3 నెలల ముందే హెచ్చరించినా…

సిగల్‌ వ్యవస్థలో లోపంపై రైల్వేకు ఒక అధికారి లేఖ.. అయినా పట్టించుకోని బోర్డు
న్యూఢిల్లీ : ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం భారత్‌నే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాధినేతలనూ దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 300 మంది వరకు మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడినట్టు తెలుస్తున్నది. విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం వెనుక కారణం తెలిసే అవకాశం కనిపిస్తున్నది. అయితే, ప్రస్తుతం ఒక రైల్వే అధికారి లేఖ తెరపైకి వచ్చింది. ఈ లేఖ సారాంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సుమారు మూడు నెలల ముందే సదరు రైల్వే అధికారి పెను విపత్తు గురించి అంచనా వేశారు. సిగల్‌ వ్యవస్థలో లోపంపై రైల్వే బోర్డుకు లేఖ రాశారు. దీనిని సవరించుకోవటంలో నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించాడు. రైల్వే బోర్డుకు లేఖ రాసిన సదరు అధికారి హరిశంకర్‌ వర్మ యూపీలోని లక్నోలో విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేండ్లుగా సౌత్‌ వెస్టర్న్‌ రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా ఉన్నారు. అతని పోస్టింగ్‌ సమయంలో సౌత్‌ వెస్టర్న్‌ రైల్వేలో రైలు రాంగ్‌ లైన్‌లో వెళ్లిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సిగలింగ్‌ వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపిన సదరు అధికారి దానిని వెంటనే నిషేధించాలని బోర్డుకు తెలియజేశాడు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ ఎవరి పైనా చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. రైలు స్టార్ట్‌ అయిన తర్వాత రూట్‌ మారుస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. సిగల్‌ సంబంధిత పనులను జూనియర్‌ సిబ్బంది నిర్వహిస్తుండటం వల్ల పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయని లేఖలో హరిశంకర్‌ వర్మ హెచ్చరించారు. అయితే, హరిశంకర్‌ హెచ్చరికలను రైల్వే బోర్డు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. బాధ్యులపై చర్యలూ తీసుకోలేదు. దీంతో శుక్రవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. హరిశంకర్‌ లేఖను రైల్వే బోర్డు సీరియస్‌గా తీసుకొని ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరగకపోయేదని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love