నాంపల్లి నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లను తొలగించాలి

–  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలోని బోగస్‌ ఓట్లను తొలగించాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిరోజ్‌ఖాన్‌, జి. నిరంజన్‌, మెట్టుసాయికుమార్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిరోజ్‌ఖాన్‌ మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు బోగస్‌గా ఉన్నాయన్నారు.
ఇండ్లు లేకపోయినా ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఇండ్లు ఉన్న చోట దొంగ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 10 వేల ఓట్లు మరణించిన వారివి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఓట్లను తొలగించలేదని విమర్శించారు. నాంపల్లి నియోజక వర్గంలో బోగస్‌ ఓట్లపై 20 రోజుల్లోగా విచారణ జరిపిస్తామని వికాస్‌ రాజ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌లో దాదాపు 6 నుంచి 7 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయనీ, అవి లేకపోతే ఎంఐఎం నాయకులు అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ గెలిచే అవకాశం లేదని చెప్పారు.

Spread the love