– మతోన్మాద భావజాలంతో యువతను తప్పుతోవ పట్టిస్తున్న బీజేపీ
– ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారు : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్
గుంటూరు: దేశంలో దాదాపు 70 ఏండ్ల తరువాత కీలకమైన ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది తీస్తా సెతల్వాద్ అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) ఏపీ రాష్ట్ర మహాసభల సందర్భంగా గుంటూరులో ప్రజాస్వామ్యం పరిరక్షణ, రాజ్యాంగరక్షణ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. సభకు ఐలూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. తీస్తా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగం రూపకల్పనలో అన్ని తరగతుల అభిప్రాయాలకు ప్రాతినిధ్యం లభించిందని, అందుకే అప్పట్లో సమానత్వానికి ప్రాధాన్యం వచ్చిందన్నారు. ఇప్పుడు రూపొందిస్తున్న చట్టాలు, చట్టసవరణలు అన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయన్నారు. ఎన్డీఏ హయంలో పార్లమెంటులోనే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంద న్నారు. వామపక్షాల మద్ధతుతో కొనసాగిన యూపీఏ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు సంబంధించిన ఎన్నో మెరుగైన చట్టాలు వచ్చాయన్నారు. ఎన్డీఏ హయంలో ప్రతి చట్టంలోనూ ప్రజల మధ్య విధ్వేషాలు పెంచడం, అధికారం కేంద్రీకరణ, ప్రశ్నించే తత్వాన్ని నియంత్రించేలా వ్యవహరించడం పరిపాటిగా మారిందన్నారు. తాజాగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో మార్పులు భవిష్యత్తు తరాల స్వేచ్చను హరించే విధంగా ఉన్నాయన్నారు. ప్రధానంగా వివిధ కేసుల్లో పోలీసు కస్టడీని 15 రోజులకు మించకుండా ప్రస్తుత చట్టాలు ఉండగా, కొత్తచట్టాల్లో 15 రోజుల నుంచి 45 రోజులకు, తరువాత 90రోజులకు పెంచుకునే వెసులుబాటు ఉండటం వల్ల పోలీసు రాజ్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందువల్ల రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. గతంలో రచయితలు, కవులుకూడా తమ కవితలు, రాతల ద్వారా ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పించారని గుర్తు చేశారు. గత తొమ్మిదేండ్ల కాలంలో ప్రశ్నించడమే నేరంగా భావించి వేధిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో నెలకొన్న విచ్ఛిన్నకర పరిస్థితులపై మేథావులు, న్యాయవాదులు, కవులు, సాహితీవేత్తలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను ప్రవేశపెట్టిన ఎన్‌డిఏ ప్రభుత్వం కార్పొరేట్లనుంచి అత్యధిక విరాళాలు తీసుకుని వీటిని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఉపయోగించుకుంటుందన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె.జి.శంకర్ మాట్లాడుతూ గుజరాత్ హైకోర్టులో రాహుల్‌గాంధీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జడ్జి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. పరువు నష్టం కేసుల్లో గరిష్ట శిక్షా కాలాన్ని అమలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఏపీ మండలి ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఐలూ అఖిల భారత కార్యదర్శి, సుప్రీంకోర్టు న్యాయవాది సురేంద్రనాథ్, ఐలూ రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్, జేకేసీ న్యాయకళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, ఐలూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.పార్ధసారధి, సమాచార చట్టం కార్యకర్త పట్నాయక్, ప్రొఫెసర్ ఎన్.రంగయ్య తదితరులు ప్రసంగించారు.
37శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తాము ఏం చేసినా చెల్లుతుందనే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానాన్ని తొలగించడం కూడా ఇందులో భాగమే. దేశంలో లౌకికతత్వానికి ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగాన్ని మతపరమైన రాజ్యాంగంగా మార్చడానికి బీజేపీ అనేక చట్టాలను తీసుకువస్తోంది. మతపరమైన భావజాలంతో 18 నుంచి 35 ఏండ్ల లోపు యువతను బీజేపీ తన వైపునకు తిప్పుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతోంది. పార్లమెంటులో 52 శాతం మంది ధనికులు ఎంపీలుగా ఉన్నారు. 2040 నాటికి ఈసంఖ్య 80 శాతంకు పెరుగుతుంది. అప్పటికి పేదల గురించి, అభాగ్యుల గురించి చర్చించేవారే లేకుండా పోతారు. – తీస్తా సెతల్వాద్