పెన్షన్‌ 10 వేల పెంపు కోసం దశల వారీ ఉద్యమం

– వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి
– వికలాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
– 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు రాయితీ బస్సు పాసులివ్వాలి
– ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగుల పెన్షన్‌ 10 వేలకు పెంపు కోసం దశల వారీగా ఉద్యమం చేస్తామనీ, వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌ అడివయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సభ్యులు జెర్కొని రాజు అధ్యక్షతన రాష్ట్ర అఫీస్‌ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 43.02 లక్షల మంది వికలాంగులు ఒక్కటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. జనాభాలో 12.02 శాతం వికలాంగులు ఉన్నారని చెప్పారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా సంక్షేమ పథకాల్లో 12 శాతం వారికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలుకు వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. వారి కుటుంబాలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనీ, వైకల్య ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి బస్సులు, రైల్వేల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ డిమాండ్‌ చేశారు. మానసిక వికలాంగులు, మూగ చెవిటి వికలాంగుల మహిళలపై లైంగిక వేదింపులు, లైంగికదాడులు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు రాయితీ బస్సు పాసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు మూగ, చెవిటి, మానసిక వికలాంగులు, అంధులకు 40 శాతం వైకల్యం ఉంటే బస్సు పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాక్‌ పోస్టుల భర్తీ చేయాలనీ డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగులకు స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికి ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ’40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు యుడీఐడీ కార్డులు వెంటనే పంపిణీ చేయాలి. ఆసరా పెన్షన్ల మంజూరుకు ఆదాయ పరిమితి నిబంధన ఎత్తి వేయాలి. జివో 17ను వెంటనే రద్దు చేయాలి. ప్రతి గ్రామంలో డీఆర్‌ డీఏ ద్వారా వికలాంగులకు ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు సామూహిక ప్రాంతాలన్నీ అవరోధరహితంగా మార్చాలి. వైకల్యం తీవ్రతను బట్టి బ్యాటరీ వీల్‌ చైర్స్‌, మోటరైజెడ్‌ వెహికల్స్‌ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి జాబ్‌ కార్డ్‌ ఇచ్చి పని కల్పించాలి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్‌ కార్డు మంజూరు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వారికి ఐదు శాతం కేటాయించాలి. వినికిడి పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేసి. అవసరమైన పరికరాలు ఇవ్వాలి’ అని అడివయ్య డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి మధు బాబు, అరిఫ, రాష్ట్ర సహాయ కార్యదర్శలు పి. బలిశ్వర్‌, వి.ఉపేందర్‌, నాయకులు శశికళ, లింగయ్య, భుజంగ రెడ్డి, ప్రభు స్వామి, మోగులయ్య, బుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love