24గంటల్లో 18మంది మృతి…

– థానే సర్కారు దవాఖానాలో మరణమృదంగం
– బాధిత కుటుంబీకుల ఆందోళన..భారీగా పోలీసుల మొహరింపు
ధానే: మహారాష్ట్రలోని ధానేలో సర్కారు దవాఖానాలో మరణమృదంగం మోగింది. ఒక్కరోజే భారీ సంఖ్యలో రోగులు మృతిచెందిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కల్వాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో 24గంటల వ్యవధిలో 18మంది చనిపోయారని పురపాలక శాఖ కమిషనర్‌ అభిజిత్‌ బంగార్‌ వెల్లడించారు. వీరిలో 10 మంది మహిళలు ఉండగా.. ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలిపారు. చనిపోయిన వారిలో ధానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. ముంబయిలోని కల్యాణ్‌కు చెందినవారు నలుగురు, షాపూర్‌ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్‌నగర్‌, గోవండి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. వీరిలో 12మంది 50 ఏండ్లకు పైబడినవారు ఉన్నట్టు వెల్లడించారు.
పరిస్థితిపై సీఎం ఆరా.. దర్యాప్తునకు కమిటీ!
ధానే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళనలతో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులపై సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆరా తీశారని అభిజిత్‌ బంగార్‌ తెలిపారు. అలాగే, దీనిపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ఆదేశించినట్టు చెప్పారు. చనిపోయిన రోగుల కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, న్యుమోనియా తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారన్నారు. ఆస్పత్రిలో వీరికి అందిన చికిత్సపై దర్యాప్తు జరుపుతామని, మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డు చేస్తామన్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి పాల్పడినట్టు కొందరు ఆరోపించడం తీవ్రమైన విషయమని.. దీనిపైనా కమిటీ విచారిస్తుందన్నారు. 24గంటల వ్యవధిలో 19మంది రోగులు మరణించిన ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సావంత్‌ ఆస్పత్రి డీన్‌ను ఆదేశించారు.
ఈ ఘటనపై ధానే పురపాలక శాఖ అధికారులు సైతం స్పందించారు. ఈ మరణాలను విశ్లేషిస్తున్నామని, రికార్డులను తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మరణాలపై ధానే డీసీపీ గనేశ్‌ గావ్డే మాట్లాడుతూ.. సాధారణంగా అయితే రోజూ ఆరుగురు లేదా ఏడుగురు మృతిచెందినట్టు తమకు సమాచారం వస్తుంటుందని.. కానీ ఈసారి 24గంటల్లో భారీ సంఖ్య రోగులు మృతిచెందినట్టు ఆస్పత్రి అధికారులు చెప్పారన్నారు. పెద్ద సంఖ్యలో మరణాల నేపథ్యంలో ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఆస్పత్రి డీన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ ఆస్పత్రి రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన శాఖ కిందకు వస్తుందని.. వైద్య విద్యాశాఖ మంత్రి హసన్‌ ముష్రిఫ్‌ ఆస్పత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారని సావంత్‌ తెలిపారు..

Spread the love