ఆరోగ్యంపై అధిక వ్యయం ఇంటి ఖర్చులో పది శాతం అటే

– 9 కోట్ల మందికి పైగా భారతీయుల పరిస్థితి
– వైద్య చికిత్సలు, సేవలు ప్రియం
– పరోక్షంగా ప్రజల ఆర్థికస్థితిపై భారం
న్యూఢిల్లీ : దేశ ప్రజలకు అందాల్సిన కనీస అవసరాల్లో వైద్యం ఒకటి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవ్‌ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే, వైద్యం ఇప్పటికీ దేశ ప్రజలకు అందని ద్రాక్షగానే ఉన్నది. ప్రధాని మోడీ పాలనలో వైద్య చికిత్సలు, సేవలు ప్రియం అయ్యాయి. వైద్య ఖర్చులను నియంత్రించడానికి బీజేపీలోని మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో విఫలమైంది. దీంతో దేశ ప్రజలు ఆరోగ్యసంరక్షణ కోసం అధికంగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ప్రముఖ వార్త సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లోని 9 కోట్ల మందికి పైగా ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అధికంగా వెచ్చిస్తు న్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, సేవలు ప్రజలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దేశంలోని అనేక కుటుంబాలు ఈ వైద్య ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నాయి. వారి ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లో గణనీయమైన సంఖ్యలో ప్రజలు తాము వెచ్చించే మొత్తంలో పది శాతానికి మించి ఆరోగ్య సంరక్షణ పైనే ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఇంటి ఖర్చులో 25 శాతానికి పైగా ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నవారు 3.1 కోట్ల మందికి పైగా ఉన్నారు. 2017-18 నుంచి 2022-23 మధ్య తమ ఆదాయంలో ఆరోగ్యసంరక్షణపై ఖర్చు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది.
ఆరోగ్యం పైనే అధికంగా ఖర్చు చేయటం దేశంలోని అనేక ఇండ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఆర్థికంగా వారిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది. మోడీ పాలనలో ఏటికేడు ఆరోగ్యసంరక్షణ భరించని స్థాయిలోకి వెళ్లిపోతు న్నది. ప్రజల సంపాదనంతా ఆరోగ్యం, సంబంధిత అత్యవస రాలకే వెళ్లిపోతున్నదని విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణపై ప్రజలు చేస్తున్న ఖర్చులో గణనీయమైన పెరుగుదల మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా, తెలంగాణలో నమోదైంది. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యాన్ని మరిచి ప్రయివేటీకరణపై దృష్టి పెడుతున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు దేశంలోని ప్రజల ను కష్టాల్లోకి నెడుతున్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.

Spread the love