– సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలి
– విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులు విచారణ తేలే వరకు ఈడీ కేసుల విచారణ ఆపాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభరు ఎస్ ఓఖా, జస్టిస్ సంజరు కరోల్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 5కి తదుపరి విచారణ వాయిదా వేసింది.