సమస్యలను పట్టించుకోని అధికారులు

– రాకొండలో పడకేసిన పారిశుధ్యం
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని రాకొండ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని రోజులుగా తొవ్విన గుంతను నేటికీ పూడ్చటం లేదు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శులను నియమిస్తే సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చుట్టం చూపుగా ప్రత్యేకాధికారులు..
ఆయా గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక అధికారులు విఫలమవుతున్నారు. చుట్టం చూపుగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులు వచ్చి వెళ్లడంతో పని భారమంతా కారోబార్లపై పడుతుంది. అయినప్పటికీ ప్రధాన సమస్యల పరిష్కారం మాత్రం అవడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీలలో తాగునీటికి కష్టమవుతున్న ఏ అధికారి పట్టించుకోవడం లేదు. దానికి తోడు గతంలో ఉన్న బిల్లులు రాకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. కేవలం పంచాయతీలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. కొన్ని గ్రామాలకు అయితే ప్రత్యేక అధికారులు వెళ్లిన ఘటనలు లేదంటే వారి పనితీరు ఎలా ఉందో అద్దం పడుతుంది. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలను కేటాయించిన ప్రత్యేక అధికారులు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించి, స్థానికంగా నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
సమస్యలను పరిష్కరించాలి
రాకొండ గ్రామంలో అభివృద్ధి పనుల్లో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తొవ్విన గుంతను అధికారులు నేటికీ పూడ్చటం లేదు. గ్రామంలో అండర్‌ డ్రయినేజీ పనులు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అలాగే మురుగు నీరు, చెత్త చెదారం ఎక్కడి అక్కడే దర్శనమిస్తున్నాయి. రాకొండపై ఉన్నత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే అభివృద్ధిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలి.
చాపల లక్ష్మయ్య, రాకొండ గ్రామం

Spread the love