పదేండ్లలో వైద్య రంగానికి రూ.73 వేల కోట్లు

– మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కేటాయించామని గుర్తుచేశారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వైద్యారోగ్య శాఖపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఐదేండ్లలో రెండుసార్లు కరోనా రావడంతో అనుకున్న ప్రణాళికలు అతలాకుతలమయ్యా యని తెలిపారు. విద్యా, వైద్యంపై ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. 2013-14లో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు రూ.2,706 కోట్లు మాత్రమే బడ్జెట్‌ కేటాయించిందని వెల్లడించారు. అయితే తాము ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12,364 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నామని వెల్లడించారు. గతంలో మాదిరిగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తీవ్రంగా లేవని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడిందన్నారు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల పేరుతో ప్రాథమిక దశ నుంచి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
సెకెండ్‌ ఏఎన్‌ఎంలకు జీతాలు పెంచే ప్రయత్నం
రాష్ట్రంలో సెకెండ్‌ ఏఎన్‌ఎంలకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రెండో ఏఎన్‌ఎంల జీతాలు 2014 ముందు రూ.8,800 ఉంటే ప్రస్తుతం వారికి రూ.27,300 వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. రెండో ఏఎన్‌ఎంలకు గుజరాత్‌లో రూ.17 వేలు, మహారాష్ట్రలో రూ.16 వేలు, కర్ణాటకలో రూ.12 వేలు ఇస్తున్న మంత్రి తెలిపారు.

Spread the love