గిరిజన యువకులకు ఉపాధి కల్పించాలి: ఎం ధర్మానాయక్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన యువకుల ఉపాధి కోసం ప్రత్యేక పథకం రూపొందించాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ట్రైకార్‌ జీఎం శంకర్రావుకు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గిరిజన ప్రాంతాల నుంచి నగరానికి ఎక్కువ సంఖ్యలో వలస వస్తున్నారని తెలిపారు. కారు, ఆటో, అడ్డమీది కూలీలుగా పనిచేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా.. ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ఆయా సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలనీ, ఉపాధి పొందే విధంగా రుణాలు ఇవ్వాలని కోరారు. వారికోసం ప్రత్యేక పథకం ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శంకర్రావు స్పందిస్తూ యువకులను కచ్చితంగా సహకరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎ కృష్ణ, ఎస్‌. కిషన్‌, భరత్‌ పాల్గొన్నారు.

Spread the love