టాప్‌లోనే సూర్యకుమార్‌

– ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (907 పాయింట్లు) టాప్‌లో నిలువగా.. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఏకంగా 43 స్థానాలను మెరుగుపర్చుకుని 25వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక టాప్‌ -10లో సూర్యకుమార్‌ మినహా మరే భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు. రెండో ర్యాంక్‌లో ఉన్న మహమ్మద్‌ రిజ్వాన్‌ (811)కు సూర్యకుమార్‌ పాయింట్ల వ్యత్యాసం భారీగానే ఉంది. విండీస్‌ పర్యటనలో అంతర్జాతీయ కెరీర్‌లో అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ(509పాయింట్లు) 46వ స్థానం, యశస్వి జైస్వాల్‌(395పాయింట్లు) 88వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక బౌలర్ల జాబితాలో టాప్‌-10లో ఏ బౌలర్‌ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో హార్దిక్‌ పాండ్యా (250 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు.

Spread the love