నిద్రలోనే.. బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం

– 8 మందికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
– బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటనొ ప్రధాని,మహారాష్ట్ర సీఎం దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో ఘోరం...
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. శనివారం వేకువ జామున జరిగిన ఈ దారుణ ఘటన అందరినీ తీవ్ర షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై భారత ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండేలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
దర్యాప్తునకు మహారాష్ట్ర సీఎం ఆదేశం
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు జరుపుతున్నామని బుల్దానా ఎస్పీ వెల్లడించారు. బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నామనీ, ఆయనను అరెస్టు చేసే ప్రక్రియ జరుగుతున్నదని చెప్పారు. ఈ ఘటనపై మోడీ, ఏక్‌నాథ్‌ శిండేలు విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ప్రధాని కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
ముంబయి : పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ప్రయాణికులతో ఒక ప్రయివేటు బస్సు నాగ్‌పూర్‌ నుంచి పూణేకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరింది. రాత్రి భోజన విరామం కోసమని యావత్మల్‌లో బస్సును ఆపారు. అటు తర్వాత అక్కడ నుంచి శనివారం వేకువజామున బస్సు బయలుదేరింది. బస్సు ఉదయం 1.30 గంటలకు నాగ్‌పూర్‌ నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింద్‌ఖేడ్‌రాజా దగ్గరలోని పింపల్‌ఖుతా గ్రామానికి చేరుకున్నది. అయితే ఆ సమయంలో బస్సు టైరు పేలి డివైడర్‌ను ఢకొీన్నది. బస్సు కుడివైపునకు పడిపోయింది. ఇది కాస్తా బస్సులో మంటలు చెలరేగటానికి కారణమైంది.అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు.. బస్సు ఒక్కసారిగా డివైడర్‌ను ఢకొీనటంతో ఏం జరుగుతున్నదో అర్థంకాని పరిస్థితిలోకి వెళ్లారు. మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. 25 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు బస్సు అద్దాలను పగులగొట్టి ప్రమాదం నుంచి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. గాయపడినవారిలో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ కూడా ఉన్నారు. బస్సు అద్దాలను పగలగొట్టి తాము ప్రమాదం నుంచి బయటపడినట్టు ఆ ఇద్దరు వెల్లడించారు.
ప్రమాదాలకు అడ్డాగా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే
నాగ్‌పూర్‌-మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌ ఫేజ్‌-1ను ప్రధాని మోడీ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. దేశంలోని పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా ఇది పరిగణించబడుతున్నది. అయితే, ఈ దారిపై నిత్యం పలు ప్రమాదాలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తున్న ది. ప్రస్తుత ప్రమాద ఘటనపై విచారాన్ని వ్యక్తం చేసిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. ప్రమాదాల నివారణ కోసం ప్రయివేటు వాహనాల స్పీడ్‌ లిమిట్‌ను తగ్గించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకో వాలని ఆయన సూచించారు. గతేడాది డిసెంబర్‌ 11 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 30 మధ్య సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై 358 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాద ఘటనల్లో 143 మందికి తీవ్ర గాయాలు కాగా, 236 మందికి స్పల్ప గాయాలయ్యాయి.
మృతులకు కేసీఆర్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, పట్ల బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దిగ్బ్రాంతికి గురయ్యారు. శనివారం ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు.

Spread the love