ఇంగ్లండ్‌ సంచలనం

– ఆసీస్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు
– ఫిఫా మహిళల ప్రపంచకప్‌

సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఝలక్‌ ఇచ్చి ఇంగ్లండ్‌ మహిళల జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 3-1 గోల్స్‌ తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తరఫున లారెన్‌ హెంప్‌, ఎల్లా టూనె, అలీసియారుసో ఒక్కో గోల్‌ కొట్టారు. ‘మేము ఫైనల్‌కు వెళ్లామంటే నమ్మసక్యం కావడం లేదు. టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచినంత సంతోషంగా ఉంది. ఈ స్టేడియం నిజంగా ఓ అద్భుతం. ఇది కష్టమైన మ్యాచ్‌. ఆటగాళ్లంతా గొప్పగా ఆడారు. దాంతో, మా గెలుపు సాధ్యమైంది’ అని ఇంగ్లండ్‌ జట్టు మేనేజర్‌ సరీనా వీగ్మన్‌ వెల్లడించారు. ఆట ఆరంభమైన 35వ ని.లో టూనే గోల్‌ కొట్టింది. దాంతో ఇంగ్లండ్‌ 1-0తో ఆధిక్యంలోకి నిలిచింది. రెండో అర్ధభాగం 71వ నిమిషంలో ఆస్ట్రేలియా ప్లేయర్‌ సామ్‌ కెర్‌ గోల్‌ చేయడంతో స్కోర్‌ 1-1తో సమం అయింది. ఆ తర్వాత లారెన్‌, అలీసియా వరుస గోల్స్‌తో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివర్లో ఆతిథ్య ఆసీస్‌ జట్టు ఎంత ప్రయత్నించినా గోల్‌ చేయలేకపోయింది. దాంతో, సొంత గడ్డపై ఫైనల్‌ చేరాలన్న ఆసీస్‌ కలలు అడియాశలయ్యాయి. ఇంగ్లండ్‌, స్పెయిన్‌ జట్లు ఆగస్టు ఆదివారం (20న) టైటిల్‌ పోరు జరగనుండగా.. 3వ స్థానం కోసం ఆస్ట్రేలియా-స్వీడన్‌ జట్ల మధ్య శనివారం పోటీ జరగనుంది.

Spread the love