఎవరి తరం కాదని మాదిగ జేఏసీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ మోదుగు జోగారావు ఉద్ఘాటించారు. శనివారం మెదర్‌బస్తీలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ బీజేపీ ఈ పార్లమెంట్‌ ఎన్నికలలో 400 సీట్లు సాధిస్తే, భారత రాజ్యాంగాన్ని మార్చుతామని పగటి కలలు కంటుందన్నారు. ముందుగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదివిన తరువాత మాట్లాడాలని, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన తరువాత ఆవాకులు, చెవాకులు పేలాలని హెచ్చరించారు. సైలెంట్‌గా భారత రాజ్యాంగాన్ని మార్చుదాం అని ఆర్‌ఎస్‌ఎస్‌.అధినేత మోహన్‌ భగవత్‌ మాట్లాడటం ఆయనకు ఉన్న అర్హత ఏమిటి అని ప్రశ్నించారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ చదివినట్లు మీరు అన్ని డిగ్రీలు చదివి, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి, అప్పుడు మాట్లాడాలని మోహన్‌ భగవత్‌కు సూచించారు. బీజేపీ మణిపూర్‌లో స్త్రీలపైన జరిపిన దాడిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించు కోదాం-మన భారత ఆడ బిడ్డలను కాపాడుకుందాం..అన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలలో బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం, మైనార్టీలు, మేధావులు, భారత రాజ్యాంగ ద్వారా సర్వహక్కులు పొందిన భారత దేశ ప్రజలందరూ, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రతి ఒక్కరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి, చిత్తు, చిత్తుగా ఓడించాలని కోరారు.

Spread the love