న్యూఢిల్లీ : తాము నిర్వహించే పరిశోధనలకు కేంద్ర సంస్థల నుండి సకాలంలో నిధులు అందకపోవడంతో దేశంలోని సీనియర్ పరిశోధకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశోధనలకు సంబంధించి ఏప్రిల్‌లోనే నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే అధికారుల అలసత్వం కారణంగా నేటి వరకూ అవి అందలేదు. దీంతో ప్రాజెక్టులలో పనిచేస్తున్న సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తానని కేంద్ర ప్రభుత్వం గతంలో గొప్పలు చెప్పింది. అయితే నిధులను ఐఐటీలు, ఐఐఎస్‌లకు బదిలీ చేసేందుకు కేంద్రం ప్రయత్నించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ‘చివరిసారిగా నాకు 2022 మార్చిలో గ్రాంట్లు అందాయి. దేశంలోని అన్ని ప్రాజెక్టుల అకౌంట్లు ఆమోదం పొందే దాకా పరిశోధకులకు వార్షిక గ్రాంట్లు ఇవ్వబోమని ఇప్పుడు చెబుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (డీఎస్‌టీ), బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ)లో పనిచేస్తున్న ప్రతి పరిశోధకుడిదీ ఇదే సమస్య. నా జేబులో డబ్బు తీసి సిబ్బందికి జీతాలు ఇస్తున్నాను’ అని బీహెచ్‌యూ సీనియర్ పరిశోధకుడు లఖోటియా వాపోయారు. సివిల్, రిసెర్చ్ ప్రాజెక్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆర్థిక శాఖ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. డీబీటీ నుండి ఎవరికీ నిధులు రావడం లేదని, ఇదేమని అడిగితే తమ చేతిలో ఏమీ లేదని అంటున్నారని ఐఐటీ పరిశోధకుడొకరు తెలిపారు. పరిశోధకులు మార్చి నెల వరకూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ పనులు కొనసాగించేందుకు అవసరమైన నిధులు ఖాతాలలో జమ కావడం లేదు.