బీసీ కులవృత్తుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– 9న సీఎం చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ : మంత్రులు గంగుల, హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీసీ కుల వృత్తుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న సంక్షేమ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కులవృత్తులలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందించి వారిని ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ లేకుండా లక్ష రూపాయల గ్రాంటును అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మంచిర్యాలలో లబ్దిదారులకు చెక్కులను అందిస్తారని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిరుపేద చేతివృత్తిదారులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా కలెక్టర్లు అత్యంత శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చొంగ్తు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Spread the love