370 ఆర్టికల్‌ రద్దు చేసినప్పుడు ..కేజ్రీవాల్‌ ఎక్కడున్నారు?

ఒమర్‌ అబ్దుల్లా
శ్రీనగర్‌ : 370 ఆర్టికల్‌ రద్దు చేసినప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కడున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులు, జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘370 ఆర్టికల్‌ రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్‌ ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కేంద్రానికి మద్దతిచ్చారు. ఈరోజు ఆయన ఇతర పార్టీలను మద్దతు ఇమ్మని అడుగుతున్నారు” అని రాజౌరిలో మీడియాతో మాట్లాడుతూ ఒమర్‌ అబ్దుల్లా ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా ఈ ప్రశ్న వేశారు. ఢిల్లీలో గ్రూప్‌-ఎ అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారం తమకు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం మే 19న ఒక ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.
ఢిల్లీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని కట్టబెడుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన వారం రోజుల్లోనే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం చర్యను తప్పుబట్టిన కేజ్రీవాల్‌ ఇందుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ బిల్లు కాకుండా పార్లమెంటులో అడ్డుకోవాలని కోరుతూ ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌, ఎంకే స్టాలిన్‌, సీతారాం ఏచూరి, కెసిఆర్‌, నితీష్‌ కుమార్‌లను కేజ్రీవాల్‌ కలుసుకున్నారు.

Spread the love