– రాష్ట్రవ్యాప్తంగా హడలెత్తిస్తున్న వడగాడ్పులు
– 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
– మొండి కేస్తున్న ఏసీలు.. కూలర్లు
– నిర్మానుష్యంగా రోడ్లు.. జంకుతున్న జనం..!
రోజురోజుకూ వేసవి భానుడి ప్రతాపం తీవ్ర స్థాయికి చేరింది. ప్రతి సంవత్సరం లాగానే వేసవి కాలం ఎండలు భగభగ లాడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం కాస్త ముదిరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభం నుండి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. మూడు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు.. ఇతర ప్రాంతాల నుంచి వీస్తున్న వేడి గాలుల వల్ల కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత్తలకు పైగా నమోదవుతున్నాయి. వడదెబ్బకు పలువురు మృతిచెందుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యతాపం చూపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు వేడి వాతావరణం ఏమాత్రం తగ్గడంలేదు.
నవతెలంగాణ-కొత్తగూడెం
వేసవి కాలం వచ్చిందంటే కొత్తగూడెం పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సింగరేణి కోల్ మైనింగ్ ప్రాంతం కావడంతో మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వేసవి వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కారణంగా అడవులు నరికి వేయడం వల్ల, ఉపరితలం నుంచి బొగ్గు నిక్షేపాలు వెలికి తీసే ప్రక్రియ మొదలు కావడంతో వేడి వాతావరణం రికార్డు నమోదు అవుతుంది.
ఈ ఏడాది కూడా ఇప్పటికే 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోల్ మైనింగ్ కారణంగా అడవులు నరికివేశారు. అదే స్థాయిలో స్థానికంగా మొక్కల పెంపకం జరగని కారణంగా ఓపెన్ కాస్ట్ నుంచి వేడిగాలులు నేరుగా వీస్తున్న క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు వేసవి కాలం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ తరుణంలో కొత్తగూడెంలో 48 డిగ్రీల స్థాయికి వేడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. కొత్తగూడెం పట్టణంలో 45.4, పాల్వంచలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మొండి కేస్తున్న ఏసీలు, కూలర్లు
ఎండ తీవ్రతను తట్టుకోలేక, బయటకు రాలేక ఇండ్లకే పరిమితమవుతున్న ప్రజలకు అత్యధిక ఉష్ణోగ్రతలు వెంటాడుతున్నాయి. ఇండ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మెండికేస్తున్నాయి. తక్కువ స్పీడ్‌లోనే చల్లని గాలులు వీచే బ్రాండెడ్ కంపెనీ విద్యుత్ పరికరాలు కూడా ఎండ తీవ్రతకు మూలుగుతున్నాయి. దాంతో ఇంట్లో ఉన్న వారికి కూడా వేసవి భానుడి తాపానికి గురికాక తప్పడం లేదు. చంటి బిడ్డలు, వయో వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేక పోతున్నారు. కొన్ని పట్టణాల్లో సెల్ టవర్స్‌లో మంటలు చెలరేగుతున్నాయి.
నిర్మానుషంగా రోడ్లు.. జంకుతున్న జనం..!
ఎండ భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దినసరి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయట పనులు ముగించుకొని ఇండ్లకే పరిమితం అవుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపార సముదాయాల షాపులు మూసివేసి సాయంత్రం తిరిగి ప్రారంభిస్తున్న తీరు కనిపిస్తుంది. కొబ్బరి బొండాలు, తాటి ముంజలు, జ్యూస్, ఇతర శీతలపానీయాల జోరు తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో మాత్రమే షాపింగ్ చేయడానికి సిద్దం అవుతున్నారు.
వడదెబ్బకు నలుగురు మృతి
– ముగ్గురు కూలీలు, ఒక మత్స్యకారుడు..
పెరుగుతున్న ఎండలకు తట్టుకోలేక ఇద్దరు రైతు కూలీలు, మత్స్యకారుడు మృతి చెందిన ఘటనలు మహబూబాబాద్ జిల్లా, మెదక్ జిల్లాల్లో బుధవారం జరిగాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ సీతారాం(55) మామిడి తోటలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఎండల తీవ్రత, వడగాలులకు తట్టుకోలేక వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఇతనికి ఒక్క కొడుకు ఉండగా, బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మృతునికి 20 గుంటలు భూమి ఉన్నా దానికి పట్టా లేక పోవడం వల్ల రైతు బీమా, రైతు బంధు రావడం లేదు. పింఛన్‌నూ రాని పరిస్థితి. దాంతో సీతారాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండా వాసులు కోరుతున్నారు.
బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ చింతోని గుంపు గ్రామానికి చెందిన జోగా ఉపేంద్ర(38) వారం రోజులుగా తునికాకు సేకరణకు వెళ్లిన క్రమంలో ఎండ దెబ్బకు గురైంది. దాంతో మహబూబాబాద్‌లోని ప్రయివేటు హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా.. వరంగల్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందారు.
తొర్రూర్ మండలం గుర్తూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తుడు పెసర రాజు (30) గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన క్రమంలో వడదెబ్బ తగలడంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన తొర్రూరులోని ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు, తల్లి యాకమ్మ ఉన్నారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి బాలమణి (46) ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పని చేస్తూనే నీరసంగా అనిపించినా.. పనిచేసి ఇంటికి తిరిగి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే బాలమణిని చికిత్స కోసం నార్సింగి పట్టణ కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.