తక్షణం ఇంటర్మీడియట్‌ గోడౌన్లలో ధాన్యం దించాలి : గంగుల కమలాకర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైస్‌ మిల్లుల వద్ద స్థలం లేకున్నా, మిల్లులు సహకరించకున్నా తక్షణం ఇంటర్మీడియట్‌ గోడౌన్లలో ధాన్యం దించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ లోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం నుంచి ధాన్యం సేకరణపై కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ రాజకీయాలు పట్టించుకోకుండా రైతులు రోడ్లపైకి రాకుండా వారికి అండగా ఉండాలని సూచించారు. తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. రవాణా సమస్య రాకుండా ట్రాక్టర్లను కూడా ఉపయోగించుకోవాలని కోరారు. పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ గోదాముల్లో దించే ధాన్యంతో మిల్లర్లకు ఎటువంటి సంబంధం ఉండకూడదని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం బాధ్యతతో వెంటనే రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ తో పాటు సివిల్‌ సప్లైస్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌, కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love