– బాధితుల ఆవేదన
– మల్లన్నసాగర్ నిర్వాసితులకు అందని సాయం
– లోకల్, నాన్ లోకలంటున్న అధికారులు
– ఓపిక నశించి రోడ్డెక్కిన ముంపు బాధితులు
– సీఎం తమ గోస వినాలని డిమాండ్
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్
పైసలు రాలే.. ప్యాకేజీ ఇయ్యలే.. ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు సరిగా లేవు. అందునా లోకల్.. నాన్ లోకల్ అంటూ అధికారులు వివక్ష చూపుతున్నా రంటూ మల్లన్నసాగర్ ముంపు బాధితులు రోడ్డుపై బైటాయించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిలో వర్గల్ మండలం సింగయపల్లి చౌరస్తా వద్ద బాధితులు పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎర్రవల్లి, సింగారం, పల్లెపహాడ్, వేముల గట్టు, తుర్క బంజారాపల్లి, కిష్టపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, వడ్డెర కాలనీ, తిరుమలగిరి, బ్రాహ్మణ బంజరపల్లి గ్రామాల బాధితులు పాల్గొన్నారు. తమకు రావాల్సిన ప్యాకేజీ, డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగేండ్లుగా నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసుగొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్ రామ్‌రెడ్డి కోరారని, ఆదుకుంటామని హామీలు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు వారి హామీలు ఆగమై, అప్పటి అధికారులు ట్రాన్స్‌ఫర్ అయ్యారని తెలిపారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓపిక నశించి రోడ్డెక్కామన్నారు. నాలుగేండ్ల కిందట ఉన్న ఊరు ఖాళీ చేశామని, ఇల్లు, డబ్బులు ఇస్తామని, ప్లాట్లతోపాటు ప్యాకేజీ ఇస్తామని ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో లోకల్, నాన్ లోకలంటూ ప్యాకేజీ తప్పించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
”యువతకు ఇచ్చే ప్యాకేజీలో 18ఏండ్లకు 10 రోజులు తక్కువున్నా బంద్ అంటున్నారు. ఒంటరి మహిళల ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూమి, స్థలాలు సర్వం కోల్పోయాం. ఇక్కడ భూములకు భూములు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో తాత్కాలిక ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నాం. హైదరాబాద్, నిజామాబాద్‌లో ఉన్నారంటూ ఇండ్లు, స్థలాలు కేటాయించడం లేదు. ఇక్కడ బతుకుదెరువులేకే బయటకు వెళ్లి బతుకుతున్నాం. ముంపునకు గురైన వాళ్లే బయట బతుకుతున్నారు. ఇటీవల గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు కేటాయించారు. మాకు సాయం అందక ముందే.. మేము ఉంటున్న ఇండ్లు వారికి ఇస్తామని ఖాళీ చేయాలంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదు’ అని స్పష్టం చేశారు. సుమారు 3 గంటలు రాస్తారోకో నిర్వహించారు. సింగాయపల్లి చౌరస్తా నుంచి ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ మడత రమేష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు ససేమీరా ఒప్పుకోకపోవడంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏసీపీ మాటకు కట్టుబడి ముంపు బాధితులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల సర్పంచులు దమంచ ప్రతాపరెడ్డి, సిద్దిపేట బాలయ్య, కొలిచల్మస్వామి, గోగ్లోత్ చిన్న రజిని గోవింద్, మద్దూరి రాములు పాల్గొన్నారు. అనంతరం ప్రజ్ఞాపూర్ ఏసీపీ ఆఫీసులో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిను కలిశారు. అడిషనల్ కలెక్టర్ బాధితులతో మాట్లాడి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీ సమస్యలపై నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు. దాంతో ముంపు బాధితులు శాంతించి వెనుదిరిగారు. త్వరగా సమస్యను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.