జీ7 సమ్మిట్‌కు నిరసన సెగ

– ఆందోళనల నడుమ కార్యక్రమం ప్రారంభం
– జపాన్‌లోని హిరోషిమాలో వార్షిక శిఖరాగ్ర సమావేశం
న్యూఢిల్లీ : జపాన్‌లో నిర్వహిస్తున్న జీ7 దేశాల సమావేశానికి నిరసనల సెగ తగిలింది. నిరసనల హౌరు నడుమే జీ7 నాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. హిరోషిమాలో ఈ సమావేశం మొదలైంది. శిఖరాగ్ర వేదికకు సమీపంలోని ఫునైరీ దైచి పార్క్‌లో వందలాది మంది నిరసనకారులు గుమిగూడారు. ‘జంక్‌ జీ7’, ‘జపాన్‌-యూఎస్‌ మిలటరీ కూటమి వద్దు’ వంటి రాతలతో బ్యానర్లు, ప్లకార్డులు నిరసన ప్రదేశం వద్ద కనిపించాయి. ”యూఎస్‌ సామ్రాజ్య వాదులు, నంబర్‌ వన్‌ టెర్రరిస్టు!” వంటి నినాదాలు వినిపించారు. ‘అబద్దాలు ఆపండి’, ‘యుద్ధం ఆపండి’, ‘క్వాడ్‌ కూటమిని ఆపండి’, ‘నాటో కూటమిని ఆపండి’ వంటి నినాదాలు చేశారు. ఉద్రిక్తతలను సృష్టించే ధనిక దేశాల గుంపు యూఎస్‌ నేతృత్వంలోని జీ7 సమ్మిట్‌ అని ఆందోళనాకారుడు కోడి అర్బన్‌ అన్నారు. ” మేము జీ7 అజెండాకు వ్యతిరేకంగా ఉన్నాం. ఎందుకంటే దాని అజెండా సంపన్న దేశాల కోసం. ఇది శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అజెండా కాదు” అని ఆయన తెలిపారు. ఈ నిరసనలు ఒక్క హిరోషిమాలోనే కాదు.. జపాన్‌లోని ఇతర నగరాల్లో అనేక ప్రదేశాల్లో జరిగాయి. ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించారు. సమావేశాన్ని వ్యతిరేకిస్తూ స్వదేశీ, విదేశీ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఈ ఏడాది జీ7 సమావేశానికి జపాన్‌లోని హిరోషిమా ఆతిథ్యం ఇవ్వడంపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో ఒకప్పుడు యూఎస్‌ అణు బాంబు దాడిలో నాశనమైన నగరం పేరుతో తన స్వంత రాజకీయ ప్రయోజనాలను కోరుకున్నందుకు జపాన్‌ ప్రధాని కిషిదాపై ఆ దేశ ప్రజలలో చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. జీ7 దేశాలలో యూఎస్‌, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, జపాన్‌లు ఉన్నాయి. భారత్‌తో పాటు దక్షిణ కొరియా, బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియా, కొమొరోస్‌, కుక్‌ దీవులు, కొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి నాయకులు శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించబడ్డారు.

Spread the love