కేరళలో పెట్టుబడులకు సహకరించండి

– యూఎస్‌లో భారత రాయబారితో విజయన్‌ భేటీ
న్యూయార్క్‌ : కేరళలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా సహకరించాలని అమెరికాలోని భారత రాయబారి తరన్‌ జిత్‌ సింగ్‌ సంధును ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తరన్‌ జిత్‌తో విజయన్‌ భేటీ అయ్యారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులకు అవకాశముందని ఈ సందర్భంగా తరన్‌ జిత్‌ పేర్కొన్నారు. అలాగే ఫార్మా స్యూటికల్స్‌, టీకాల రంగంలోనూ అవకాశాలున్నాయని, ఈ దిశగా తాము సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఆరోగ్య కార్యకర్తలను అమెరికాకు పంపడం, నర్సింగ్‌ విద్యను విస్తరింపజేయడం, ఈ దిశగా అమెరికా వైద్య విద్య సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైనా ఇరువురు చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పర్యాటక రంగం, మెడికల్‌ టూరిజం, అయుర్వేదం వంటి రంగాల్లోనూ ద్వైపాక్షిక సహకారానికి ఉన్న అవకాశాలపై సమాలోచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ ఆర్థిక మంత్రి కె బాలగోపాలన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ విపి జారు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love