యమున మరోసారి ఉగ్రరూపం

–  ప్రమాదకరస్థాయి దాటిన నదీ ప్రవాహం
–  ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు రోడ్లన్నీ జలమయం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ప్రవాహం ఆదివారం మరోసారి ప్రమాదకరస్థాయి (205.81 మీటర్లు)ని దాటింది. ముఖ్యంగా, ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటిమట్టం శనివారం రాత్రి 10:00 గంటలకు 205.48 మీటర్లుగా నమోదైంది. దీంతో మరోసారి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు యమున నీటిమట్టం 206.35 మీటర్లుగా నమోదైంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో యుమునా నదిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఢిల్లీ మంత్రి అతిషీ వెల్లడించారు. గతవారం వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం అత్యధికంగా 208.05 మీటర్లకు చేరింది. గత కొద్ది రోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉంది. తాజాగా హత్నికుండ్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఉదయం 206.07 మీటర్లకు చేరుకుంది. మరోవైపు జులై 25 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ అంచనా వేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా సహా యమునా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు తలెత్తాయి. వరదల కారణంగా 27,000 మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసినట్టు అధికారులు తెలిపారు. యమునా నదిలో నీటి విడుదల పెరగడంతో గౌతమ్‌ బుద్ధ నగర్‌ పరిపాలన హిందోన్‌ వెంబడి లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరింది. రాస్‌గఢ్‌ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్వాడీలో కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. ఈ ఘటనలో 81మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం నాలుగో రోజూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. శనివారం రాత్రి సరిగా వెలుతురు లేకపోవడం, వాతావరణ ప్రతికూలతల నేపథ్యంలో సహాయక చర్యల్ని నిలిపివేసిన అధికారులు.. ఆదివారం ఉదయం మళ్లీ ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదని పేర్కొన్నారు.
నాగ్‌పూర్‌ డివిజన్‌లో వరదలు, మెరుపులతో 10 రోజుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. నాగ్‌పూర్‌, వార్ధా, భండారా, గోండియా, చంద్రపూర్‌, గడ్చిరోలి జిల్లాలతో కూడిన నాగ్‌పూర్‌ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో 875.84 హెక్టార్ల వ్యవసాయ భూమిని వర్షాలు కూడా ప్రభావితం చేశాయి. విదర్భ ప్రాంతంలోని అమరావతి, అకోలా, భండారా, బుల్దానా, చంద్రాపూర్‌, గడ్చిరోలి, గోండియా, నాగ్‌పూర్‌, వార్ధా, వాషిం, యావత్మాల్‌లతో కూడిన కొన్ని ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జూలై 22న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో అనేక చోట్ల భారీ వర్షాలు, మేఘాల పేలుళ్లు సంభవించడంతో చాలా రోడ్లు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఒరిస్సాల్లోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, రాయగడ, గజపతి, గంజాం, కంధమాల్‌, బౌధ్‌, బోలంగీర్‌, సోనేపూర్‌, బర్‌గఢ్‌, సంబల్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
పంజాబ్‌లోని హౌషియార్‌పూర్‌లో కాలీ బీన్‌ వాగులో బలమైన ప్రవాహాలకు 51 ఏళ్ల వ్యక్తి కొట్టుకుపోయాడని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం అలంపూర్‌ గ్రామానికి చెందిన మొహిందర్‌ పాల్‌, కొంతమంది గ్రామస్తులతో కలిసి కాళీ బీన్‌ వాగు సమీపంలోకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని, ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్నదని దసూయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బల్వీందర్‌ సింగ్‌ తెలిపారు.
గుజరాత్‌లో శనివారం దక్షిణ, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసింది, డ్యామ్‌లలో నీటి మట్టాలు, పొంగిపొర్లుతున్న నదుల మధ్య పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లోవరద లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆదివారం ఉదయం 6 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో జునాగఢ్‌ నగరంలో 241 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నీటి ప్రవాహానికి కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. పశువుల కళేబరాలు ప్రవహించే నీటిలో కొట్టుకుపోయాయి.

Spread the love