పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహింలేం : మంత్రి సీతక్క

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి దర్శించుకున్నారు. ఉదయం ఆలయ అతిథి గృహానికి చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కలు బహూకరించి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన తెలంగాణలోని రాజన్న ఆలయం, సమ్మక్క – సారక్క జాతర, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదని ఆమె తెలిపారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలో అనేది ఇవాళ, రేపు నిర్ణయిస్తామన్నారు.

Spread the love