ఎన్సీఆర్టీ కమిటీలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యునికి చోటు

– పాఠ్యపుస్తకాల ప్రణాళిక ఖరారుకు నూతన కమిటీ
న్యూఢిల్లీ : 3-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు, పాఠ్య ప్రణాళికలను ఖరారు చేసేందుకు ఎన్సీఈఆర్టీ 19 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్కృత భారతి వ్యవస్థాపక సభ్యుడు చాము కృష్ణశాస్త్రిని కూడా ఈ కమిటీలో సభ్యుడిగా నియమించడం గమనార్హం. ఈ కమిటీలో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌ సుధామూర్తి, గాయకుడు శంకర్‌ మహదేవన్‌, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌ వివేక్‌ దేవ్‌రారు, ఆర్థికవేత్త సంజీవ్‌ సన్యాల్‌, గణిత శాస్త్రవేత్త మంజుల్‌ భార్గవ తదితరులు సభ్యులుగా ఉంటారు. దీనికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఈపీఏ) ఛాన్సలర్‌ ఎన్‌సీ పంత్‌ నేతృత్వం వహిస్తారు. పాఠ్య ప్రణాళికను పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్సీఎఫ్‌-ఎస్సీ)తో అనుసంధానం చేసే విషయంపై ఈ కమిటీ కసరత్తు చేస్తుంది. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా కె.కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని స్టీరింగ్‌ కమిటీ ఎన్సీఎఫ్‌-ఎస్సీని అభివృద్ధి చేసింది. తుది ఫ్రేమ్‌వర్క్‌ను ఇప్పటికే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు సమర్పించారు. అయితే దానిని ఇప్పటి వరకూ ప్రజలకు బహిర్గతం చేయలేదు. కాగా పాఠశాల సిలబస్‌, టీచింగ్‌-లెర్నింగ్‌ మెటీరియల్‌ను రూపొందించేందుకు ఈ కమిటీకి అధికారాలు కల్పించారు. 1, 2 తరగతుల పాఠ్య పుస్తకాలను సవరించే విషయంపై కూడా ఈ కమిటీ కృషి చేస్తుంది.

Spread the love