ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

– ఎన్నికల ఆధికారి శశాంక
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశమైన ఎలక్షన్‌ అబ్జర్వర్లు చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక తెలిపారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని చేవేళ్లకు నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా, పోలీస్‌ అబ్జర్వర్‌ రాజీవ్‌ చావ్రాలు శనివారం సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఎఆర్‌ఓలు, పోలీస్‌ అధికారులు, నోడల్‌ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. రిటర్నింగ్‌ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పరిశీలకులతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలో ఎన్నికల నియమావళి అమలు, పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహణకు చేపట్టిన చర్యల గురించి రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక అబ్జర్వర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని వివరించారు. ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. అభ్యర్థులు, ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి అన్ని విధాలుగా పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్‌.ఎస్‌.టీ, ఎస్‌.ఎస్‌.టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయని, పట్టుబడిన నగదుకు సంబంధించి ఆధారాలు కలిగి ఉన్న వారికి గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా పరిశీలన జరిపించి నగదును తిరిగి అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఐడిఓసిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సి.విజిల్‌, 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్‌.ఎస్‌.టీ, ఎస్‌.ఎస్‌.టీ బృందాలు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజెషన్‌ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి సైతం మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తి చేశామని కలెక్టర్‌ తెలిపారు. మే 1, 2వ తేదీలలో రెండవ దఫా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులైన ఓటర్లు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, 85 ఏండ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు, వికలాంగ ఓటర్లకు ముందస్తుగానే 12-డీ ఫారాలు అందించడం జరిగిందన్నారు. ఇంటి నుండి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి ఓటును సేకరించేందుకు వీలుగా పోలింగ్‌ బందాలను నియమించామని, ఈ.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి ఇళ్లకు వెళ్లి గోప్యతను పాటిస్తూ ఓటింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ సేహ్న, వికారాబాద్‌ అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, ఉమా హారతి, ఎఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, డీసీపీలు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love