లండన్ : ప్రభుత్వ రంగ వేతనాల పెంపుపై ఇంగ్లండ్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో టీచర్లు సమ్మెకు దిగనున్నారు. సెప్టెంబరులో సమ్మె ప్రారంభించనున్నట్లు ఉపాధ్యాయుల సంఘం ఎన్‌ఎఎస్‌యుడబ్ల్యూటి వెల్లడించింది. తమ సభ్యుల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది సమ్మెకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలిపింది. సమ్మె విషయంపై మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ఎన్‌ఇయు, ఎన్‌ఎహెచ్‌టి కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నాయి. వేతన పెంపు నిర్ణయం ఆలస్యంపై ఇప్పటికే ఉపాధ్యాయులు తమ ఆందోళనలను ప్రారంభించారు. ఈ నెల 5న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మీదుగా పార్లమెంట్ స్క్వేర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ‘ఏ ఉపాధ్యాయుడు కూడా తన ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగించే పరిస్థితుల్లో పని చేయాలని ఆశించకూడదు’ అని ఎన్‌ఎఎస్‌యుడబ్ల్యూటి పేర్కొంది. లక్షలాది మంది ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు స్వతంత్ర వేతన సమీక్షా సంస్థల సిఫార్సులను ఆమోదించాలా.. లేక సూచనలను తిరస్కరించాలా.. అనే అంశంపై ఇంగ్లండ్‌లోని రిషి సునాక్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2023-24 ఏడాదికి ఉపాధ్యాయులు 6.5 శాతం వేతన పెంపును పొందాలని, పోలీసు అధికారులు, జైలు అధికారులు, జూనియర్ డాక్టర్లు 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వేతన పెంపును పొందాలని స్వతంత్ర వేతన సమీక్షా సంస్థలు సిఫార్సు చేశాయి. ్ల