హరీశ్ రావు బీఆర్ఎస్‌లో ఏక్‌నాథ్ షిండే కావడం ఖాయం: సీతక్క

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడితే దిగిపో… రాజీనామా అని మాట్లాడుతున్నారని… బీఆర్ఎస్ పార్టీలో ఆయన మరో ఏక్ నాథ్ షిండే కావడం ఖాయమని మంత్రి సీతక్క విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… హరీశ్ రావుకు పదవీ కాంక్ష అంటే ఏమిటో తెలిసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి లక్ష కోట్ల రూపాయలను నీళ్లలో పోసింది సరిపోలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే గ్యారెంటీ… గ్యారెంటీ అంటేనే కాంగ్రెస్ అన్నారు. రుణమాఫీకి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ప్రజల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయ అంశాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. దేవుడి సెంటిమెంట్ వల్ల నాలుగు ఓట్లు పడతాయని చూస్తారన్నారు. కానీ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మరీ అయోధ్యలో రామాలయం నిర్మించారన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తాడని విమర్శించారు. మిగతా సమయాల్లో బయటకు రాడన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి పట్టించుకోరని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ బయటకొచ్చి చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

Spread the love