20న కోర్టుకు హాజరుకండి

– రంగారెడ్డి జిల్లా అధికారులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌లో 20 ఎకరాలకు పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌ ఇవ్వాలంటూ హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఎందుకు అమలు చేయలేదని రంగారెడ్డి జిల్లా అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. 2019లో హైకోర్టు, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ప్రతాప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఇతరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో ఈ నెల 20న జరిగే విచారణ సమయంలో స్వయంగా చెప్పాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ, గండిపేట తహసీల్దార్‌ ఎ రాజశేఖర్‌లను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రెడీ చేసినట్టు చెబుతున్న పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ తీసుకుని విచారణకు రావాలని షరతు విధించింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పింది.

Spread the love