ఎర్రటెండలు.. వడగాల్పులు

– ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలు
– దామరచర్ల, వీణవంకలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
– ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌
ఓవైపు ఎర్రటెండలు..మరోవైపు వడగాల్పులు..ఇంకోవైపు తీవ్ర ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టి మధ్యాహ్నానానికల్లా తీవ్రస్థాయిలో చూపెడుతున్నాడు. ఇండ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకున్నా వేడిగాడ్పు తప్ప ఉపశమనం దక్కట్లేదు. ఇండ్లల్లోని బండలూ హీటెక్కిపోతున్నాయి. చెప్పుల్లేకుండా పట్టుమని పది అడుగులు వేస్తే కాళ్లకు బొగ్గలొస్తున్న పరిస్థితి ఉంది. కోల్‌బెల్ట్‌(సింగరేణి విస్తరించిన ప్రాంతం), నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోనూ వరుసగా ఎనిమిదో రోజూ 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఎండవేడిమి, వడగాల్పులతో అంతకంటే ఎక్కువే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న భావన కలుగుతున్నది. ఎన్ని నీళ్లు తాగినా దూప తీరడం లేదు. నల్లగొండ జిల్లా దామరచర్లలో, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో అత్యధికంగా 45.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగైదు రోజులు కూడా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గణనాయక భవన్‌ ప్రాంతంలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అయితే, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
దామరచర్ల(నల్లగొండ)                                              45.4 డిగ్రీలు
వీణవంక(కరీంనగర్‌)                                                45.4 డిగ్రీలు
కడెం ప్రాజెక్టు (నిర్మల్‌)                                              45.1 డిగ్రీలు
జన్నారం(మంచిర్యాల్‌)                                              44.9 డిగ్రీలు
రాయినిగూడెం(సూర్యాపేట)                                        44.8 డిగ్రీలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో
ఖైరతాబాద్‌                                                           42.5 డిగ్రీలు
కాప్రా                                                                  41.3 డిగ్రీలు
ఉప్పల్‌                                                                 41.2 డిగ్రీలు
చార్మినార్‌, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్‌                             41.1 డిగ్రీలు
ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఆగేయ బంగాళాఖాతం, నికోబార్‌ ఐలాండ్స్‌, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఐఎమ్‌డీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. తెలంగాణ మీదుగా దిగువ స్థాయిలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.

Spread the love