ఒకేరోజు రైతుల ఖాతాల్లోకి రూ.3వేల కోట్లు

– 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,264కోట్ల పంట కొనుగోలు
– పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి మరీ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 64.52లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచింది. 11లక్షల మంది రైతుల నుంచి రూ.13వేల 264విలువైన పంటను కొని దశలవారీగా రైతులకు డబ్బులు జమ చేస్తున్నాం. శుక్రవారం ఒక్కరోజులోనే రైతుల ఖాతాల్లో రూ.3వేల కోట్లు జమ చేశాం. ఈనెల 20 వరకు పూర్తి డబ్బులు చెల్లిస్తాం’ అని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించిన 11లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.9,168కోట్లు జమ చేసినట్టు తెలిపారు. గతంలో కన్నా అధికంగా 7034 కొనుగోలు కేంద్రాలను తెరిచి 15లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, ఇది 90శాతానికిపైగా పూర్తయిందని వివరించారు. ఇప్పటి వరకు 18 జిల్లాల్లో సంపూర్ణంగా ధాన్యం కొను గోళ్ళు పూర్తయ్యాయని, మిగతా జిల్లాల్లో రేపటి వరకూ పూర్తి చేస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ సంస్థ చైర్మెన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ శుక్రవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.

Spread the love