సంబల్‌పూర్‌లో పథకం ప్రకారమే హింసాకాండ

– 79 మంది అరెస్టు : ఎస్పీ
– బాధ్యులపై కఠిన చర్యలు : డీజీపీ
– కొనసాగుతున్న కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ నిషేధం
భువనేశ్వర్‌ : ఒడిశాలోని ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక నగరమైన సంబల్‌పూర్‌లో పథకం ప్రకారమే హనుమాన్‌ జయంతి సందర్భంగా మతతత్వ మూకలు హింసాకాండకు పాల్పడ్డాయని సంబల్‌పూర్‌ ఎస్పీ బి.గంగాధర్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ముందస్తు పథకం ప్రకారమే హింసాకాండకు పాల్పడ్డారని తెలిపారు. ఇందుకు కారకులైన వారిని మరింతమందిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ నెల 12న బైక్‌ ర్యాలీ సందర్భంగా రాళ్ల దాడి, 14న ఊరేగింపు సందర్భంగా హింస, వాహన, దుకాణాలు, ఇండ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరిగాయన్నారు. తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకోవడానికి సోమవారం ఉదయం 10 గంటల వరకూ ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 79 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిలో 26 మంది ఈ నెల 12న రాళ్ల దాడికి పాల్పడిన వారని, మరో 53 మంది ఈ నెల 14న గృహ, దుకాణ, వాహన దహనాలకు, అల్లర్లకు పాల్పడినవారని చెప్పారు. ఈ అల్లర్లలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అల్లర్లతో అతనికి సంబంధం లేదని ఎస్పీ చెప్పారు.
ఒకటి రెండు రోజుల్లో సాధారణ వాతావరణం : డీజీపీ
హింసాకాండలో పాల్గొన్న, భాగస్వాములైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా డీజీపీ సునీల్‌ కె బన్సాల్‌ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ సందర్భంగా ఆయన పట్టణంలో పర్యటించారు. పోలీసులకు, ఇతర పాలనా అధికారులకు సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో శనివారం నుంచి అధికారులు కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ నిషేధం విధించారు. నగరంలోని ప్రతి వీధిలోనూ పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. సాధారణ అవసరాల కోసం ఆదివారం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలించారు.
12 నుంచే అల్లర్లు
సంబల్‌పూర్‌లో హనుమాన్‌ జయంతికి ముందు నుంచే అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12న హనుమాన్‌ జయంతి సమన్వయ సమితి నేతృత్వంలో జరిగిన బైక్‌ ర్యాలీ సందర్భంగానూ ఘర్షణలు జరిగాయి. పట్టణంలో అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. వివిధ వర్గాలతో చర్చల అనంతరం హనుమాన్‌ జయంతి నిర్వహించుకోవడానికి ప్రజలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. మళ్లీ తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి.
రాజకీయ లబ్ది కోసం బీజేపీ యత్నం : బీజేడీ
సున్నితమైన పరిస్థితి నుంచి రాజకీయ లబ్ది కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని బీజేడీ ఎమ్మెల్యే రాజ్‌కిషోర్‌ విమర్శించారు. బీజేపీకి ప్రతిదానిని మతతత్వ కోణంలో చూడటం అలవాటని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వం చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుందని బీజేడీ నాయకుడు, ఎమ్మెల్యే అమర్‌ సత్పతి చెప్పారు.

Spread the love