గ్వాంటనామో వద్ద అమెరికా అణుజలాంతర్గామి

– ఖండించిన క్యూబా
పనామా : గ్వాంటనామో బే నౌకా స్థావరం వద్ద కొన్ని రోజుల పాటు అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి తిష్టవేయడాన్ని క్యూబా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా యొక్క రెచ్చగొట్టే చర్యగా విమర్శించింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకూ అమెరికా జలాంతర్గామని నౌకా స్థావరంలో ఉందని క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నౌకాస్థావరంలోకి జలాంతర్గామి ప్రవేశాన్ని క్యూబా ప్రభుత్వం తిరస్కరిస్తుందని, ఇది అమెరికా రెచ్చగొట్టే చర్య అని, ఈ చర్య యొక్క రాజకీయ, వ్యూహాత్మక ఉద్దేశ్యాలు ఇంకా వెల్లడికాలేదని ప్రకటనలో పేర్కొంది. క్యూబా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 121 ఏళ్లుగా గ్యాంటనామో బే అమెరికా నౌకా స్థావరం తమ దేశ భూభాగాన్ని ఆక్రమించిందని ఈ ప్రకటన తెలిపింది. ప్రస్తుత సమయంలో ఈ శాంతియుత ప్రాంతంలో నౌకా స్థావరం వద్ద అణు జలాంతర్గామి ఉండటానికి సైనిక కారణం ఏమిటి?, ఏ లక్ష్యంతో అక్కడ ఉంది?, ఏ వ్యూహాత్మక ప్రయోజనంతో ఉంచారు?.. అని ప్రకటన ప్రశ్నించింది. క్యూబాలో అమెరికా సైనిక ఉనికిని ఖండిస్తున్నామని, గ్వాంటనామోలో చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన స్పష్టం చేసింది.

Spread the love