– వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై భారత్, అమెరికా రక్షణ మంత్రుల చర్చలు
న్యూఢిల్లీ : అత్యంత ఉన్నత సాంకేతికత రంగాల్లో సహకారం దిశగా రాబోయే ఐదేండ్లలో విధానపరమైన దిశను నిర్దేశించగల రక్షణ రంగ పారిశ్రామిక సహకారానికి ఒక ప్రణాళికను భారత్, అమెరికా సోమవారం రూపొందించాయి. అలాగే కొత్త సాంకేతికతల సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి గల అవకాశాలను కూడా గుర్తించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, రాజ్‌నాథ్ సింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నెలాఖరులో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆస్టిన్ పర్యటన జరుగుతోంది. సరఫరా చైన్‌లను నిర్మించడానికి గల మార్గాలను కూడా ఇరువురు మంత్రులు అన్వేషించారు. కొత్త సాంకేతికతలను కలిసి అభివృద్ధిపరచడానికి, ప్రస్తుతమున్న అలాగే కొత్త సాంకేతిక వ్యవస్థలను కలిసి ఉత్పత్తి చేయడానికి అవకాశాలను ఇరు పక్షాలు అన్వేషిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇరు దేశాలకు చెందిన రక్షణ స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని మరింత పెంచేందుకు కూడా ఆలోచిస్తున్నాయి. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇరు పక్షాలు కలిసి రక్షణ రంగ పారిశ్రామిక సహకారానికి ఒక ప్రణాళికను ఆమోదించాయని ఆ ప్రకటన తెలిపింది. రాబోయే ఐదేళ్లలో దిశా నిర్దేశాన్ని ఈ ప్రణాళికే రూపొందిస్తుంది. ద్వైపాక్షిక రక్షణ సహకార అంశాలపై గణనీయంగా ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. ముఖ్యంగా పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి గల మార్గాలను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఆదివారం సాయంత్రం సింగపూర్ నుండి రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆస్టిన్‌కు తొలుత త్రివిధ దళాల గౌరవ వందనం లభించింది. వ్యూహాత్మక ప్రయోజాలు, విస్తృత భద్రతా సహకారంతో సహా పలు రంగాల్లో రక్షణ రంగ సహకారాన్ని పెంపొందించడంపైనే చర్చలు కేంద్రీకృతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో తెలిపారు. స్వేచ్ఛా, పారదర్శకమైన, నిబంధనలకు కట్టుబడి వుండే ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారత్-అమెరికా భాగస్వామ్యం చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. మరిన్ని రంగాల్లో అమెరికాతో మరింత కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని, తద్వారా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సంఘటిత పరుచుకుంటామని చెప్పారు.