పండగపూట పస్తులే..

Pastule during the festival..– మూడు నెలలుగా అందని ఉపాధి కూలీ డబ్బులు
– రేపు మాపు అంటున్న అధికారులు
– ఆందోళన చెందుతున్న కూలీలు
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
రెక్క ఆడితే గాని డొక్కాడని ఉపాధి కూలీలకు మూడు నెలల నుంచి కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీని 18 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వలసల నివారణను అరికట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌ కార్డులు ఇచ్చి ఈ పథకం ద్వారా ఒక్క జాబ్‌ కార్డుకు 100 రోజులు పని కల్పించి ప్రతి 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు వారికి అందేలా చర్యలు తీసుకుంది. రాను రాను ఈ చట్టం నిర్వీర్యం అవుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ పేద కూలీలకు రెండు నెలలు దాటిన చేసిన పని డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పది సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రతి 15 రోజులకొకసారి కచ్చితంగా కూలీలకు డబ్బులు అందేవి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమేనని కూలీలు వాపోతున్నారు. మూడు సంవత్సరాల క్రితం నూతన హాజరు విధానం తీసుకొచ్చి, ఉదయం, మధ్యాహ్నం మొబైల్‌ యాప్‌ ద్వారా హాజరు వేస్తున్నారు. అయినా కూలీలకు వేరే బతుకుదెరువు మార్గం లేక పనిచేస్తూ ఉన్నారు. చేసిన పనికి రెండు నెలలుగా కూలీ డబ్బులు అందకపోతే పూట గడవడం ఇబ్బందిగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం కార్యాలయాల చూట్టు తిరుగుతున్న అధికారులు రేపు మాపు అంటున్నారు తప్ప డబ్బులు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తండూరు మండలంలోనే 3 నుంచి 4 మంది ఉపాధి పని చేస్తున్నారు. ఒక మండలంలోనే ఇంతమందికి డబ్బులు అందకపోతే జిల్లాలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.

మూడు నెలలుగా డబ్బులు రాలేదు
మూడు నెలల నుంచి, కూలి డబ్బులు లేక, కుటుంబ పోషణ భారంగా మారింది. ఉగాది పండుగకు, పస్తులే ఉండాల్సి వస్తుంది. నిత్యం ఉపాధి కూలీ కాకుండా వేరే ఏదైనా పని చేసుకుంటే డబ్బులైనా వచ్చేవి. ఉపాధి చట్టాన్ని రాను రాను నిర్వీర్యం చేస్తున్నారు. గతంలో 15 రోజులు ఒక్కొక్కసారి డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం నెలలు గడిచిన డబ్బులు రావడం లేదు. కార్యాలయాల చెట్టు, తిరిగిన రేపు, మాపు అంటూ కాలాన్ని వెలదీస్తున్నారు. ఉపాధి కూలీపైన ఆధారపడి జీవించే కూలీలకు కుటుంబ భారం పెరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి కూలీల డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి.
– కూలీ బాలప్ప

డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం
ఉపాధి పని కూలీ డబ్బులు అందక మూడు నెలలు గడుస్తుంది. ఉగాది పండుగ వచ్చిన పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. డబ్బులు సకాలంలో చెల్లిస్తే ఇబ్బందులు ఉండవు. గతంలో 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు అందేవి. ప్రస్తుతం నెలలు గడుస్తున్న డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు వెంటనే స్పందించి కూలీ డబ్బులు అందేలా చూడాలి.
– కూలి శ్రీనివాస్‌

Spread the love